Monday 12 September 2016

వేదగణితం - ఒక కథ



కథారచన :- గురుమంచి రాజేంద్రశర్మ

పద్యం :- పాతగ్రంథాల నుండి

చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘనపనస చదివి ఆశీర్వదించాడు.

అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు!
చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.

అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.

రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు.కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా!
రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! " అంటూ సున్నితంగా తిరస్కరించాడు.

"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! " అన్నాడు రాజుగారు.

మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా!
ఒక గడిలో ఒక గింజ -
రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు -
మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -
నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -
.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.

రాజు సరే ! అని ఆ పని మంత్రికి పురమాయించాడు.

ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.

తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..
‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..’

‘అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. ’

‘ఎందుచేత..?’ అన్నాడు రాజుగారు.

‘లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!’

‘ఎందుకు..?  ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు

ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా !  అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.

‘అలాగా.. ఏమిటా పద్యం..?’

‘ఇదుగో.. వినండి మహారాజా !’

శర శశి షట్క చంద్ర శర
  సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి
    తర్క పయోనిధి పద్మజాస్య కుం     
జర తుహినాంశు సంఖ్యకు ని
 జంబగు తచ్చతురంగ గేహ వి      
స్తర మగు రెట్టికగు
            సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

పద్యం విన్న మహారాజు ‘దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలు తప్ప..’

‘అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..’

‘సరే… సరే.. విప్పి చెప్పు..’

 ‘ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..

ఈ పద్యంలో

శర, సాయక, -  అనే పదాలకు అర్థం బాణాలు అని .( మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి. 

గగన, వియత్ - 0
(ఆకాశం గగనం శూన్యం)

శశి, చంద్ర, తుహినాంశు -1 
(చంద్రుడొకడే భూమికి )

షట్కము - 6 

రంధ్ర - 9  

(నవరంధ్రాలు)
నగ, గిరి, భూధర - 7 

అగ్ని - 3 
(మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని,ఆహవనీయాగ్ని)

అబ్ధి, పయోనిధి - 4 

వేద -4
(చతుర్వేదములు)

తర్క - 6
( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)

పద్మజాస్య - 4 
(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)

కుంజర - 8
(అష్ట దిగ్గజములు)

ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’
శర శశి షట్క చంద్ర శర
5     1     6         1    5
            సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
                  5       9       0         7  3
ధర గగనాబ్ధి వేద గిరి
  7     0  4      4    7
            తర్క పయోనిధి పద్మజాస్య కుం
               6         4           4     
జర తుహినాంశు సంఖ్యకు ని
8       1
            జంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు   సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్


అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -
కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..

అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.

1,84,46,74,40,73,70,95,51,615

ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615

ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,
4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..

పేర్చుకుంటూ వెళితే  300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.

పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే
సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి  58,495 కోట్ల సంవత్సరాలు..
అదీ సంగతి…

వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు ,ధారణ శక్తికి సంబంధించినదే ! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ గణాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం ? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .

అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు. 

ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నే అడుగుదాము. అని ఆ పండితున్ని పిలిపించి క్షమించుమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు .

ఆ పండితుడు" రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా అవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.

                                     స్వస్తి

                  ( ఓపికగా చదివిన వారికి)

                        ధన్యవాదములతో

                         గురుమంచి రాజేంద్రశర్మ



Friday 9 September 2016

కాలయాపనం అనే విఘ్నాన్ని తొలగించే మహాగణపతి


వినాయక నమోస్తుతే! - 5


------------------------------





రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

మన అభివృద్ధిని నిరోధించే విఘ్నాలలో మరొకటి కాలయాపనం .

5. కాలయాపనం

-------------------------

ఈ " కాలయాపనం " అనే విఘ్న బీజం మన దేశంలో ఎక్కువ మందిలో కనిపిస్తూ వుంటుంది.

కాలయాపనం అంటే " పనులను వాయిదా వేయడం".

సమయం అందరికి సమానమే అయినా కొంత మంది మాత్రమే తన సమయాన్ని అవసరమూ, ఉపయోగకరమైన పనులు చేయడానికే ఉపయోగిస్తారు.  వీరు అభివృద్ధిలో మిగతా వారి కంటే ముందుంటారు.

చాలా మంది అనవసర కాలక్షేపం కోసం సమయం కేటాయిస్తారు.ఈ విధంగా అనవసర కాలక్షేపం చేసేవారు అభివృద్ధి విషయంలో విఘ్నాలను ఎదుర్కుంటారు.

" కాలయాపనం " అనే విఘ్న బీజం కలిగిన వ్యక్తి అన్ని విషయాలను ఆలస్యం చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేస్తుంటాడు.

" మన అంతరంలో ఉన్న స్వభావాన్ని బట్టే మనకు జరిగే సంఘటనలు ఉంటాయి. "

స్వభావాలు అనేవి బీజాలైతే.. జరిగే సంఘటనలు అనేవి వాటి ఫలాలు.

పనులను వాయిదా వేసే స్వభావం ఉన్నవారికి  జరగవలసిన శుభాలు కూడా వాయిదా పడుతుంటాయి.

ఈ కాలయాపనం అనే విఘ్నం నాలుగు రకాలు.
1)  శారీరకం
2) మానసికం
3) బౌద్ధికం
4) ఆథ్యాత్మికం

ఈ నాలుగు రకాల కాలయాపనలు కూడా అభివృద్ధికి అతి పెద్ద ఆటంకాలు.వాటి గూర్చి కొంత వివరంగా తెలుసుకుందాం!

1) శారీరకం 
-------------------
"శరీరంతో చేయవలసిన అవసరమూ, ఉపయోగకరమైన పనుల పట్ల ఏకాగ్రత లేకపోవడం వల్ల పనులను వాయిదా వేయడం" - ఈ శారీరక విభాగంలోకి లోకి వస్తుంది.

మన అభివృద్ధికి అవసరమైన 50% విషయాలు ఇందులోనే ఉంటాయి.

నిజానికి ఎవరికైనా మొదటి అవసరమూ, ప్రాధాన్యత ... ఆరోగ్యమే!

కాని, ఆరోగ్యంగా ఉండడానికి చేయవలసిన వాకింగ్ - వ్యాయామం - ఆరోగ్యకరమైన ఆహారం - ఆరోగ్యకర నిద్ర.. మొ|| వాటి విషయం లోని ఆచరణను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటాము. దీని వల్ల భవిష్యత్తులో ఆరోగ్యం విషయంలో విఘ్నాలు ఏర్పడి,అది మిగతా అన్ని రకాల అభివృద్ధి పై ప్రభావం చూపిస్తుంది.

