Tuesday 4 October 2016

బతుకమ్మ పండగ

(ఇది బతుకమ్మ పండగ గురించి ఒక సుదీర్ఘ వ్యాసం. తెలంగాణాలో నివసించే ప్రతీ వ్యక్తి చదవవలసినది. చదివి షేర్ చేసి బతుకమ్మ పండగ విశిష్టతను అందరికి తెలియజేయండి.)



బతుకమ్మ పండగ - విశిష్టత - విశేషాలు
-----------------------------------------------

బతుకమ్మ పండగ..
తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొనే ముచ్చటైన పండగ.
బతుకమ్మ పండుగ ...
ప్రకృతిని అరాధించే అతి పెద్ద పండుగ.
బతుకమ్మ పండుగ ...
తెలంగాణా అస్తిత్వాన్ని సజీవంగా నిలిపి ఉంచిన పండగ.
ఇది కులాల కట్టుబాట్లు, ధనికులమనే అహంకారాలు లేని పండుగ.
కట్టుబాట్లన్నీమనుషులకే కాని నీటికి, పూలకూ లేవని చెబుతూ అందరూ సామరస్యంగా కలిసి మెలిసి జరుపుకునే పండగ.
తెలంగాణ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలకు అద్ధం పట్టే పండుగ.
వేల సంవత్సరాల నుండి  సజీవంగా కొనసాగుతున్న ప్రజా పండుగ బతుకమ్మ పండుగ .  (కాకతీయ రాణి రుద్రమ దేవి కూడా ఈ బతుకమ్మ పండుగను వైభవంగా జరిపించేదని చెబుతారు.)
తమ భర్తల బతుకు బాగుండాలని, వారికి దీర్ఘాయువు ఉండాలని సౌమంగళ్యాన్నీ- సౌభాగ్యాన్ని కోరుతూ తెలంగాణా ఆడపడుచులు పూజించే పండగ ఈ బతుకమ్మ పండుగ .
రాబోయే కాలంలో యౌవనవంతురాలమయ్యే తాము సకల సౌభాగ్యాలతో జీవించడానికి అన్ని విధాలా యోగ్యుడైన భర్త లభించాలని ప్రకృతికి బాలకన్యలు  కైమోడ్పు నివేదనలు సమర్పించే పండగ.
దేవుడికి పూజ చెయ్యడానికి పువ్వును వాడుకుంటాము, కాని పువ్వునే దేవుడిగా మొక్కే పండుగ ఈ బతుకమ్మ పండుగ.
ఐక్యతాభావంతో అందరినీ ఏకం చేసే పండుగ... ఏకం చేసి విజయం సాధించిన పండుగ . ఇంకా ఎన్నో విజయాలను అందించే పండుగ .
నేలకూ, నీళ్ళకు, అడుగుకూ,  నుడుగుకూ ఉన్న సహజ సంబంధాన్ని చాటిచెప్పే పండుగ ఇది.
ఆడబిడ్డల ఆత్మీయతల మధురిమలను పంచే పండుగ ఈ బతుకమ్మ పండుగ.
వేల వేల జానపద గీతాలు వెల్లువెత్తే పండుగ .
ఒక్క మాటలో చెప్పాలంటే...
మానవ సంబంధాల సారాంశమే ఈ బతుకమ్మ పండుగ.
ఇది స్త్రీల పండుగ - శ్రీ ల పండుగ
సమూహికంగా చేసే "శక్తి ఉపాసన "
బతుకమ్మ గురించి తెలుసుకోవడమంటే...
సంస్కృతి గురించి తెలుసుకోవడం,
తన గురించి తెలుసుకోవడం, తన ఆత్మ గురించి తెలుసుకోవడం, అంటే సమస్తమూ తెలియడమే!

‘బతుకమ్మ’ అంటే "బ్రతుకునిచ్చే అమ్మ - బ్రతుకుదెరువును మెరుగు పరచే అమ్మ - 'బ్రతుకు కు 'అంటే తనలోని ఆత్మచైతన్యానికి కారణమైన అమ్మ " అని అర్థం.

పోతన వర్ణించిన " అమ్మలగన్న అమ్మ-ముగ్గురమ్మల మూలపుటమ్మ' నే ఈ బతుకమ్మ.
ఇది తెలంగాణా ప్రజలు ఉమ్మడిగా - సమూహికంగా చేసే శ్రీవిద్యోపాసన.

లలితా సహస్ర నామంలో .....
ఓం ప్రాణదాయై నమ:
ఓం ప్రాణరూపిణ్యై నమ:
ఓం ప్రాణేశ్వర్యై నమ:
ఓం ప్రాణదాత్ర్యై నమ:
...అంటూ కీర్తించబడే జగద్ధాత్రే మన బతకమ్మ.

ఈమే...
"ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి".

