Tuesday 31 October 2017

ఉసిరిచెట్టు పూజ

ఉసిరి చెట్టు పూజ
-----------------------------

రచన:- గురుమంచి రాజేంద్రశర్మ

కార్తీక మాసం..వైకుంఠ చతుర్దశి..

తన కోడలును తీసుకుని గుడికి బయలుదేరింది సీతమ్మ!

కోడలు తనతో పాటు తన 3 సంవత్సరాల బాబును తీసుకుని వచ్చింది.

వాళ్ళతో పాటుగా.. తమ ప్రాంతంలో జరిగే కార్తీకపౌర్ణిమ జాతర సందర్భంగా వచ్చిన12 సంవత్సరాల .. "సీతమ్మకూతురుకొడుకైన".. "ధ్రువ"ని కూడా బాబును చూసుకోవడానికి తోడుగా తీసుకెళ్లారు.

గుడికెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత..
"బావ దగ్గర ఆడుకో నాని!!" అంటూ బాబుని ధ్రువకు అప్పజెప్పి సీతమ్మ కోడలుతో కలిసి ఉసిరి చెట్టును పూజించడానికి వెళ్ళింది.

కార్తీకమాసంలో ఉసిరి చెట్టును ధాత్రి నారాయణ స్వరూపంగా భావించి పూజిస్తుంటారు! అక్కడ వత్తులు ..దీపాలు వెలిగించడం వంటివి చేస్తుంటారు!!

అక్కడ జరుగుతున్న పూజాతతంగమంతా చూసి ధ్రువ అకస్మాత్తుగా తనదగ్గరున్న బాబు బుగ్గలను చాలా గట్టిగా పిండి వాణ్ణి ముద్దుపెట్టుకున్నాడు.

ఆ బాబు.. 'బుగ్గలు పిండిన నొప్పి' వల్ల గట్టిగా ఏడుపులంకించుకున్నాడు!!!

ఆ ఏడుపువిని సీతమ్మ..కోడలు పరుగెత్తుకొచ్చారు.ఏం జరిగిందోనని...

జరిగింది తెలుసుకుని..

సీతమ్మ ధ్రువని..

"నీ ప్రేమా..మురిపెం విడ్డూరంగానూ!..
బాబును చంపేస్తావా ఏమీ???
బుగ్గలింత గట్టిగా పిండుతారా??
బుగ్గలన్నీ ఎర్రగా ఎలా కందిపోయాయో చూడొకసారి!!
ఇదేం ప్రేమరా మనవడా??
పసి పిల్లలు భగవంతుని స్వరూపంరా!!
అలా హింసించొద్దు!!!" అంటూ మందలించింది..ఆ బాబుని ఎత్తుకుని బుజ్జగిస్తూ...

అవే మాటలను అనుకరిస్తూ ధ్రువ కూడా సీతమ్మతో...

" మీ మూఢ భక్తి..పూజలు విడ్డూరంగానూ!...
చెట్టును చంపేస్తావా ఏమీ???
చెట్టు మొదట్లో వేయి వత్తులు..లక్ష వత్తులు అంటూ ముట్టిస్తారా??
చెట్టు కాండమంతా నల్లగా ఎలా కాలి మాడిపోయిందో చూడొకసారి!!
ఇదేం భక్తినే అమ్మమ్మా!!
భగవంతుని స్వరూపమనే చెట్టుకు పూజ చేస్తున్నారు కదనే!!
అలా హింసించొద్దు!!!"  అన్నాడు..ఏడుపు మగ్గిన ఆ బాబును తిరిగితీసుకుని ఆడిస్తూ...

ధ్రువ ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ తో  తిరిగి ఉసిరిచెట్టు వద్దకు వెళ్లిన సీతమ్మ-ఆమె కోడలు ఈ సారి చెట్టుకు చాలా దూరంగా వత్తులూ..దీపాలు పెట్టి పూజించసాగారు!!