ఇది కారులో ప్రయాణం చేస్తూ అత్యవసర తొందర ఉండడం వల్ల కారులో ఇంధనం ( పెట్రోలు.. etc.. Fuel) మరిచిపోవడం లాంటిది.

ఇంకా ఇందులో ...
మన అభివృద్ధి కీ, అదనపు ఆదాయం కోసం శరీరంతో  వెంటనే అమలు చేయవలసిన పనులను వాయిదా వేయడం ...
ఇంటికి అవసరమైన పనులూ - రిపేర్లు వాయిదా వేయడం ...
తాను గానీ, తన పిల్లలు గానీ శరీరంతో నేర్చుకునే డ్రైవింగ్ - స్విమ్మింగ్ లాంటి పనులను వాయిదా వేయడం ...
.... ఇలా చివరకు సమయానికి నిద్ర లేవకపోవడం - తినకపోవడం - స్నానం చేయకపోవడం - పడుకోకపోవడం వంటి అనేక విషయాలు ఈ విభాగంలోకే వస్తాయి.

ఇది క్రియాశక్తికి సంబంధించినది.క్రియాశక్తిని భారతీయ తాత్వికులు లక్ష్మీదేవి అని పిలుస్తారు.

ఈ శారీరక కాలయాపనం చేసే విఘ్న బీజం వల్ల ఆర్థిక అభివృద్ధి - కీర్తివృద్ధితో సహా అన్ని రకాల ఎదుగుదలలు (అష్టలక్ష్మీ ప్రసాదించే ఐశ్వర్యాలు ) తగ్గిపోతుంటాయి.

2) మానసికం 
-------------------
ప్రధానంగా ఇందులో కుటుంబ సభ్యులతో, బంధువులతో, మిత్రులతో, సమాజంతో మానసిక బంధాలను వృద్ధిపరుచు కోవడాన్ని వాయిదా వేస్తుంటాము.

కాని, నిజంగా కష్టాలు వచ్చినపుడుగానీ, విజయాన్నీ పొందే సంధర్భంలో కాని అండగా నిలబడేది వీరే.

ఇది "బాగాలేని టైర్లు కలిగిన కారులో
దూర ప్రాంతానికి ప్రయాణించడం లాంటిది."

3) బౌద్ధికం 
------------------
ఇందులో అవసరమూ -
ఉపయోగకరమైన జ్ఞానసంబంధ
విషయాలు నేర్చుకోవడాన్ని వాయిదా వేస్తుంటాము.

కొంత మంది " పుస్తక పఠనం " వల్ల ఏం లాభం? అనుకుంటారు.

" ఒక మనిషి తన జీవితంలో సాధించిన అనుభవ జ్ఞానాన్ని ఒక మంచి పుస్తకం
అందిస్తుంది."

ఆ అనుభవ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల మన జీవితంలో ఎంతో సమయం సద్వినియోగమై మనం అభివృద్ధి మార్గంలో మరింత ముందుకు వెళ్లగలుగుతాము !

తాత్వికంగా పరిశీలిస్తే ..
జ్ఞానం పెరిగినా కొద్ది తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధిస్తుంటాము. అంటే శ్రమ చేసే అవసరం తగ్గుతుంది.

"నేను ఎంత శ్రమ పడినా ఫలితం ఉండడం లేదు" అని ఎవరైనా భావిస్తున్నారంటే వారు జ్ఞానాన్నీ వాయిదా వేస్తున్నారనే అర్థం.

శ్రమించడాన్ని మానకుండా జ్ఞానాన్ని పెంచుకుంటున్నా కొద్ది మనిషి అభివృద్ధి స్థాయి కూడా పెరుగుతుంది.

ఈ రకం కాలయాపన అనేది..
" బాగా రిపేర్లు అవసరమైన కారులో దూర ప్రయాణం చేయడం లాంటిది."

4) ఆథ్యాత్మికం
---------------------
   
     నిజానికి ఆథ్యాత్మికం అంటే "తన గురించి తాను తెలుసుకోవడం".

ఒక సాధకుడు తన గురించి తాను తెలుసుకుంటూ వెళ్లినా లేదా భగవంతుని గూర్చి తెలుసుకుంటూ వెళ్లినా చేరుకునే గమ్య స్థానం ఒక్కటే!

వేదంలో తన గురించి తాను తెలుసుకోవాలని అంతర్ముఖుడై తపస్సు చేసిన ఒక బుుషి సత్యాన్ని దర్శించిన తరువాత ఆనందంతో ఇలా గానం చేస్తాడు.

" హ➡ ఉ, హ➡ ఉ, హ➡ ఉ, "
అంటూ...

సంస్కృతంలో " అహమ్ "అంటే నేను అని అర్థం.

సత్యాన్ని దర్శించిన తరువాత " అహమ్ " లోని "హ ''అక్షరం "ఉ" గా మారిందట!

అంటే..

అహం = అ+ హ+ మ్➡ అ+ ఉ+మ్➡ ఓమ్

కాబట్టి తన గూర్చి తాను తెలుసుకోవడమన్నా, భగవంతుని గూర్చి తెలుసుకోవడమన్నా ఒకటే!

మనిషి ఆథ్యాత్మిక సాధనలను వాయిదా వేయ్యకుండా చూసుకోవాలి.

దీని వల్ల మన ప్రమేయం ఉన్నా,లేకున్నా మనకు అంటుతూ ఉండే అపవిత్రతల నుండి బయటపడతాము.

ఏ మనిషైనా తాను ఏ విషయాలపై ఏకాగ్రత చూపుతున్నాడు, ఏ విషయాలలో లీనమౌతున్నాడు అనే దాన్ని బట్టి అతని అభివృద్ధి ఉంటుంది.

1.కొందరు ఆహారం, నిద్ర, అనవసరవిందులు, అనవసర కాలక్షేపాలు, అధర్మకామం.. మొ|| వాటిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

2.కొందరు ఆవేశాలు, కోపం, దు:ఖం, రాగం, ద్వేషం.. మొ|| వాటిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

3.కొందరు డబ్బు, కీర్తి, అధికారం,  హోదా... మొ॥ వాటిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

4. మరి కొందరు జ్ఞానసంబంధ విషయాలలో లేదా కళా సంబంధ విషయాలలో  తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

5.ఇంకా కొందరు భగవత్ భక్తిలో తీవ్రమైన ఏకాగ్రతను చూపుతూ లీనమై తనను తాను మరచి పోతుంటారు.

