Saturday 30 September 2017

ఆస్వాదనం




ఒక కథ ....


అనువాదం:- గురుమంచి రాజేంద్రశర్మ



సమీపంలో ఏదో భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి ...

నేను ప్రతిరోజూ సాయంత్రం వాకింగ్ చేస్తూ అక్కడ కాసేపు కూర్చుంటాను.

చాలామంది పేద కార్మికులు  అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని నివసిస్తూ పనిచేస్తుంటారు.  వారి  పిల్లలు ఒకరి చొక్కా మరొకరు  పట్టుకొని "రైలు బండి రైలు" అనే ఆట ఆడుతుంటారు.
ఎవరైనా ఒకరు ఇంజిన్ అవుతారు మిగిలినవారు  బోగీలు అవుతారు ..
ప్రతిరోజూ ఈ పిల్లలు మలుపులు తిరుగుతూ కేరింతలు కొడుతూ ఆడుతూవుండే ఈ ఆటను చూడడం నాకు ఇష్టమైన దినచర్యగా మారిపోయింది ...

చాలా రోజులుగా వాళ్ళ ఆటను గమనిస్తున్నాను.ఇంజన్ గా ఉన్న పిల్లవాడు మరోరోజు బోగీగా.. బోగీగా ఉన్న పిల్లలు ఇంజన్ గా ఇలా మారుతూనే ఉన్నారు.

కానీ, ఒక చిన్న బాలుడు,సగం నిక్కరు మాత్రమే ధరించి తన చేతిలో ఒక చిన్న ఆకుపచ్చ వస్త్రాన్ని పట్టుకుని రోజువారీ గార్డుగానే  ఉంటున్నాడు ...

 ఒకసారి నేను వెళ్ళి అడిగాడు ...

"బాబూ ! నువ్వు కూడా ఒక ఇంజిన్ లేదా బోగీగా మారి అడుకోవచ్చు కదా! ఎప్పుడూ గార్డ్ గానే ఎందుకుంటున్నావు?...

అతను మృదువుగా ప్రత్యుత్తరం ఇచ్చాడు ...

 "సర్, నాకు ధరించడానికి ఒక చొక్కా లేదు, కాబట్టి ఇతర పిల్లలు నన్ను పట్టుకుని రైలును ఎలా తయారుచేస్తారు?

ఆ మాటలు చెబుతున్నప్పుడు
నేను అతని కళ్ళలో కొంచెం తేమ గమనించాను..

నేను అతనితో మరి కాసేపు మాట్లాడిన తర్వాత జీవితానికి సంబంధించిన ఒక  గొప్ప పాఠం నేర్చుకున్నాను....!

అతను చొక్కా కోసం ఇంట్లో  అడిగాడు,అరిచాడు,అలిగాడు, ఎంతగా ప్రయత్నించాలో అంతగా ప్రయత్నించాడు.కానీ, ఇంట్లో ఆరోగ్య పరమైన మరో అత్యవసర ఖర్చులుండడం వల్ల అతని తల్లిదండ్రులు  అతనికి చొక్కాని కొనుగోలు చేయలేకపోయారు...

కానీ,ఆ పిల్లవాడు తన ప్రయత్నం విఫలమైనందుకు నిరాశ చెందలేదు.  బదులుగా  అతను తనను తాను ఆస్వాదించడానికి  ఆనందంగా ఉండడానికి మరొక మార్గం ఎంచుకున్నాడు ...!

జీవితంలో మనం  కోరుకున్న అన్ని విషయాలను పొందలేము...

నాకు బైక్ లేదు, నాకు కారు లేదు, నాకు ఇల్లు లేదు..ఇలా రకరకాలుగా  అసంతృప్తిని అనుభవిస్తుంటాము...లేనిదాని గురించి ఆలోచిస్తూ ఆస్వాదించడాన్నీ - ఆనందంగా ఉండడాన్ని మరిచిపోతుంటాము.

జీవితంలో జీవం లేకుండా బ్రుతుకుతుంటాము ....!

ఆ పిల్లవాడితో సంభాషించిన తర్వాత నేను నేర్చుకున్న పాఠం ఇది.