🔯🔯🔯🔯🔯

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

Monday 30 October 2017

అన్యోన్య దాంపత్యం

అన్యోన్య దాంపత్యం
------------------------------
రచన:- గురుమంచి రాజేంద్రశర్మ

గత 30 సంవత్సరాల నుండి ఎప్పుడూ గొడవ పడని తన మిత్రుని దాంపత్యజీవితాన్ని చూసి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు .

"మీ అన్యోన్య దాంపత్య జీవిత రహస్యమేమిటి?"

భర్త నవ్వి ఇలా సమాధానం ఇచ్చాడు.

అది పెళ్ళైన క్రొత్త.

ఒకరోజు మా పెంపుడు పిల్లి పాలమీద మూత పడగొట్టి పాలు తాగేస్తుంది.

నా భార్య " ఇది మొదటి సారి!" అంది.

మరోరోజు ఆ పిల్లి మేము వండుకున్న వంటలన్ని క్రిందపడేసి నేలపాలు చేసింది.

నా భార్య " ఇది రెండవ సారి!!" అంది.

ఇంకోరోజు అదే పిల్లి,నా భార్య ప్రశాంతంగా టీవీ సీరియల్ చూస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తూ నాకింది.

నా భార్య "ఇది మూడవ సారి!!!" అని ఇంట్లోని రోకలుకర్రతో కొట్టి చంపేసింది!!.

చూస్తున్న నేను షాకై..

"సైకో అయ్యావా? ఎందుకలా చేశావు??"అన్నాను.

మొదటి సారి పిల్లిని చూసినట్టు నా వైపు చూస్తూ ...

" ఇది మొదటి సారి!" అంది నా భార్య.

అంతే!

అప్పటినుండి మేమెప్పుడు గొడవపడలేదు.చాలా చాలా అనుకూలంగా ఉన్నాము!!" అన్నాడు భర్త.

                          ✡️✡️✡️✡️✡️

ఇతరుల అన్యోన్య దాంపత్య జీవితాన్ని చూసి కుళ్ళుకోవలసిన అవసరం లేదు!

అన్యోన్యప్రేమానురాగాలే కారణం కానవసరం లేదు!

"భయం" కూడా కారణం కావచ్చు!!
                 😄😄😄😄😄

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

మన మాటలు-ప్రవర్తన

నేను మొదట్లో నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా.. మాట్లాడడం ,ప్రవర్తించడమే ...కరెక్ట్ అనుకునే వాణ్ణి!

కానీ, అనుభవం మీద " అవతలి వ్యక్తి స్థాయిని బట్టే " మన ప్రవర్తన, మాటలు ఉండాలని క్రమంగా తెలుసుకున్నాను.

నిజానికి ఈ విషయం చిన్నతనం నుండే మనకు తెలుసు కూడా!

చిన్నపిల్లలతో ఒకరకంగా మాట్లాడుతాము!,ప్రవర్తిస్తాము!!

పెద్దవారితో మరో రకంగా!!

పిచ్చివారితో మరోరకంగా!!!

( ఎదిగిన మనిషిలో కూడా పసితనం ఉండవచ్చు! ,పసివయస్సులో కూడా పెద్దరికం ఉండవచ్చు!!...బయటకు కనిపించేవి ముసుగులు మాత్రమే! ఆ ముసుగులు దాటి చూస్తేనే మనం ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది.)

భాగవతం,హరివంశం..వంటివి చదివి కృష్ణుని పరిశీలించిన తర్వాత మరింత అవగాహన కలిగింది.

ఒకే తప్పును కొడుకు చేసినప్పుడు ఒక రకంగా..
తండ్రి చేసినప్పుడు ఇంకో రకంగా..
భార్య చేసినప్పుడు మరో రకంగా
...ఇలా స్థాయిని బట్టి మాట్లాడవలసి వస్తుంది..ప్రవర్తించవలసి వస్తుంది.

ఇలా అవతలి వ్యక్తుల శారీరక,మానసిక,బౌద్ధిక,ఆథ్యాత్మిక,కౌటుంబిక,సామాజిక..etc స్థాయిలను గమనించడం ప్రారంభిస్తే క్రమంగా లోకమంతా అర్థమవుతుంది.

లేకపోతే...

చివరకు "మనం మాత్రమే!"మిగులుతాము.

ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది!

అవతలి వారి ప్రవర్తన , మాటలను "మనం మనలాగానే " స్వీకరించాలి.

కానీ, మన మాటలు,ప్రవర్తన అవతలి వారి స్థాయిని బట్టే ఉండాలి.

మొత్తంమీద సారాంశం ఏమిటంటే-
వాడుకోవటమే తెలియాలి!!(మాటలనూ-చేతలను)

గుర్తించాల్సిన విషయమేమిటంటే...
ఎదగడం...అనంతంగా!!!!

                     ✡️✡️✡️✡️✡️

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

తల తిరుగుడు రోగం

తల తిరుగుడు రోగం
----------------------------
రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

ఒక వ్యక్తికి తల తిరుగుడు రోగం పట్టుకుంది. దానికితోడు శ్వాస పరమైన ఇబ్బందులు.

అతని తల్లిదండ్రులు లోకల్ లో ఉండే చాలా మంది డాక్టర్లకు చూయించారు.అయినా తగ్గలేదు.

తర్వాత హైదరాబాదు తీసుకెళ్లి ప్రముఖ ఆస్పత్రిలో చూయించారు.

డాక్టర్లు అన్ని పరీక్షలు చేయించి చివరకు ఆక్సిజన్ తగ్గిందని మందులు రాసిచ్చారు.

ఆ మందులు వాడినా అనారోగ్యం నయం కాలేదు.

దయ్యం-గియ్యం లాంటిది ఏదైనా పట్టుకుందేమోనని కూడా చాలా మందికి చూయించారు.

ఇలా అన్ని రకాలుగా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఫలితం రాకపోయేసరికి..

చివరకు ఒక స్వామీజీ దగ్గరకు ఆ అబ్బాయిని తీసుకుని వచ్చి అతని అనారోగ్యం గురించి ప్రశ్నించారు.

ఆ స్వామిజీ ఒక పది నిమిషాలు ధ్యానముద్రలో కి వెళ్లి..

"మీ అబ్బాయికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చారా?"
అని ప్రశ్నించాడు.

" అవును స్వామీ! మొన్ననే ఒక ఆరు నెలల క్రితం ఒక మంచి స్మార్ట్ ఫోను కొనిచ్చాము!!" అన్నారు.

" మీ అబ్బాయి శరీరంతో చేసే పనులేవి చేయకుండా అదేపనిగా ఏకాగ్రతగా రోజంతా ఫేస్ బుక్ , వాట్సప్, నెట్ ఇలా వాడుతూ ఉండడం వల్ల శ్వాస తగినంతగా తీసుకోవడం తగ్గిపోయింది.

మీరు గమనించండి! మనం అత్యంత ఏకాగ్రతగా ఉన్నప్పుడు శ్వాస కొన్ని క్షణాలు నిలిచిపోవడమో..లేదా తగ్గడమో జరుగుతుంది. అలాగే మీ బాబుకు కూడా శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గింది.

మీరు డాక్టర్ కు చూయించి మందులు వాడినా.. మీ బాబు ఇంకా ఫోన్ అలాగే వాడడం వల్ల ఫలితం రాలేదు.

ఒక 15 రోజులు ఫోన్ అసలే వాడకుండా 'వేగంగా వీలైనంత వాకింగ్ ', 'శరీరంతో చేసే పనులు'.. ఎక్కువగా చేయుమని చెప్పండి!

ఒక వారం రోజుల్లో అంతా సర్దుకుంటుంది. తర్వాత కూడా శరీరంతో చేసే పనులు చేస్తూ అవసరమైనప్పుడే ఫోన్ వాడేవిధంగా చూసుకోండి నాయనా!!" అంటూ సలహా ఇచ్చాడు స్వామిజీ.

"ధన్యవాదాలు స్వామీ!" అంటూ ఆ అబ్బాయి తల్లిదండ్రులు తృప్తిగా స్వామిజీకి నమస్కరించారు.

                          ✡️✡️✡️✡️✡️

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

కాఫీ & ఫెస్ట్

కాఫీ & ఫెస్ట్
----------------

రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

ఒక వర్ధమాన రచయిత మన కథలలో ఉండే స్వామీజీ దగ్గరికి వెళ్లి ఇలా ప్రశ్నించాడు.