6.చాలా కొద్ది మంది తనను తాను మరచిపోకుండా ఎప్పుడూ కాన్సియస్ గా ఉంటారు.అంటే తన కాన్సియస్ మీదనే ఏకాగ్రతను కలిగి ఉంటారు.

ఏకాగ్రత శక్తి వృద్ధి చెందుతున్న కొద్ది మనిషి ఒక స్థితి నుండి తరువాత స్థితికి ఎదుగుతాడు. ఈ ఆరు రకాల ఏకాగ్రతలలో ఒకదానికన్న తరువాత వచ్చేది ఉత్తమం.

మొత్తం మీద ఆథ్యాత్మిక శక్తి పెంచుకోవడం అంటే కాన్సియస్ గా ఉండే స్థితిని పెంచుకోవడమే!

ఈ కాలయాపనం..
"ఎలాంటి వాహనం, రక్షణ , చిరునామా లేకుండా అతి కష్టమైన సదూర ప్రయాణానికి కాలినడకన బయలు దేరడం లాంటిది."

క్రియాశీలుడైన వ్యక్తి అన్ని రకాల కాలయాపనల స్వభావాలను తొలగించుకుంటూ ప్రతీక్షణం సన్నద్ధంగా ఉండాలి.అప్పుడు అతని వెంట శుభాలు పరుగులు తీస్తాయి .

ఈ "కాలయాపనం" అనే విఘ్న బీజం  వల్ల చాలా మంది అభివృద్ధి విషయంలో ఆటంకాలను ఎదుర్కుంటారు.
.
ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు బ్రాహ్మీ ముహుర్తంలో లేదా సాయం సంధ్యా సమయంలో స్నానం చేసి వేయి సార్లు "ఓం శ్రీం హ్రీం క్లీం శీఘ్రకారిణే నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో అత్యంత ఏకాగ్రతగా జపించాలి.



                 స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

దంతకల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ |
బంధూకకమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ ||

                 (ఓపికగా చదివిన వారికి )
                       ధన్యవాదములతో

           గురుమంచి రాజేంద్రశర్మ





Wednesday 7 September 2016

మహాగణపతి తొలగించే మరోవిఘ్నం - అవిరతి

వినాయక నమోస్తుతే! - 4

------------------------------




రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

మన అభివృద్ధిని నిరోధించే విఘ్నాలలో మరొకటి అవిరతి.

4. అవిరతి

(1. బిజీగా ఉన్నాననుకోవడం. 
మరియు 
2. నిగ్రహం లేకపోవడం)
---------------------------------------------

సంస్కృతంలో " అవిరతి " అనే శబ్దానికి రెండు రకాల అర్థాలు ఏర్పడుతున్నాయి.

1. " విరతి " అంటే విరామం..
" అవిరతి " అంటే విరామం లేనంత 'బిజి'గా ఉన్నాననుకోవడం...

2. " రతి " అంటే ఆసక్తి.
   " విరతి " అంటే ఆసక్తి లేకపోవడం.
" అవిరతి " అంటే ఆసక్తిని వదలకపోవడం (మనో నిగ్రహం లేకపోవడం)

ఈ రెండు విషయాలు కూడా అభివృద్ధి విషయంలో ఆటంకాలే!

కొంతమంది ఎప్పుడూ "బిజి" గా , హడావుడిగా ఉంటారు.
ఉదయం 6.30 కు నిద్ర లేవడం - 45 ని॥టాయిలెట్ , స్నానం - మరో అరగంట పేపర్ చదవడం - తరువాత టిఫిన్ చేసి ఆఫీస్ కు ప్రయాణం - 8 నుండి 9 వరకు ఒక గంట ప్రయాణం - 9 am నుండి 5 pm వరకు ఆఫీస్ - 5 pm నుండి 6 pm తిరుగు ప్రయాణం - మరో గంట స్నేహితులతో గడపడం - ఇంటికి వచ్చి అరగంట ఫ్రెషప్ కావడం - భోజనం - ఒక గంట TV చూస్తూ రిలాక్స్ కావడం - తరువాత నిద్ర.

చిన్న చిన్న మార్పులతో దాదాపు ఇలాంటి దినచర్య తో రోజంతా బిజీగా ఉంటారు. 

మానసికంగానేమో "ఉదాసీనత " లేదా " ఓత్తిడి "ని కలిగి ఉంటారు.దేనికైనా "టైం లేదు " అంటూంటారు.

అభివృద్ధి మాత్రం ఎక్కడున్నది అక్కడే ఉంటుంది.

ఒకసారి గొప్ప వారిగా ఎదిగిన వారి దినచర్యను మనం గమనిస్తే.. వారు ఎన్నో పనులు చేస్తూ కూడా ఇంకా సమయాన్ని మిగల్చుకుని తమ తమ అభిరుచులకు అనుగుణంగా ఆ సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు.

ఎక్కడుంది తేడా !

అదే " క్రియాశీలత ''

క్రియాశీలుడైన వ్యక్తి ఉత్సాహం, క్రొత్తదనం, సన్నద్ధత కలిగిన మనసుతో ఎన్నో పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ తిరిగి ఆ పనుల నుండే మళ్లి మళ్లి ప్రేరణ పొందుతూ మానసికంగా "నవ యువకుడు"గా ఉంటాడు.

ఆరోగ్య పరంగా, కీర్తిపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, వ్యక్తిత్వ పరంగా, ఆథ్యాత్మికంగా .... ఇలా అన్ని రకాల అభివృద్ధి కోసం సమయాన్ని కేటాయించుకుంటూ నిరంతరం సాధన చేయడం అవసరం. అప్పుడే జీవితంలోని మాధుర్యం అర్థమౌతుంది.

సనాతన ధర్మం నిర్వచించే "పురుషార్థ సాధన "లో ఇవన్ని ఇమిడే ఉంటాయి.

" నాకు టైం లేదు", " నేను చాలా బిజీ " అని అనుకోవడం కూడా అభివృద్ధికి విఘ్న బీజంగా మారుతుందని శాస్త్రం చెబుతుంది.

ఇక రెండో అర్థమైన " మనో నిగ్రహం "గూర్చి.....

ఆభివృద్ధి సాధించాలనుకునే వ్యక్తి తప్పనిసరిగా మనో నిగ్రహాన్ని కలిగి ఉండాలి.దేనికీ బానిస కాకూడదు.

" నేను 'టి' తాగకుంటే తలనొప్పి వస్తుంది "...