మన కోరికలు నెరవేరడం కోసం పూర్తి ప్రయత్నం చెయ్యాలి.మన కోరికలు నెరవేరవచ్చు! నెరవేరకపోవచ్చు! కానీ అంత వరకు ఉన్నవాటితోనే జీవితాన్ని ఆస్వాదించే మార్గాలను అన్వేషించాలి.

మన లక్ష్యం ఆస్వాదించడం - ఆనందంగా ఉండడమే.పనిముట్ల గూర్చి ఆలోచిస్తూ ఉన్న అసలు లక్ష్యాన్ని కోల్పోకూడదు..... !!


ఇంగ్లీష్ మెసేజ్ కు తెలుగు అనువాదం : -గురుమంచి రాజేంద్రశర్మ

మంచి వాళ్ళు



  


మంచివాళ్ళు
----------------

లోకంలో రెండు రకాల వ్యక్తులు " మంచివాళ్లు"గా గుర్తించబడుతారు.

 1.  తమోగుణ ప్రేరితమైన మంచివాళ్లు(మంచివాళ్లుగా నటిస్తూ తమను తాము మంచివాళ్లుగా బ్రమ పడేవారు)

                    వీళ్లు మంచివాళ్లుగా ఉండడానికి ప్రధాన కారణం భయం. ఆ భయం చేతగానితనానికీ - అనుమానాలకు కారణమౌతుంది.

              వీరికి గొడవలంటే భయం.అలవాటు లేని క్రొత్త పనులంటే భయం..ఎదిరించాలంటే భయం... సూటిగా మాట్లాడలంటే భయం.... చేయక చేయక ఏవో పనులూ లేదా వ్యాపారాలు చేస్తారు. నష్టపోతారు. మళ్లి ఆ పనులు చేయాలంటే భయం..... సమస్యలకు కారణమయ్యే నిజాలు మాట్లాడాలంటే భయం.... ఇలా చెబుతూపోతే వీరిలో ఒక భయాల బ్యాంకే ఉంటుంది.

విచిత్రమేమిటంటే -
వీరికి గొడవలంటే ఎంత అయిష్టమో.. అంతగా వీరి చుట్టూ గొడవలు పేరుకుపోయి ఉంటాయి. తరుచూ గొడవలు ఎదురౌతుంటాయి.

వీరికి "ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లు ముక్కు సూటిగా మాట్లాడే కోపిష్టులైన వ్యక్తి " జీవిత భాగస్వామిగా లభిస్తారు.వీరిలో భయం తొలగిపోనంతవరకు .. జీవిత భాగస్వామిలో కోపం తొలగిపోదు.నిజానికి వివాహం తర్వాత జీవితభాగస్వామి వల్లనే వీరు అభివృద్ధి సాధిస్తారు.కానీ తన సమస్యలకూ - అశాంతికి కారణం జీవితభాగస్వామే అని భావిస్తారు.

ఈ మొదటి తెగ మంచివాళ్లకు ప్రధానమైన ఆసక్తులు
 1. రకరకాల రుచులు.
 2. నిద్ర
 3. కామ సుఖం
 4. ఎంటర్ టైన్ మెంట్ (వినోదాలు).

సాధారణంగా ఏ వ్యక్తి అయినా "తాను ఏ ఆసక్తుల వల్ల ఆనందాన్ని పొందుతున్నాడో అవే సుఖాలను తనకు ఇష్టమైన వారికి అందించాలనుకుంటాడు. "

ఈ మొదటి తెగ మంచివాళ్లు కూడా రకరకాల రచికర పదార్థాలను బయటి నుండి ఇంటికి తెచ్చి తమ పిల్లలకు అందిస్తుంటారు.

ఉదయాన్నే పిల్లలను నిద్ర లేపే జీవత భాగస్వామిని చూసి "పాపం అలిసిపోయారు. పడుకోనీ!!" అంటూ వారించి 9 గం॥వరకు పడుకోబెడతారు.

తన సంతానంతో కలిసి వాట్సాప్ వీడియోలు.. పేస్ బుక్ పోస్ట్లు .. TV ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తారు.