స్వామీజీ! నేను కథలను రాస్తున్నాను. రాసిన కథలను ఫేస్బుక్ మొదలగు వాటిల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కానీ, అలా పెట్టిన కథలను చాలామంది నా పేరు తీసివేసి కాఫీ అండ్ పేస్ట్ చేస్తున్నారు స్వామీ!!

మరి కొంతమందయితే నా పేరు స్థానంలో తమ పేరు పెట్టుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి ?స్వామీ!" అంటూ ప్రశ్నించాడు.

ఎప్పటిమాదిరిగానే ఆ స్వామిజీ ఒక పది నిమిషాలు ధ్యానముద్రలో కి వెళ్లి.. ఇలా చెప్పసాగాడు.

"నాయనా !అది ప్రకృతి సూత్రం!!

అది ఏ  ఉద్యోగమైనా, పనైనా ఆ వ్యక్తి ట్రేనింగ్ లో వున్నప్పుడు..

'ఫలితం తక్కువగా ఉంటుంది! శ్రమ దోచుకోబడుతుంది!

అలాగే అనుభవం పెరిగిన కొలది అదే శ్రమకు ఫలితం ఎక్కువగా ఉంటుంది. పైగా ప్రమోషన్లు కూడా వస్తాయి!! 

నాయనా! నువ్విప్పుడు ట్రైనింగ్ లో ఉన్నావు..." అన్నాడు స్వామీజీ.

ఆ మాటలు విన్న వర్ధమాన రచయిత యొక్క సందేహం తీరడమే గాక ఒకానొక ఆనందం కూడా అతని ముఖంపై కనిపించింది.

"ధన్యవాదాలు! స్వామి!!" అంటూ నమస్కరించి లేవబోయే లోపు...

స్వామీజీ ఇలా అన్నాడు.

"నాయనా ! మరో మాట !!నరేంద్ర మోడీ ఒక కవిత రాసి ఫేస్బుక్లో పోస్టు చేశాడనుకో!

అప్పుడు ఆ కవితను కాఫీ అండ్ పేస్ట్ చేస్తారా? లేక షేర్ చేస్తారా?"

"నిశ్చయంగా షేర్ చేస్తారు స్వామి! ఎందుకంటే.. కవిత కున్న ప్రఖ్యాతి కన్నా మోడీ కున్న ప్రఖ్యాతి ఎక్కువ కనుక!!" అన్నాడు వర్ధమాన రచయిత.

"సరే !ఈ విషయం కూడా గమనిస్తావనే ఉద్దేశ్యంతో చెప్పాను.
అయినా నీకు ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు! రచయితవి కదా!!" అంటూ చిరునవ్వు నవ్వాడు స్వామిజీ.

                                  ✡️✡️✡️✡️✡️

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

గుత్తివంకాయ-ఎలుక

గుత్తివంకాయ-ఎలుక
--------------------------------
రచన:-గురుమంచి రాజేంద్రశర్మ

ఒక వ్యక్తి ఒక హోటల్ కు లంచ్ చేద్దామని వెళ్ళాడు .
అతనికి ఇష్టమైన  గుత్తివంకాయ కూర తో భోజనం చేస్తుండగా వంకాయ ప్లేస్ లో ఒక్క చిన్న చెట్టెలుక వచ్చింది.

అతను దాన్ని తోకతో లేపి కెవ్వున అరిచాడు. అందరూ పొగయ్యారు.వెంటనే హోటల్ యజమాని పరుగెత్తుకొచ్చాడు.

అతనూ, హోటల్ యజమాని వాదించుకోసాగారు.
అది ఎలుక అని అతను, కాదు అది వంకాయ అని హోటల్ యజమాని ఇలా కొద్దిసేపు వాదించుకున్నాక..

అది వంకాయే కావాలంటే చూసుకో! అంటూ హోటల్ యజమాని  దాన్ని తీసుకుని చటుక్కున మింగేశాడు.