" మద్యం లేకపోతే శరీరం వణుకుతుంది."....

" TV చూడకపోతే ఒంటరితనంతో పిచ్చి పట్టినట్లుగా ఉంటుంది " .....

ఇలాంటి భావాలకు సంబంధించిన అన్ని రకాల మానసిక బలహీనతలను జయించాలి.

అవసరమైతే ఎప్పుడైనా నిద్రపోగలగాలి. ఎప్పుడైనా నిద్ర నుండి లేవగలగాలి.అప్పుడు కూడా అంతే ఏక్టివ్ గా ఉండగలగాలి.
ఒకటి, రెండు రోజులు భోజనం లేకపోయినా తట్టుకోగలగాలి. జీవించడానికే ఆహారాన్ని తీసుకోవాలి కానీ, కేవలం తినడం కోసమే బ్రతకగూడదు.

" జిహ్వ చాపల్యం " వల్ల పొందే సుఖం - చాలా తక్కువస్థాయి సుఖం " అని శాస్త్రం చెబుతుంది.

నిరంతర అభ్యాసం వల్ల మనకు ఈ మనో నిగ్రహం పెరుగుతూ పోతుంది.
ఈ మనో నిగ్రహం వల్ల మానసిక స్థైర్యం అలవడుతుంది.

దీనినే సంస్కృతంలో "ధృతి" అంటారు.

మనలో ఏర్పడిన ఈ "ధృతి" ఆత్మవిశ్వాసాన్నీ ,సంతోషాన్నీ , తృప్తినీ ,వివేకాన్నీ ఏర్పరచి అభివృద్ధికి కారణమౌతుంది.

మన సర్వతోముఖాభివృద్ధిలో ఎదురయ్యే అన్ని రకాల అంతరాయాలనూ - విఘ్నాలను ఈ "ధృతి" వల్లనే అధిగమించగలుగుతాము.

ఈ "అవిరతి " అనే విఘ్న బీజం వల్ల చాలా మంది అభివృద్ధి విషయంలో ఆటంకాలను ఎదుర్కుంటారు.

ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు బ్రాహ్మీ ముహుర్తంలో స్నానం చేసి వేయి సార్లు  "ఓం శ్రీం హ్రీం క్లీం ధృతిమతే నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో అత్యంత ఏకాగ్రతగా జపించాలి.
                 

                               స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

గణేశో విశ్వేఽస్మిన్ స్థిత ఇహ చ విశ్వం గణపతౌ
గణేశో యత్రాస్తే ధృతి మతిరనైశ్వర్యమఖిలమ్|
సముక్తం నామైకం గణపతిపదం మంగలమయం
తదేకాస్యం దృష్టేః సకలవిబుధాస్యేక్షణ సమమ్|| 
       

                      (ఓపికగా చదివిన వారికి )
                       ధన్యవాదములతో
                     గురుమంచి రాజేంద్రశర్మ



ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....





నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి

1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.

2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.

3. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని.

ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో....

1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు. నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో.

నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు. అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది.  నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త,  గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా!

2. ఏ ఒకరూ తప్పనిసరి కాదు, తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.
ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.

3. జీవితం చిన్నది.
ఒక రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.

4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన. కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాదలను అన్నింటినీ కడిగేస్తుంది, కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనించు.

ప్రేమ సౌందర్యాన్ని , అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో  ( Damn crazy movies! )

5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.

దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.

6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో.

7. నువ్వు నీ మాట నిలబెట్టుకో, ఇతరులనుంచి ఇది ఆశించకు. నువ్వు అందరితో మంచిగా ఉండు, అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే  నీకు అనవసర సమస్యలు తప్పవు.

8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము.

9. అది ఎంతకాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా!


                                       ............ నాన్న
సోర్స్ :- వాట్సాప్

Tuesday 6 September 2016

దిగులు పడడాన్ని తొలగించే మహాగణపతి


వినాయక నమోస్తుతే! - 3




రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

మన అభివృద్ధిని నిరోధించే విఘ్నాలలో మరొకటి దౌర్మనస్యం.

3. దౌర్మనస్యం (దిగులు )
---------------------------------------------

" దౌర్మనస్యం " అంటే దిగులు.

చాలా మందికి చాలా సార్లు ఈ దిగులు అనే విఘ్న బీజం ఏర్పడుతూ వుంటుంది.
" దిగులు " తో ఉండడం వల్ల నిరంతరం మనసు ఏదో కోల్పోయినట్లుగా ఉండి, తన స్థితి తనకే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ "దిగులు" అనే విఘ్న బీజం అభివృద్ధినీ, జీవితాన్ని కూడా సార హీనం చేస్తుంది.

విజయాలు లేకపోవడం వల్ల.. పరాజయాల వల్ల ఈ దిగులు ఏర్పడుతూ వుంటుంది.
గతం వల్ల బాధ, ఉన్న స్థితి పట్ల అసంతృప్తి, లేదా భవిష్యత్తు పట్ల భయం ఈ దిగులుకు కారణమౌతాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే....

"దిగులు అంటే ఉత్సాహం కొరవడడమే!"

దీనికి పరిష్కారం తిరిగి మనలో ఉత్సాహాన్ని నింపుతూ ఉండడమే !

అందుకు ఈ " ఉత్సాహం " ఎలా ఏర్పడుతుందో అర్థం చేసుకోవాలి.
వాటిని ఈ క్రింద వివరిస్తున్నాను.

1) విజయాలు సాధించడం వల్ల...

ఇక్కడ విజయం అంటే ఏదో పెద్ద విషయమే కానక్కరలేదు.4 am కు నిద్ర లేద్దామనుకుని లేవడం కూడా విజయమే!.. ఇలాంటి చిన్న చిన్న విజయాలే భవిష్యత్తులో మరిన్ని పెద్ద విజయాలను ముందుకు తెస్తాయి.

(దీని గూర్చి " అలబ్ద భూమికత్వ" అనే విఘ్న బీజాన్ని వివరించే సందర్భంలో సమగ్రంగా వివరిస్తాను.)

2) క్రియాశీలవంతులతో స్నేహం, సాంగత్యం వల్ల....

3) సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల...

4) అంతర్వాణి మాటలను సరిగ్గా ఆచరించడం వల్ల....

5) నిస్వార్థం వల్ల.. (ఆశించకపోవడం, సేవ.. etc)

6) ఆత్మ విశ్వాసం వల్ల...

7) మనో నిగ్రహం వల్ల...