తనలోని భయం కారణంగా జీవిత భాగస్వామిలో ప్రతిబింబించే ఆవేశాన్ని వర్ణిస్తూ తన పిల్లలతో జోకులేస్తుంటారు.

ఎక్జిబిషన్ - టూర్లు వెళ్లినప్పుడు గిర్రున తిరిగే చేర్ ఆట - గుర్రాలు - ఒంటెలు వంటి వాటిని ఎక్కి తాను సాహసవంతులమని నిరూపిస్తూ వాటిని ఎక్కని జీవిత భాగస్వామిని భయస్తులు అంటూ గేళి చేస్తుంటారు.

వీరికి దయ్యాల సినిమాలంటే ఆసక్తి. వాటిని ఇతరులతో - పిల్లలతో కలసి చూస్తూ ..చూడలేని భాగస్వామిని ఆటపట్టిస్తుంటారు.

... ఇలా పిల్లలకు కూడా మంచి వారైపోతారు.

ఎదురైన బంధువులకూ - మిత్రులకూ "ఎండలో తిరగకండీ! వేళకు బోంచేయండీ!!ఆరోగ్యం జాగ్రత్త!!! బాగా రెస్ట్ తీసుకోండీ!!!!...ఇలాంటి జాగ్రత్తలు - తియ్యటి మాటలు చెబుతూ అందరికీ మంచి వారైపోతారు.

ఇంటిలో అతి ముఖ్యమైన డెవలప్ మెంట్స్ - ఫంక్షన్లు వచ్చినపుడు బాధ్యత అంతా భాగస్వామే చూసుకోవాలి. వీరు చెప్పిన పని మాత్రమే చేస్తారు.

.... ఇలా చెబుతూ పోతే ఒక పుస్తకమౌతుంది.

మొత్తం మీద .. ఇలా.. ఇలా.. భయానికి మంచితనం అనే పేయింట్ వేసి ఈ మొదటి తెగవాళ్లు మంచివాళ్లై పోతారు.


 2. ఇక రెండవ తెగ మంచివారు సత్వగుణ ప్రధానమైనవారు.అంటే తన తన బలహీనతలను - ఆవేశాలను అవగాహన చేసుకుని వాటిని జయించి, ఇంద్రయ నిగ్రహం కలిగి, రాగ -ద్వేషాలకు అతీతమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకున్న అచ్చమైన మంచివాళ్లు.


స్వస్తి

ధన్యవాదములతో

గురుమంచి రాజేంద్రశర్మ






స్త్రీలో 50% పసితనం ?


     


నేను గమనించినంత మట్టుకు " స్త్రీ "లో
50% పెద్దరికం
50 % పసితనం
ఉంటాయనిపిస్తుంది.

బహుశా అందుకే పసిపిల్లలను అర్థం చేసుకునే మంచి తల్లిగా ఉండగలుగుతుంది.

అలాగే భర్తను అర్థం చేసుకునే మంచి భార్య కూడా కాగలదు.

పిల్లలకుండే "ప్రకృతితో తదాత్మ్యం చెందే భావుకత్వం" - "బుద్ధితో కాకుండా హృదయంతో వ్యవహరించే ప్రవర్తన " స్త్రీలలో సజీవంగానే ఉంటాయి.

చాలామంది అమ్మాయిలు " తనకు బాగా నచ్చిన మరియు అర్థం చేసుకున్న పురుషుడు" ఎవరంటే ... అది తన తండ్రే అని చెబుతారు. అందుకు కారణం తండ్రి తన కూతురిలో పెద్దరికంతో పాటు పసితనాన్ని కూడా చూసి వ్యవహరించడమే!

అదే మగవారిని గమనిస్తే వారు పూర్తిగా పెద్దరికంగా ఉండడానికి ఇష్టపడుతారు.

ఇక స్త్రీతో సంబంధ బాంధవ్యాల విషయం ఆమె ఆ క్షణంలో ఉన్న మానసిక స్థితిని అనుసరించి పసిపిల్లలా గారాబం చేసి ప్రేమనందించాలా? లేక పెద్దరికం ఆపాదిస్తూ సలహాలూ - సూచనలు తీసుకుని భాగస్వామ్యం కల్పించాలా? అని నిర్ణయించుకునే పురుషుని విచక్షణ మరియు సమయస్పూర్తిపై ఆధారపడి ఉంటుంది.