మరునాడు

ఆ హోటల్ కు ఆ కస్టమర్ మాత్రమే వచ్చాడు కళ్ళలో అత్యంత నమ్మకాన్ని నింపుకొని!!!

                   ✡️✡️✡️

ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన రెండు నీతులున్నాయి.

1.తనమీద తనకు నమ్మకం లేని వ్యక్తి తొందరగా మోసపోతాడు.!

2.టెన్షన్లో - భయంలో-ఆపదలో ఉన్న వ్యక్తి యుక్తాయుక్త విచక్షణ కోల్పోతాడు!

               ✡️✡️✡️✡️✡️

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

Thursday 12 October 2017

అకారణ ద్వేషం

#అకారణద్వేషం#

రచన:-గురుమంచి రాజేంద్రశర్మ.

ఒక గ్రామ సర్పంచ్ తన కుటుంబంతో సహ హరిద్వార్ టూర్ వెళ్లాడు.

అక్కడి ప్రదేశాలన్ని చూసిన తర్వాత
అక్కడ ఒక కొండగుహలో ఒక స్వామీజి ఉన్నాడని, అక్కడికి వెళ్దామని భార్య బలవంతపెడితే వెళ్లాడు.

అతని భార్య తన పిల్లల గూర్చి ఏవేవో ప్రశ్నలు అడిగితే స్వామీజి సమాధానం చెప్పారు.

తర్వాత స్వామీజి ఈ సర్పంచ్ వైపు తిరిగి "నాయనా! నువ్వు కూడా ఏమైనా అడగాలనుకుంటున్నావా?"అని ప్రశ్నించాడు.

"స్వామీజీ! నిజానికి నాకు ఇటువంటి వాటిపైన పెద్దగా నమ్మకం లేదు! కానీ ,ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో !!స్వామీజీని అడగకపోతినే! అడిగితే  చెప్పేవాడేమో! అనే ఒక బాధ మిగిలిపోతుంది. అందుకని నా మనసులో పట్టిపీడిస్తున్న సందేహాన్ని అడుగుతున్నాను.

మా గ్రామంలో నలుగురు పెద్ద మనుషులున్నారు. వారు నా ముందు బాగానే ఉన్నా, చాటుగా బద్ద శత్రువుల మాదిరిగా నాకు వ్యతిరేక ప్రచారం చేస్తూవుంటారు.

మొదట్లో వాళ్లు నాకు అనుకూలంగా ఉన్న వారే !సహాయం చేసిన వాళ్లే!

నేను వాళ్లకు చేసిన నష్టం కూడా ఏమీలేదు! పైగా అంతో ఇంతో లాభమే చేశాను.ఇప్పటికి కూడా వాళ్ళ పట్ల నాకు మంచి భావమే ఉంది.

కానీ, వాళ్లు నన్నెందుకు శత్రుభావంతో చూస్తున్నారు ?ఎందుకు  నాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారో ? దానికి కారణాన్ని తెలుసుకోవాలని వుంది !స్వామీజీ!

సాధ్యమైతే చెప్పగలరని ప్రార్థిస్తున్నాను!! "

అది విన్న స్వామీజీ ఒక పది నిమిషాలు ధ్యానముద్రలోకి వెళ్ళి ప్రశాంతంగా చిరునవ్వుతో ఇలా చెప్పసాగాడు.

నాయనా !ఆ నలుగురిలో ఒకరి విషయాన్ని చెబుతాను. దాదాపు ఆ మిగిలిన వారు కూడా ఇలాంటి కారణాలతోనే నీ పట్ల శత్రుభావాన్ని పెంచుకున్నారు.

"ఒక రోజు అతను తన మిత్రులతో కలిసి నడచి వస్తున్నాడు అప్పుడు నువ్వు ఎమ్మెల్యే నుండి ఫోన్ వస్తే హడావుడిగా వెళ్తున్నావు.

అతను నిన్ను చూసి విష్ చేసాడు కానీ హడావుడిలో ఉన్న నువ్వు అది గమనించక వెళ్ళిపోయావు.

అతను విష్ చేయడానికి లేపిన చేతితో తల గోక్కున్నట్లు నటించాడు.