ఈమే...
"చైతన్యార్ఘ్య సమారాధ్యా చైతన్య కుసుమప్రియా"

ఈమే...
"ఉదార కీర్తి రుద్దామ వైభవా వర్ణరూపిణీ |
జన్మమృత్యుజరాతప్త జన విశ్రాంతిదాయినీ || "

ఈమే...
"అనఘాZద్భుతచారిత్రా వాంఛితార్థ ప్రదాయినీ "

అటువంటి "బతుకమ్మ ఉత్సవాలు" ఈ మహాలయ అమావాస్య నుండి ప్రారంభం అయ్యాయి.

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ, దసరా (విజయ దశమి) అనేవి రెండు పెద్ద పండుగలు .

ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలతో నిండిపోయుంటుంది.

అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ.

రంగు రంగుల పూలతో శ్రీచక్ర మేరు ఆకారంలో పేర్చి అలంకరించి- పరా బిందువు స్థానంలో పసుపు గౌరిని నిలిపి పూజించి... బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలను, ఆటనూ విని, చూసి తరించాల్సిందే కానీ వర్ణించడం కష్టమే!

ఈ పండగ "బొడ్డెమ్మతో మొదలై ఎంగిలిపుప్వు బతుకమ్మ,.... సద్దుల బతుకమ్మ వరకు  "... ఇలా దేని ప్రత్యేకత దానిదే!

తొమ్మిది  నుండి పదకొండు రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, ఆశయాలు, కోరికలు , చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి..

బతుకమ్మ పండగ వస్తూందంటే తెలంగాణా పల్లెల్లో నూతన వుత్సాహం వెల్లి విరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుస్తారు. చక్కగా అలంకరించు కుంటారు. ఆడ పిల్లల్ని పుట్టింటికి తీసుకు వస్తారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలను పెద్ద ముత్తైదువలు బుగ్గలపై చేతులేస్తూ ప్రేమగా పలకరిస్తుండడం వల్ల వారి బుగ్గలు ఎరుపెక్కుతుంటాయి.

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుకపూలు, తంగేడి పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, కనకాంబరం , నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ.  అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. పచ్చగా పెరిగే పైరు సంపద, విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యమయంగా వుంటుంది. వీటన్నింటి నేపధ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్నంతా అద్భుతమయిన రంగురంగుల పువ్వులలోకి ఆవాహనం చేసి రకరకాల జానపద గీతాలతో కీరిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.

తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్ఠమైంది. ఉద్యమ సందర్భాలలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్థిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.

ఈ పండుగ చివరి రోజును "సద్దుల బతుకమ్మ " అని పిలుస్తారు. దీనికి తొమ్మిది  నుండి పదకొండు రోజుల ముందుగా తమ తమ ప్రాంత ఆచారాన్ని బట్టి ఈ బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు.ఈ వారం రోజులలో వీరు రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.

అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, గునుక పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు,కలువ, మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమిక ను పోషిస్తాయి.

ఆడ పడుచులు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు.  తలలో పూలుతురుముకుని, చేతుల నిండా గాజులు ధరించి అందంగా ముస్తాబౌతారు.
తరువాత తీసుకువచ్చిన పూలని జాగ్రత్తగా ఒక పెద్ద రాగి లేదా ఇత్తడి పళ్ళెం లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు  పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు.

బతుకమ్మను పేర్చడం కూడా ఒక కళ. తంగెడు పువ్వు, బంతిపువ్వు, గునుగుపువ్వు, గుమ్మడి పువ్వు, తీగమల్లె, మంకన పువ్వు, ఛెత్రి పువ్వు, గులాబి, పోకబంతి, కనకాంబరాలు, గన్నేరుపూలు, గోరెంకపూలు, , ఇట్లా ఎన్నో రకాల పువ్వులు బతుకమ్మలో కొలువుదీరుతాయి..
ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది, మధ్యలో తంగేడి పూలను పెడతారు. పేర్చడం అయ్యాక పైన 'పసుపుతో చేసిన గౌరి మాతను 'పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు.  తరువాత బతుకమ్మను ఎదుర్కోలుగా తీసుకుని వచ్చి ఒక విశాల ప్రదేశంలో నిలుపుతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి  పెద్ద వలయాకారంలో బతుకమ్మలన్నింటిని నిలుపుతారు. ఇలా తయారు చేసిన బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడపడుచులు ఆడుతారు -పాడుతారు. 
ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ సందర్భంలో తమ తమ శక్త్యానుసారం వెండి - బంగారు పొన్నులతో అలంకరించబడిన నగిషీలు చెక్కిన కోలలను ఒక లయ గా వేస్తూ జానపద గీతాలు పాడుతుంటారు.

ఈ జానపద గీతాలు చుట్టుప్రక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.  చీకటి పడుతుంది అనగా,స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభవోపేతంగా, శోభాయమానంగా ఉంటుంది.

ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి.  డప్పుల దరువు, చప్పట్లు,దరువులు, కోలాటాలు ఉత్సాహంగా ఊరిని కదిలిస్తుంటాయి. ఈ విధంగా జలాశయం చేరుకున్న తరువాత, మెల్లగా  పాటలు పాడుతూ,ఆడుతూ చివరగా మరోసారి బతుకమ్మలను పూజించి ,దానిపై నున్న ‘పసుపు గౌరమ్మకు’ భక్తితో నమస్కరించి, తమ మాంగల్యాన్ని కాపాడమని ఆ గౌరమ్మను తాళితో స్పృశిస్తారు.అనంతరం నైవేద్యాలను సమర్పిస్తారు.

ఈ నైవేద్యాలన్నీ ప్రత్యేకమైనవీ - అమ్మవారికి ఇష్టమైనవి. 
ఉత్సవాలు మొదలైనప్పటి నుండి రోజుకు ఒక నైవేద్యం చొప్పున ప్రత్యేకంగా సమర్పిస్తారు.చివరి రోజు మాత్రం అన్ని నైవేద్యాలను  సమర్పిస్తారు.

అమ్మవారు "హరిద్రాన్నైక రసికా" అందుకని పులిహోర ..

ఆమే "ముద్గౌదనాసక్త చిత్త" . అందుకని పులగం లేదా పెసర్లు తో చేసిన తీపి పదార్థం.

ఆ తల్లి " దధ్యన్నాసక్త హృదయ " . అందుకని.. పెరుగన్నం లేదా దధ్ధోజనం.

ఆమే " గుడాన్న ప్రీత మానసా" . అందుకని .. బెల్లపు అన్నం

అమ్మవారికి 'పాయసాన్న ప్రియా' అని పేరు. అందుకని .. పాయసన్నం

ఆమే 'స్నిగ్దౌదన ప్రియా' అందుకని.. నెయ్యితో కలిపిన అన్నం

.... ఇంకా రకరకాల పప్పు దినుసులు - ధాన్యాలు -  నెయ్యి - చక్కెర.. మొ॥ వాటితో చేసినవి.దీనిని "సమిలి " "సత్తు పిండి ", "మలీదా "అని  ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.
... ఇలా తమ తమ ఇంటి సాంప్రదాయం ప్రకారం తీసుకువచ్చిన నైవేద్యాలను బతుకమ్మలకు నివేదన చేస్తారు.

ఆ తరువాత బతుకమ్మలను నీటిలో జారవిడుస్తారు - నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మను నిమజ్జనం చేయడం లో కూడా ఒక పద్ధతి వుంటుంది. మోకాళ్ల వరకు నీళ్లలో దిగాక... నీటిమీద బతుకమ్మ పళ్లెం ఉంచి, ఇంకా కొంచెం దూరం నడిచి తేలుతున్న బతుకమ్మనుంచి ఆ పళ్లాన్ని మెల్లగా కిందకి ఒత్తి పైకి తీస్తారు. నీళ్లపై తేలుతున్న బతుకమ్మను అలలతో ముందుకు నెట్టుతారు.

తేజస్సును శ్వాసిస్తూ, దశదిశలకూ జీవం ప్రసాదిస్తూ, పూలన్నీ యోగులై, ఉపనిషద్ఘోషలై, నదీమతల్లి జలతరాంగాలలో తమను తాము కైమోడ్పు చేసుకుంటాయి. ఆ ఆనంద పారవశ్యంతో పూలబాలలు, నదులూ, చెరువులపై తేలుతూ పూల సెజ్జలుగా మారే అద్భుత దృశ్యమది.

ఆ అద్భుత దృశ్యానికి నమస్కరించి - మనసారా వందనాలు సమర్పించి ఆడపడుచులందరూ వెనక్కి తిరిగి వస్తారు.

వస్తూ వస్తూ పళ్లెంలో కొన్ని నీళ్లు తెచ్చి,ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటిని అందరిపై చల్లి అవభృత ప్రోక్షణం చేస్తారు.

ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
అందరూ ఒకచోట కూర్చొని ప్రసాదాలనూ - నైవేద్యాలను ఇచ్చి పుచ్చుకుంటూ భుజిస్తారు.
ఈ సందర్భంగా అంతవరకు ద్వేషభావనలతో ఎడమొహం - పెడమొహంగా ఉన్నవారు సైతం తమ ద్వేషభావాలను తొలగించుకుని మిత్రులౌతుంటారు.ఈ బతుకమ్మ పండగ కొంగ్రొత్త స్నేహా సంబంధాలకు వేదికగా మారుతుంది. ఇక్కడ అన్ని కులాల వారూ చేరి ఐక్యతను, స్నేహాన్ని, గ్రామ బంధుత్వాన్ని కళ్లకు కట్టేలా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు.