8) జ్ఞానం వల్ల... (ఉదా:- మంచి పుస్తకాలను చదవడం, మేధావంతులతో స్నేహం.. etc)

9) క్రొత్తదనం వల్ల...

(క్రొత్త ప్రదేశాలను దర్శించడం, అలవాటు లేని ఉపయోగపడే పనులను చేయడం - నేర్చుకోవడం, క్రొత్త విషయాలను నేర్చుకోవడం.. etc)

10 ) శరీరానికి అవసరమైన వ్యాయామం వల్ల.. (నడుక, ఆసనాలు.. etc)

11) అనవసర ఆహారం తీసుకోకుండా తేలికగా జీర్ణమయ్యే ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవడం వల్ల.. ( జీర్ణశక్తిని మించి ఆహారాలు  తీసుకున్నపుడు ఉత్సాహం తగ్గుతుంది.)

12) ఏదో ఒక కారణంతో అనవసర పస్తులు ఉండకుండా తగినంతగా సారవంతమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల...

13) దుర్వ్యసనాలు మానివేస్తూ మంచి అలవాట్లను పెంచుకోవడం వల్ల...

14) ఎవరినీ ద్వేషించక పోవడం వల్ల.. ( తననూ, తన పరిస్థితులతో సహా..)

15) కళల వల్ల.. (కళలను నేర్చుకునే ప్రయత్నం చేయడం .. కళల ద్వారా ఆనందాన్ని పొందగలగడం.. etc)

16) క్రీడల వల్ల... ( ఏదో ఒక ఆటలను ఆడుతూ ఉండడం..etc)

17) ఆసక్తిని పెంచుకుంటూ అన్ని పనులను చేయడం వల్ల..

( పనులను నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఉదాసీనత ఏర్పడుతుంది. క్రమేణా ఈ ఉదాసీనత దిగులుగా మారుతుంది.)

18) తెల్లవారు జామునే నిద్ర లేవడం వల్ల...

19) పెండింగ్ పనులను ఒక లిస్ట్ రాసుకుని పూర్తి చేయడం వల్ల...

20) తననూ, ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల..

21) పెద్దలను నిందించకపోవడం వల్ల..

 (మనం పెద్దలను నిందించినపుడు అది తప్పని మన సబ్ కాన్సియస్ మైండ్ లో నిక్షిప్తమౌతుంది. ఇలా చాలా సార్లు జరుగుతూ వుంటే భవిష్యత్తులో అది మనది మనకే అర్థం కాని దిగులుగా మారుతుంది.)

..... ఇలా రకరకాలుగా "ఉత్సాహం " పెరుగుతుంది.

ఉత్సాహం పెరగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

దిగులుగా ఉండేవారు ఈ విషయాలను పాటిస్తూ సాధన చేస్తూ వుంటే తొందరగా కోలుకుంటారు.

నిజానికి ఈ " ఉత్సాహం " అనేది అభివృద్ధి కే కాదు, మానవ జీవితానికే "బీజం " లాంటిది.

"నిరంతర ఉత్సాహం " అనేది బీజమైతే "బ్రహ్మనందం "దాని ఫలమౌతుంది.

ఒక్కొక్క సారి చెడు విషయాల వల్ల కూడా " తాత్కాళిక ఉత్సాహం" కలుగుతుంది.
ఇది "ఒక గాయాన్ని గోకితే వచ్చే సుఖం లాంటిదని " నీతి శాస్త్రం చెబుతుంది. ఇలాంటి తాత్కాళిక ఉత్సాహాలు దీర్ఘకాలికంగా మనకూ, మన అభివృద్ధికి నష్టాన్నే కలగజేస్తాయని అనుభవం మీద అర్థం అవుతుంది.

ఈ దౌర్మనస్యం (దిగులు ) అనే విఘ్న బీజం వల్ల ఎంతో మంది  ఆనందాన్నీ, అభివృద్ధినీ కోల్పోతుంటారు.

ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు ప్రాత:కాలం స్నానం చేసి వేయి సార్లు  "ఓం శ్రీం హ్రీం క్లీం ప్రమోదాయ నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో అత్యంత ఏకాగ్రతగా జపించాలి.
                

                                             స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్|
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ |
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ౹౹


       (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో
        గురుమంచి రాజేంద్రశర్మ
     
        శ్రీ రవీంద్ర జ్యోతిషాలయం



Monday 5 September 2016

అనుమాన పడే గుణాన్ని తొలగించే మహాగణపతి

వినాయక నమోస్తుతే! 2

----------------------------------------------------



రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

మహా గణపతి తొలగించే విఘ్నాలలో మరొకటి సంశయం.

2. సంశయం (అనుమానాలు )
---------------------------------------------

అభివృద్ధి చెందడానికి అవరోధాలను కలిగించే మరో విఘ్నం "సంశయం."

సంశయం అంటే అనుమానాలు.

మనలో సోమరితనం - బద్ధకం - అజ్ఞానం పెరుగుతున్నా కొద్ది అనుమానాలు కూడా పెరుగుతుంటాయి.అంతే కాదు తెలిసి తెలిసి తప్పులు చేయడం వల్ల అనుమానపడినట్లే జరుగుతుంది కూడా! ఇది క్రమేణా మూఢ నమ్మకాలకు కారణమౌతుంది.

( ఇక్కడ మనకో సందేహం రావచ్చు! అజ్ఞానం కూడా పెరుగుతుందా అని.
మనలో కాన్సియస్ గా ఉండే స్థితి తగ్గుతూ ఉన్నదంటే అజ్ఞానం పెరుగుతుందనే అర్థం. మనలో కాన్సియస్ నెస్ తగ్గుతున్న కొద్ది జాగరూకత కూడా తగ్గుతుంది.అప్పుడు శ్రద్ధగా వినలేము. శ్రద్ధగా చదవలేము. శ్రద్ధగా మాట్లాడలేము. శ్రద్ధగా పని చేయలేము. అన్ని విషయాలలో నాణ్యత తగ్గుతుంది. నిజానికి సంపూర్ణ కాన్సియస్ స్థితి పొందడమే మోక్షం లేదా ఆత్మ జ్ఞానం. ఈ స్థితిని సాధించిన వారిని శాస్త్రం జ్ఞాని అని సంభోదించింది.)

మనలో అత్యధిక క్రియాశీలకశక్తి ఏర్పడినపుడు మనం ఏది చేసినా అది సరియైనదే అవుతుంది.అంతే కాదు, అది శాస్త్రాన్ని అనుసరించే ఉంటుంది.