మరోసారి 'అలిగివెళ్లిన నీ కొడుకు' చాలాసేపటి వరకూ ఇంటికి రాకపోయేసరికి  ఆందోళనతో నీ కొడుకు గూర్చి వెతుకుతున్నావు.

అతను దారిలో నిన్ను చూసి విష్ చేసాడు. కానీ ఆందోళనతో ఉన్న నువ్వు అది గమనించలేదు.

ఈసారి అతను విష్ చేయడానికి లేపిన చేతితో ముక్కు గోక్కున్నట్లుగా నటించాడు. నీకు బాగా పొగరు వచ్చిందని మనసులో అనుకున్నాడు. అవమానంగా ఫీలయ్యాడు.

మరో రోజు నీకు గుర్తుందా!  అపెండిసైటిస్ ఆపరేషన్ అయిన సందర్భంలో బాగా కడుపునొప్పి వచ్చి బయలుదేరావు !

అప్పుడు కూడా అతడు విష్ చేసాడు. బాధతో ఉన్న నువ్వు అతన్ని గమనించలేదు.

ఈసారి అతను విష్ చేయడానికి లేపిన చేతితో భుజాలమీద పడిన దుమ్ము దులుపుకున్నాడు.

ఇలా మూడుసార్లు జరిగే సరికి అతను చాలా అవమానంగా ఫీలయ్యాడు నీపట్ల పూర్తి వ్యతిరేక భావం ఏర్పడింది.

ఒక పెళ్ళిలో మీరిద్దరు కలిశారు. అతడు పలకరించడానికి ముందుకు వస్తున్నాడు.. అదే సమయంలో నువ్వు కూడా అతన్ని చూసి పలకరిద్దామని వెళుతున్నావు .

అప్పుడే నీకు మీ అన్న కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని పోలీస్ స్టేషన్లో ఉందని ఫోన్ వచ్చింది హడావుడిగా వెళ్లిపోయావు.

అతనికి భరించలేని అవమానంగా అనిపించింది. నీ పట్ల పూర్తి శత్రుభావం ఏర్పడింది.అందుకే అవకాశం దొరికినపుడల్లా లేదా అవకాశం సృష్టించుకుని నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు.

ఒకసారి వెనక్కి చూసుకుంటే నీకు అర్థమౌతుంది అప్పటినుండి అతను నీ వద్దకు ఎప్పుడూ రాలేదు కలిసినప్పుడు కూడా నువ్వు మాట్లాడిస్తేనే మాట్లాడాడు.

మిగతా ముగ్గురు కూడా దాదాపు ఇలాంటి కారణాలతోనే నీపట్ల శత్రుభావాన్ని ఏర్పరుచుకున్నారు.

ఇదే !నాయనా!! నువ్వడిగిన దానికి  కారణం!!! " అని సమాధానం ఇచ్చాడు స్వామీజీ.

ఆ సర్పంచ్ చాలా ఆశ్చర్యపొయాడు.

" స్వామీజీ! మరీ ఇంత చిన్న విషయానికి అంత శతృత్వమా? " అని ప్రశ్నించాడు.

"నాయనా! మనుషుల్లో ఆరురకాల స్థాయిలు ఉంటాయి .

అందులో మొదటి స్థాయి వారు నీ దగ్గర నుండి తేరగా వచ్చే వాటి కోసం ఆశపడతారు. అందుకోసం నీచుట్టూ తిరుగుతారు. వారితో నువ్వెలా వ్యవహరించినా సరే! వారి దృష్టంతా నీనుంచి పొందే లాభాలమీదనే ఉంటుంది.

నీపట్ల శతృభావం కలిగిన ఈ నలుగురిది రెండవదైన ఆవేశ స్థాయి.

వీరిని ఆశపెట్టి నీవైపు మలుచుకోలేవు . వీరికి కావలసింది అవసరమైనదానికన్నా ఎక్కువ మర్యాద- గౌరవం

వీటిని ఎవరైనా విరివిగా గుమ్మరించారంటే.. వారికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు దీనికి వ్యతిరేకంగా ఎవరైనా అవమానించారని భావిస్తే శత్రుభావం వహించి తీవ్రమైన చెడు ప్రచారం చేస్తారు.వీరికి డాబు-దర్పం ఎక్కువ." అన్నాడు స్వామిజీ.