ప్రదోష కాల సమయంలో క్రమేపీ నల్లటి నీడలు నడుం వాల్చగా ఆ మహిళాలోకం నిట్టూర్పులు విడుస్తూ...

‘‘పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ
మల్లొచ్చె యాడాది తిరిగి రావమ్మా’’

అంటూ....

శ్రీలక్ష్మి నీమహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా
ఎన్నెన్నో రూపముల - ఏడేడు లోకముల
ఉన్న జనులకు కోర్కెలన్ని సమకూర్చేవు’’ అని పాడుకుంటూ
ఇంటి ముఖం పడుతుంది.

... ఇలా బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.

.....ఇదంతా భావుకులకు కనిపించే బాహ్యదృశ్యమయితే, ఈ సంప్రదాయం వెనుక దీటుగా నిలిచే శాస్త్రీయత కూడా వుంది.
వర్షం పుష్కలంగా పడినప్పుడు మాత్రమే పుష్పించే తంగేడు, గునుగు పూలు తలలో పెట్టుకొనే సుగంధ పుష్పాలు కావు. ఈ పూరేకులలో, ఆ పుప్పొడిలో దాగున్న సహజ రసాయనాలకు నీటిని శుభ్రపరచే గుణం వుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇవి పర్యావరణాన్ని కాపాడే రక్షక కవచాలు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది.

పూలతో చేసిన బతుకమ్మలకు ఉన్న మహాత్మ్యం కాగితం బతుకమ్మలకు లేదు.

ప్రస్తుతం విపరీతమైన జనారణ్యాలతో, గృహారణ్యాలతో నేల, నింగి నిండి పోతున్నాయి.
ప్రకృతికి మానవుడు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
అందుకని కొన్ని ఆధునిక గృహాలలో కాగితపు పూలు, ప్లాస్టిక్‌ ఆకులు, పూలతో కూడిన బతుకమ్మలు నిండిపోతున్నాయి.

వీటి కోసం ఏ మధుపం ఝంకారం చేయదు.
ఏ భ్రమరము పరిభ్రమించదు.వీటిలో  ప్రకృతి శోభ పండదు.

అమ్మవారికి "బ్రమరవాసినీ " అని పేరు.

ఏ బతుకమ్మల చుట్టూ బ్రమరాలు తిరుగుతుంటాయో ఆ బతుకమ్మలు గల ఇల్లు ధన్యం. ఇది ఆ పూజ ఫలించి సిద్ధి పొందిన దానికి నిదర్శనం.

కాబట్టి వీలైనంత వరకు కాగితపు బతుకమ్మలను వాడకుండా పూల బతుకమ్మలను పూజించడం వల్లనే సరియైన ఫలితం సిద్ధిస్తుంది.

తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వారసత్వ సంప్రదాయాలను నిలబెట్టే బతుకమ్మ- రజాకర్ల ఆగడాలను తట్టుకొని నిలబడ్డ మహత్తర పండుగ.

అందుకే బతుకమ్మను తెలంగాణ సమాజం గుండెకు హత్తుకొని మరీ అస్తిత్వాన్ని కాపాడుకునే సాధనంగా మార్చుకుంది.

అందుకే బతుకమ్మ పండుగ అంటే ఓ అనిర్వచనీయమైన ఆనందం.
ఒక అద్భుతమైన అనుభూతి.

ఈ సుదీర్ఘమైన వ్యాసాన్ని ముగించే ముందు..

ఈ పండుగ పూట ప్రజలందరూ సుఖసంతోషాలతో బతుకమ్మను జరుపుకోవాలని కోరుకుంటూ.. మీ అందరికీ బతుకమ్మపండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.

(ఈ వ్యాసంలో బతుకమ్మ గూర్చిన పరిశోధనాత్మక రచనల నుండి కొంత సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.)

నమో దేవ్యై మహా దేవ్యై శివాయై సతతం నమః l
నమః ప్రకృత్యై భద్రా యై నియతా : ప్రణతా : స్మతామ్ l l

అర్ధము :-

'' దేవికి , మహాదేవికి నమస్కృతులు.
నిత్య శుభంకరియై మనందరికి సకల శుభాలు ప్రసాదించే ఆ తల్లికి ఎల్లప్పుడును   వందనాలు సమర్పిస్తున్నాము.
మూల ప్రకృతియు , ఎల్లప్పుడు మమ్మలను రక్షించే రక్షాశక్తియు అగు ఆమెకు నమస్కారములు. నియత చిత్తుల మై మేము ఆమెకు సదా ప్రణ మిల్లుచున్నాము .

                     స్వస్తి
        (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

        గురుమంచి రాజేంద్రశర్మ.



ఈ వ్యాసాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని అనుకునేవారు ఈ క్రింది లింక్ నుండి చేసుకోవచ్చు.