ఈ విషయాన్ని నా జ్యోతిష అనుభవంలో కూడా పరిశీలించి చూశాను. క్రియాశీలత అధికంగా కలిగిన వారు జ్యోతిషం ( ముహూర్తం - జాతకం లాంటివి) ఏదీ చూసుకోకుండానే ప్రారంభించిన ముహూర్తాలను జ్యోతిష దృష్టితో పరిశీలించి చూసినపుడు అవి అద్భుతమైన ముహూర్తాలై ఉంటున్నాయి.అంటే కాలస్వరూపుడైన భగవంతుడు వారికి స్వయంగా సహాకరిస్తున్నాడన్న మాట!
నిజానికి అత్యధిక క్రియాశీల సంపన్నుడు శాస్త్రాన్ని అనుసరించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే శాస్త్రమే తానౌతాడు కాబట్టి!

అలాంటి వారి నుంచే శాస్త్రాలు ఏర్పడ్డాయి కాబట్టి! అయితే మనిషి సంపూర్ణ క్రియాశీలతను సాధించే వరకు మాత్రం శాస్త్రాన్ని అనుసరించవలసిందే!

( క్రియాశీలతను సాధించే మార్గంలో ఉన్న వ్యక్తికి మాత్రమే కాలం, ప్రకృతి శక్తులు సహాకరిస్తూ ఉంటాయి.)

ఈ " అనుమానాలు " అనేవి అభివృద్ధికి అతి పెద్ద విఘ్నాలు.

ఉదాహరణకు ....

ఒక పిల్లవాడికి ఏదో వాహనం వల్ల ప్రమాదం జరిగి కోలుకున్నాడనుకుందాము!
అతని తల్లిదండ్రులు అప్పటి నుండి అతన్ని బయటకు వెళ్లనివ్వకపోవడం -సిరియైన విధంగా ఆడుకోనివ్వకపోవడం - భయాన్ని నూరిపోయడం ..(అంతకు ముందు జాగ్రత్త లేక పోవడం, సంఘటన తరువాత అతి జాగ్రత్త పాటించడం..).... ఇలా అతని శారీరక తేజస్సుకు అవరోధాలు కల్పిస్తుంటారు. ఇది అతని అభివృద్ధిపై ప్రభావాన్ని చూపిస్తుంది.సాధారణంగా ఇలాంటి పిల్లవాడి తల్లిదండ్రులు జడస్తులై ఉంటారు.

గమనించ వలసిన విషయమేమిటంటే....

" అనుమానస్తులు అన్ని విషయాలు సేకరిస్తారు.కాని, ఏదీ ఆచరించరు. కారణాలను ఇతరులపైకో, పరిస్థితులపైకో నెట్టి వేస్తుంటారు. "

జడస్తుల అనుమానాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే...

"ఒక రోజు మొదటిసారిగా వాకింగ్ కు వెళ్లాడనుకోండి! అదే రోజు జ్వరం వచ్చింది. అప్పటి నుండి " నాకు వాకింగ్ అచ్చి రాదు" అని మనసులో బలంగా నిర్ణయించుకుంటాడు. ఈ వ్యతిరేక ధ్యానం వల్ల అతడు ఎప్పుడు వాకింగ్ కు వెళ్లినా ఏవో ఒక సమస్యలు ఏర్పడుతుంటాయి.
తరువాత " నాకు వాకింగ్ అచ్చి రాదు" అన్న స్థిర అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటాడు. తరువాత ''మనకు వాకింగ్ అచ్చి రాదురా !" అంటూ కుటుంబంలోని వారందరికి నూరిపోస్తాడు.ఇలా మూఢ నమ్మకాలు ఏర్పడుతుంటాయి.ఇవి అభివృద్ధిని నిరోధిస్తూ ఉంటాయి.

అనుమానస్తులు (జడస్తులు) ఎప్పుడూ ఎటూ నిర్ణయించుకోలేని స్థితి (కన్ ఫ్యూజ్) లోనే ఉంటారు.

ఇంకా భార్యా భర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అనుమానాలు.. మున్నగునవి కూడా ఇందులోకే వస్తాయి. అనుమానపడే సంఘటనలు నిజంగానే జరిగినా, అనుమానపడినా కారణం మాత్రం జడత్వమే!(సోమరితనం - బద్ధకమే!)
దీనికి పరిష్కారం క్రియాశీలతను పెంచుకుంటూ పోవడమే! మనలో క్రియాశీలత పెరిగిన కొలది అనుమానాలు నశిస్తూ ఉంటాయి. అనుమానపడిన విషయాలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి.
ఉపయోగపడే పనులతో ప్రతి క్షణం బిజిగా ఉంటూ క్రియశీలమౌతున్న కొద్ది " కేవలం రావలసిన ఆలోచనలే వస్తుంటాయి.

" ఆచరిస్తేనే తెలుస్తుంది... తెలుస్తు ఉన్నా కొద్ది ఆచరిస్తుంటాము. ఇది నిరంతర ప్రక్రియ. 

అంటే "కర్మ  నుండి జ్ఞానం"..." జ్ఞానం నుండి కర్మ " ఏర్పడుతున్నాయనీ,  కర్మజ్ఞానాలు రెండు వేరు వేరు కావనీ... అవి రెండూ ఏకీకృత రూపాన్ని పొందే ఉన్నాయని అనుభవ పూర్వకంగా తెలుసుకుంటాము.

ఈ సంశయం (అనుమానం ) అనే విఘ్న బీజం వల్ల ఎంతో మంది సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోలేక అభివృద్ధి పథంలో వెనుక పడుతుంటారు.ఈ విఘ్న బీజం తొలగడానికి ప్రతి రోజు ప్రాత:కాలం స్నానం చేసి పాదరక్షలు ధరించకుండా "ఓం శ్రీం హ్రీం క్లీం కళ్యాణ గురవే నమ: " అనే గణపతి మంత్రాన్ని మనసులో జపిస్తూ ఒక గంట సేపు (రెండున్నర ఘడియలు) వాకింగ్ చేయాలి.

                 స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

నమోస్తు గణనాథాయ
సిద్ధిబుద్ధియుతాయచ |
సర్వ ప్రదాయ దేవాయ
పుత్రవృద్ధి ప్రదాయ చ ||



  (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

       గురుమంచి రాజేంద్రశర్మ









మహాగణపతి తొలగించే విఘ్నలు - 1.అలసత్వం

వినాయక నమోస్తుతే!

------------------------------

   మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు 


రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

విఘ్నాలు తొలిగించే శక్తి ఉన్న ఒకే ఒక దేవతామూర్తి విఘ్నేశ్వరుడు . అందుకే విఘ్నాలు తొలగించే నాయకుడిగా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం. 