" స్వామిజీ! ఆ మిగతాస్థాయిల గూర్చి కూడా వివరిస్తారా?" ప్రశ్నించాడు సర్పంచ్.

" చాలు నాయనా! నీకు రెండుస్థాయిల వరకే సరిపోతుంది. ఇప్పటికే మీకు ఎక్కువ సమయం కేటాయించాను. శుభమస్తు!" అంటూ దీవించాడు స్వామిజీ.

ఆ సర్పంచ్ చిరునవ్వుతో " స్వామిజీ! నేను చాలా సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నాను.ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థమైంది. చాలా చాలా ధన్యవాదాలు స్వామి! " అంటూ భక్తితో నమస్కరించాడు.
           
                                    ✡️✡️✡️✡️✡️

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

Wednesday 11 October 2017

కోపం - అవగాహన

వ్యక్తిగతమైన దుఃఖం తమో గుణమైతే..కోపం అనేది రజో గుణం!!

చాలా సందర్భాలలో మనం సరియైన విధంగా ఆలోచించక పోవడం - అవగాహన చేసుకోకపోవడమే కోపం రావడానికి కారణమౌతూ ఉంటుంది.

ఉదాహరణగా ఈ క్రింది కథ చదవండి!

                               ✡️✡️✡️✡️✡️

ఒక సాయంకాల సంధ్యా సమయంలో ఒక వ్యక్తి దేవాలయంలో దేవున్ని దర్శించుకుని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాడు.

అదే సమయంలో ఇద్దరు పిల్లలు అక్కడ విపరీతంగా అరుస్తూ అల్లరి చేస్తున్నారు.

ధ్యానం చేసే వ్యక్తి ఎంత సముదాయంచినా పిల్లలు అదే తంతును కొనసాగిస్తున్నారు.

ఆ వ్యక్తిలో అసహనం పెరిగిపోతూ ఉంది. ఆ పిల్లలు ఆడుతూ - తిరుగుతూ వుంటే వాళ్ల కాళ్లకు తగిలి అతని పూల బుట్టలో ఉన్న ప్రసాదం దూరంగా పడింది.

సరిగ్గా అప్పుడే ఆ పిల్లల తాలుకు వ్యక్తి పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చాడు.ఆ వ్యక్తి పిల్లల పై ఉన్న కోపాన్ని ఆ పిల్లల తాలుకు వ్యక్తిపై చూపిస్తూ చివాట్లు పెడుతూ అరవడం ప్రారంభించాడు.

అప్పుడు పిల్లల తాలుకు వ్యక్తి శాంతంగా ఇలా చెప్పడం ప్రారంభించాడు!!!

"అయ్యా! క్షమించండి!!
ఈ పిల్లలు తల్లి దండ్రి లేని అనాథ శరణాలయం పిల్లలు! నేను ఆ శరణాలయంలో ప్రతి సాయంత్రం ఉచితంగా సేవ చేస్తుంటాను.
ఈ పిల్లలిద్దరికి బ్రెయిన్ ట్యూమర్.
పిల్లలు ఆనందంగా ఉంటారనే ఉద్దేశ్యంతో ఇలా గుడికి తీసుకువచ్చాను.
జరిగిన పొరపాటుకు మన్నించండి " అన్నాడు.

అప్పుడు ఆ ధ్యానం చేసే వ్యక్తి కోపం అంతా ఒక్కసారిగా జాళి గా మారిపోయింది.

కాబట్టి రజో -తమో గుణ పరిధిలోని భావాలు ఎప్పుడూ శాశ్వతం కావు. అవి మన మనుసును బట్టి వెంటది వెంట మారుతూ వుంటాయి.

ఇదే ఉదాహరణలో  ఆ పిల్లల తాలుకు వ్యక్తి ఇప్పటికే పది మర్డర్లు చేసిన ఒక సైకో అన్న విషయం తెలిస్తే ఆ ధ్యానం చేసే వ్యక్తిలో కోపం - జాళి స్థానంలో "భయం "ప్రవేశించేది.