దేశాలను గెలిచిన రాజైనా స్త్రీతో వ్యవహరించే విషయంలో కొంత గందరగోళానికి గురి కావడానికి ఇదే కారణం అనిపిస్తుంది.

ఇక స్త్రీ పురుషునితో వ్యవహరించే విషయంలో 90% కన్ఫ్యూజ్ ఉండదు.పెద్దరికం ఆపాదిస్తూ ట్రీట్ చేస్తే సరిపోతుంది.ఒక చిన్న పిల్లాడుగా ట్రీట్ చేస్తే మాత్రం పురుషుడు తొందరగా హర్ట్ అవుతాడు.అది చిన్న పిల్లాడు అయినా సరే!☺ 

P.S: - ఇది నా అభిప్రాయం, పరిశీలన మాత్రమే! భార్యా - భర్తల మధ్య మంచి రిలేషన్స్ కోసం ఈ విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని మనవి.

సంపద

సంపద

    

సంపద అంటే సమృద్ధి, సాధించబడినది అనే రెండు అర్థాలు.
తృప్తి పరిచేది - అవసరాలను తీర్చేది సంపద.
సంపద రెండు రకాలుగా సృష్టించబడుతుంది.

1) .ఇతరుల అవసరాలను నెరవేర్చగలిగే శక్తి పెరుగుతున్న కొద్ది సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది.
ఒక కూలి నుండి బిల్ గేట్స్ వరకు ఎవరినైనా గమనించండి. వారు ఇతరుల అవసరాలను ఎంతగా నెరవేరుస్తూ ఉంటారో అంతగా వారి వద్ద సంపద వృద్ధి పొందుతూ ఉంటుంది.
శారీరకంగా - మానసికంగా -బౌద్ధికంగా - ఆథ్యాత్మికంగా ..... ఏ రకంగానైనా ఇతరుల అవసరాలను తీర్చగలిగే శక్తే, శ్రీమంతుడు కావడానికి ప్రధాన కారణం.
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది.
ప్రస్తుత క్షణంలో డబ్బు వచ్చినా - రాకున్నా మనసులో అసంతృప్తి లేకుండా పూర్ణ భావస్వేచ్చతో ఇతరుల అవసరాన్ని ఎంతగా తీరుస్తుంటామో అంతగా మన అదృష్ట ద్రవ్యనిధి పెరుగుతుంది. ఫలించే సమయం వచ్చినపుడు అది డ్రా చేయబడి ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది.కాబట్టి ఇతరులకు సహాయం చేయడమంటే మన అదృష్ట ద్రవ్యనిధి పెంచుకోవడమే!
ఇక్కడ ఇతరుల అవసరాన్ని నెరవేర్చి పేరూ- గుర్తింపు రాలేదని బాధ పడితే పూర్తి ఫలితం రాదు. ఎందుకంటే ఇతరుల అవసరాన్ని నెరవేర్చడంలో పూర్ణ భావస్వేచ్చతో వ్యవహరించలేదని అర్ధం.