దేవతాగణాలన్నింటికీ కూడా ఆయనే అధిపతి.అందుకే ఆయనను వినాయకుడు - గణపతి అనే పేర్లతో పిలుస్తున్నాము.


జాతకం లో ఉన్న కేతు దోషాలు తొలగడానికి మహా గణపతిని పూజిస్తుంటారు.

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా కేతువుకు జ్ఞాన కారకుడు, మోక్ష కారకుడని పేరు.
జాతకంలో కేతువు అనుకూలంగా ఉంటే జ్ఞానాన్ని కలిగించి అనవసర బంధనాలను తొలగిస్తూ అభివృద్ధి పథంలో ప్రయాణింపజేస్తాడు.

అలా కాకుండా కేతువు వ్యతిరేక స్థానంలో ఉన్న వారికి అజ్ఞానం ఏర్పడుతూ అంటే బ్రమ, మాయలలో కూరుకుపోతూ వారు చేసే స్పృహ లేని పనుల వల్ల బంధనాలు ఏర్పడి పరాజయ మార్గంవైపు ప్రయాణిస్తూ ఉంటారు.మహా గణపతిని భక్తితో ఆరాధించడం వల్ల ఈ మాయా, బ్రమలూ, బంధనాలూ, విఘ్నాలు.. ఇవన్ని తొలగిపోతాయి.


మహా గణపతిని ఆరాధించడం వల్ల అభివృద్ధికి అంతరాయాలుగా ఉన్న విఘ్నాలన్నీ తొలిగిపోతాయి.

మరి ఈ విఘ్నాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎలా ఏర్పడుతాయి?

మహా గణపతి తొలగించే విఘ్నాలు  విఘ్న బీజాలు  గురించి వివరంగా తెలుసుకుందాము.

1) అలసత్వం


అలసత్వం అంటే సోమరితనం, బద్ధకం

ఈ రెండింటికీ కొద్దిగా తేడా ఉంది.


"వర్తమానంలో (అవసరమైన) ఉపయోగపడే పని విషయంలో ఏకాగ్రత లోపించడాన్ని"... సోమరితనం అంటాము.

అంటే ఉదాహరణకు 
ఒక విద్యార్థికి అవసరమైన ఉపయోగపడే పని - చదవడం. 

కాని అతనికి చదవడం పట్ల ఆసక్తీ - ఏకాగ్రత ఉండకుండా ప్రస్తుతం అవసరం, ప్రయోజనం లేని ఇతర వ్యాపకాలలో మునిగిపోవడం సోమరితనం అవుతుంది.

ఈ విఘ్నబీజం వల్ల భవిష్యత్తులో ఆ విద్యార్థి చదువు విషయంలో విఘ్నాలనూ, ఆటంకాలను ఎదుర్కొంటాడు.

అలాగే ఒక గృహిణికి అవసరమైన ఉపయోగపడే పని ఇల్లునూ - పిల్లలనూ - భర్తనూ శ్రద్ధగా చూసుకోవడం.
కాని ఈ విషయంలో ఆసక్తీ - ఏకాగ్రత ను కోల్పోయి TV సీరియల్లు - సెల్ ఫోన్ చాటింగ్ లలో మునిగిపోవడం, అలాగే TV సీరియల్లు చూస్తూ పిల్లల తో హోమ్ వర్క్ చేయించడం వంటివి చేస్తూ ఉంటే సోమరితనం అవుతుంది.

ఈ విఘ్నబీజం వల్ల భవిష్యత్తులో ఆమె పిల్లలు ...చదువూ - అభివృద్ధి విషయంలో వెనుకబడడం, కుటుంబ అభివృద్ధి మందగించడం, అనారోగ్యం, గొడవలు వంటి విఘ్నాలూ - సమస్యలు ఏర్పడుతుంటాయి.

మొత్తం మీద సోమరితనం అంటే అవసరమైన పనులనూ, ఉపయోగపడే పనులను నిర్లక్ష్యం చేసి అనవసర వ్యాపకాలలో మునిగిపోవడం.
ఇక
"శరీరాన్ని సుఖపెట్టాలనే కాంక్ష "  ను బద్ధకం అంటాము.

అంటే కూర్చుంటే లేవడం విసుగు . పనిచేయడం విసుగు .నడవడం విసుగు.
ఎప్పుడూ కాలు నొప్పి - కడుపు నొప్పి - భుజం నొప్పి - తలనొప్పి అంటూ సమస్యలను ఎకరువు పెడుతుంటారు.పోని అన్ని నొప్పులతో విశ్రాంతి తీసుకుంటారా?అంటే అలా ఉండదు. TV- ముచ్చట్లు - లాంటి వృథా కాలక్షేప వినోదాలలో మునిగిపోతారు.

ఇలా శరీరం లో సుఖ లాలసత ఏర్పడడం వల్ల శ్రమించడం అంటేనే విసుగు ఏర్పడుతుంది.కొద్దిగా శ్రమించే ఒక చిన్న పని కూడా ఏకాగ్రతగా చేయలేరు.
దీని వల్ల చేసే పనులలో నాణ్యత కొరవడి తన జీవితం- తనతో పాటు జీవించే వారి జీవితం కూడా నాణ్యత లేకుండా తయ్యారౌతుంది.

శ్లో|| అలసానాం మనుష్యాణాం సదా దు:ఖం దరిద్రతా I
ఆలస్యం పాతకం లోకే ఆలస్యం భూతి నాశనమ్ ॥
నాధిగచ్ఛన్తి భోక్తవ్య మలసాయే నరాధమా |
అలసానాం మనుష్యాణాం ప్రాప్తోZప్యర్థో వినశ్యతి ||
అని శాస్త్రం చెబుతుంది.

అంటే సోమరిపోతులూ - బద్ధకస్తులైన వారికి దు:ఖం, దరిద్రత వెన్నంటి ఉంటాయి. సోమరితనం ..అనేది పాప ఫలితం . సోమరితనం వల్ల ఐశ్వర్యమూ - అదృష్టం క్షయించబడుతాయి.వీరికి అనుభవించవలసిన శుభాలు కూడా విఘ్నాలు ఏర్పడి చేజారిపోతాయి.
అంటూ శాస్త్రం చెబుతూ ఉంది.

 మహాగణపతిని అత్యంత శ్రద్ధగా - భక్తిగా ఆరాధిస్తే మూలాధారం చైతన్యమౌతూ దోషాలు తొలగి ఈ అలసత్వం అనే విఘ్నబీజం తొలగిపోతుంది.