ఇక రెండవది

2).క్రియాశక్తి వల్ల

లక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపమని పురాణాలు వర్ణిస్తున్నాయి.
సంపద అనేది శ్రమకు ప్రతిఫలం .
శ్రమించడం వల్ల కూడా సంపద సృష్టి జరుగుతుంది.
శ్రమించే తత్వం పెరుగుతూ తనలో ఉన్న ఇచ్చాశక్తినీ... జ్ఞాన శక్తిని క్రియా రూపంలోకి మార్చడం వల్ల సంపద సృష్టించబడుతూ వుంటుంది.
ఇక్కడ కూడా గమనించవలసిన విషయం ఒకటుంది.
జ్ఞానం పెరుగుతున్నా కొద్ది శరీరం యొక్క అవసరం, శ్రమించే అవసరం తగ్గుతుంది.
ఉదాహరణకు...
ఒక వ్యక్తి రోజంతా రాళ్లు కొట్టి సంపాదించిన ఆదాయం కన్నా ఒక ఇంజనీయర్ ఒక గంట కష్టపడితే వచ్చే ఆదాయం ఎక్కువ. దాని కన్నా అటువంటి ఇంజనీయర్లను పనిలో పెట్టుకున్న బిల్ గేట్స్ లాంటి యజమానుల ఆదాయం ఎక్కువ.
కాబట్టి సంపద సృష్టిలో అతి ముఖ్యమైన విషయాలు.1. ఇతరుల అవసరాన్ని నెరవేర్చగలిగే నెైపుణ్యం.2.జ్ఞానం 3. శ్రమ
ఇక్కడ జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి.
కేవల పుస్తక (లేదా వినికిడి ) జ్ఞానం, అనుభవజ్ఞానం అని జ్ఞానం రెండు రకాలు.నిజానికి మొదటిదైన కేవల పుస్తక (లేదా వినికిడి ) జ్ఞానం అనేది జ్ఞానం క్రిందకు లెక్కలోకి రాదు.
ఇది Copy &  Paste లాంటిది.ఇతరుల వద్ద ఉపన్యాసాలు దంచడానికి - తాత్కాలికంగా పొందే బ్రమాత్మకమైన కీర్తి కోసం తప్ప ఎందుకూ పనికి రాదు.ఆ జ్ఞానం అనుభవం లోకి వచ్చినప్పుడే అది నిజమైన జ్ఞానం అవుతుంది.
జ్ఞానం అనేది షడైశ్వరాలలో ఒకటి.అనుభవ జ్ఞానంలో నైపుణ్యం - ధైర్యం - ఆ జ్ఞాన ఫలితం పోయినా మళ్లి సృష్టించగలనన్న విశ్వాసంలో కూడిన వైరాగ్యం - వృద్ధి పొందిన కాన్సన్ట్రేషన్ & కాన్సియస్ పవర్... ఇలా మిగతా  ఐశ్వర్యాలు అంతర్భూతంగా ఉంటాయి.
కేవల పుస్తక (లేదా వినికిడి ) జ్ఞానంలో ఇవి ఉండవు.
కొంత మందికి మేము రోజంతా శ్రమపడు తాము.కానీ ఆదాయం తక్కువ అనే భావన ఉంటుంది. 1)వారు ఇతరుల అవసరాన్ని నెరవేర్చగలిగే నెైపుణ్యం 2)జ్ఞానం అనే రెండు లక్షణాలను పెంచుకోవాలి.
కొంత మంది జ్ఞానం బాగానే ఉంది. అయినా ఆదాయం తక్కువ. సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మీ ఉండదు అంటూ సర్దుకుపోతుంటారు. వారు తమ జ్ఞానాన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకోవడంతో పాటు 1)వారు ఇతరుల అవసరాన్ని నెరవేర్చగలిగే నెైపుణ్యం 2. శ్రమ అనే రెండు లక్షణాలను పెంచుకోవాలి.
ఈ రెండు రకాలుగా కాకుండా ఇతరుల చే సృష్టించబడిన సంపదను కొల్లగొట్టేవారు కొందరుంటారు. వీరు ఇహ-పర లోకాలలో పతనం చెందుతారని శాస్త్రం చెబుతుంది.
ఎందుకంటే....
సంపద అంటే డబ్బు - బంగారం కాదు. అవి సంపదకు బదులుగా వినియోగించే వినిమయాలు మాత్రమే!
ఒక దేశంలోని డబ్బుకు మరో దేశంలో విలువ ఉండదు. అలాగే భూలోకంలో ఉండే వినిమయాలు మరో లోకంలో చెల్లబడి కావు.
కానీ, ఇతరుల అవసరాలను తీర్చగలిగే నెైపుణ్యశక్తి.... క్రియాశక్తి ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా సంస్కార రూపంలో వెన్నంటి ఉండి అతన్ని ఐశ్వర్యవంతుడు గా నిలుపుతుంది.
స్వస్తి
ఓపికగా చదివిన వారికి ధన్యవాదములతో
మీ గురుమంచి రాజేంద్రశర్మ