ఇక 

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా చూసినపుడు...
జాతకంలో కేతువు అనుకూలంగా ఉన్న "జ్ఞాని " కర్మ ఫలాలకు అంటకుండా ఉండే అభ్యాసం చేస్తూ ఉంటే..

జాతకంలో కేతువు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి మాయలో, సుఖ లాలసత్వం అనే మైకంలో మునిగి కర్మలకు దూరంగా ఉండే అభ్యాసం చేస్తూ కర్మ ఫలాలను మాత్రం తీవ్రంగా ఆపేక్షిస్తుంటాడు. అంటే పని చేయకుండా ఫలితాన్ని కోరుతాడన్నమాట!

"దంత పాశాంకుశ విఘ్న పరుశు లడ్డు సంజ్ఞికా :I బీజాపూర హవ్య ముద్రా విఘ్నేన విఘ్న పూజనాత్॥" 

అంటూ శాస్త్ర గ్రంథాలు మహాగణపతి ఉపాసనలో ఉపయోగించే 7 ప్రధాన ముద్రలగూర్చి వివరిస్తున్నాయి.

ఈ  అలసత్వం అనే విఘ్న బీజం తొలిగి మూలాధార చక్రం జాగృతం కావడానికి దంత ముద్ర తో     "ఓం వక్రతుండాయ హుం " అనే మంత్రాన్ని 21 లక్షల జపం చేయాలి.

ఈ విధంగా చేస్తే అలసత్వం సమూలంగా తొలిగిపోతుంది.

లేదా

ఇదే మంత్రాన్ని జపం చేస్తూ ప్రతి రోజు ఉదయం - సాయంత్రం శక్తికొలది గుంజీలు తీసినా ఫలితం ఉంటుంది.
   

                స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ I
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ॥


       (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

నన్ను "నేను" తెలుసుకోవటానికి
నన్ను "నేను" మార్చుకోవటానికి
నన్ను "నేను" చేరుకోవడటానికి
మరియు అత్యుత్తమ జీవన విధానానికి
మీ ముందుకు "మహాగణపతి పూజ" తో వస్తున్నాను.        

గురుమంచి రాజేంద్రశర్మ













Friday 2 September 2016

డాక్టర్ !!!!!!!!!

..ఒకతనికి ఎడమ కాలు బ్లూ కలర్ లోకి మారింది..
గాబరా పడి .. డాక్టరు కి చూపించాడు..
.
..డాక్టరు : కాలు మొత్తం విషం తో నిండి పోయింది..
ఆ విషం .. మొత్తం శరీరానికి పాకే అవకాశం ఉంది.. కనుక..
వెంటనే ఆపరేషన్ చేసి కాలు తీసేయాలి.... అన్నాడు..
..ఆపరేషన్ చేసి కొత్త కృత్రిమ కాలు అమర్చారు..
..కొద్ది రోజుల తర్వాత కుడి కాలు కూడా .. నీలం రంగు లోకి మారింది..
డాక్టరు  : వెంటనే ఆపరేషన్ చేసి.. కుడి కాలు కూడా తీసేయాలి.. అన్నాడు..
.
..కుడికాలు కూడా తీసేసి కృత్రిమ కాలు అమర్చారు...
..కొద్ది రోజుల తర్వాత .. కృత్రిమ కాళ్ళు రెండూ.. బ్లూ కలర్ లోకి మారిపోయాయి ..
.. వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్ళాడు .. పేషెంటు..
..అప్పుడు డాక్టరు బాగా పరిశీలించి ... ఇలా అన్నాడు....
.
.
.
.
.
.
...... నాకిప్పుడు అర్థమైంది మీ ప్రాబ్లం...
మీ లుంగీ.. రంగు వదులుతుంది..... ఏం గాభరా పడకండి.. నిశ్చింతగా ఉండండి..!

సోర్స్ :- వాట్సాప్
.

dont hurt any body

ఒక తండ్రి అందరితో పరుషంగా కోపంగా మాట్లాడుతుండే తనకొడుకుతో "జీవితంలో ఎప్పుడూ ఎవరినీ హర్ట్‌ చేయద్దురా! "అని చెబుతుండేవాడు.అయినా కొడుకు తండ్రి మాట వినిపించుకునేవాడు కాదు.

అతనికి ఒకసంచిలో కొన్నిమేకులు ఇచ్చి నీకు కోపంవచ్చిన ప్రతిసారి ఒకమేకును గోడలోకి కొట్టమన్నాడు.

మరుసటి రోజు కొడుకు, తండ్రి చెప్పిన సలహాప్రకారం చేసి రాత్రికి గోడకు కొట్టిన మేకులను కౌంట్‌ చేయగా, 34వున్నాయి. మరుసటిరోజు 30, అలాగ ఒక వారం తరువాత మేకులన్నీ అయిపోయాయి.

తండ్రి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్నిచెప్పాడు.

తండ్రి, కోపం వచ్చి పూర్తిగా తగ్గిన ప్రతిసారి ఒక మేకును గోడనుంచి తీసేయమన్నాడు. పది రోజుల తరువాత గోడకుకొట్టిన మేకులన్నీ తీసివేయడం జరిగింది.

ఇదే విషయాన్ని తండ్రికి చెప్పాడు.

అప్పడు తండ్రి కొడుకుతో,ఇప్పుడు గోడ దగ్గరకు వెళ్ళి జాగ్రత్తగా పరిశీలించి రమ్మన్నాడు.

కొడుకు తిరిగివచ్చి తండ్రితో,గోడకు రంద్రాలున్నాయన్నాడు.

చూశావా, నీకోపం వలన గోడకు/కొట్టిన మేకులను తీసివేయగలిగావు గానీ రంద్రాలను చేశావు.

అలాగే ఎవరినైనా హర్ట్‌ చేస్తే అతని మనసుకు ఇలాగే రంద్రము పడుతుంది. ఒకవేళ నీవు సారీ చెప్పిఅతని మనసుకు కొట్టిన మేకులను తీసివేయగలవేమోకాని, రంద్రాలను కాదు గదా! ఒకవేళ ఆ రంద్రాలను కూడా మూసివేసి ఎప్పటిమాదిరిగా చేయాలంటే  అదనంగా "ప్రేమ" అనే సిమెంట్ , గౌరవం అనే రంగును అద్దవలసి ఉంటుంది.

*So  dont hurt any body*

సోర్స్ :- వాట్సాప్

ధన్యవాదములతో

గురుమంచి రాజేంద్రశర్మ