ఆ పిల్లల తాలుకు వ్యక్తి ఒక కర్ర తీసుకుని ఆవేశంతో చెడామడా వాయిస్తే "దు:ఖం " ప్రవేశించేది.

ఆ పిల్లలు యవ్వనం లో తాను చేసిన పొరపాటు వల్ల కలిగిన తన పిల్లలే అని తెలిస్తే " ప్రేమ "కలిగేది.

ఇలా అవగాహనను బట్టి ,మనుసును బట్టి కోపం రకరకాల భావాలుగా మారుతూ ఉంటుంది.

నిజానికి " ఉన్నది శుద్ధభావం ఒక్కటే! (అంటే కోపం,దుఃఖం,వ్యక్తిగత సంతోషం,జాలి,రాగం,ద్వేషం వంటి మంచిచెడులు అంటని ఒకానొక ప్యూర్ ఎమోషనల్ ఫీలింగ్)

అదే రకరకాల భావాలుగా మారుతుంది!!!"

పరమాత్మ కు మూడు లక్షణాలు.

1. సత్

అంటే ఈ విశ్వమంతా ఉన్న ఉనికి
దాని అంశ మనలో వ్యక్తిగతమైన కాన్సియస్ గా మారింది

2. చిత్

అంటే సర్వజ్ఞత్వం
దాని అంశ మనలో వ్యక్తిగతమైన "ఏకాగ్రతగా" మారింది.

3. ఆనందం

అంటే బ్రహ్మానందం (బ్రహ్మానందం అంటే ఏంటి?అనేది ఉపనిషత్తులు అద్భుతంగా వర్ణించాయి.ఇది పెద్ద టాపిక్ కాబట్టి ఇక్కడ వర్ణించడం లేదు.)

దాని అంశనే మనలో ఇంతకు ముందు చెప్పినట్లు "ప్యూర్ ఫీలింగ్ "గా మారింది.


పూర్ణంగా శుద్ధిగా ఉన్న ఆ లక్షణాలు మనలో అంశమాత్రంగా మాత్రమే ఇప్పుడు అనుభూతి చెందుతున్నాము!!

"తిరిగి పూర్ణత్వాన్ని చేరుకుని ఆ " సచ్చిదానంద స్థితిని పొందడమే జీవుని లక్ష్యం."

                               ✡️✡️✡️✡️✡️

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

భారమైన జీవితం

""హాస్యం , భావుకత,వివేకం  అంటే తెలియని వారితో

అది స్నేహమైనా....

దాంపత్యమైనా...

జీవితం చాలా భారమౌతూవుంటుంది!!!! క్షణమొక యుగంలా గడుస్తుంది.""

ఉదాహరణగా ఈ క్రింది కథ చదవండి.

అప్పుడే పెళ్ళైన ఒక భార్య  వారం రోజులకే వచ్చిన ఆషాడ మాసంలో ...
..తన పుట్టింట్లో ఉంటూ తన భర్తకు వాట్సాప్ లో తన మొదటి ప్రేమలేఖ ఇలా రాసింది!!!

నా ప్రియాతి ప్రియమైన శ్రీవారు!!

నీవు నిద్రించినప్పుడు నీకలలను కొన్ని నాకు పంపు!

నీవు నవ్వుతున్నప్పుడు నీ నవ్వుల్ని కొన్ని నాకు పంపు!!

నీవు తింటున్నప్పుడు నీ రుచుల్ని నాకు కొన్ని పంపు!!!

నీవు శ్రమిస్తూ ఉంటే నీ చెమటబిందువులను నాకు కొన్ని పంపు!!!!

నీవు స్నానం చేస్తున్నప్పుడు  నీ ప్రేమబిందువులను నాపై కాస్తా చిలకరించు!!!!!

ఒకవేళ ఏ కారణంగానైనా నీవు దుఃఖంగా ఉంటే నీ కన్నీళ్ళని నాకు కొన్ని పంపు!!!

నీ కష్టసుఖాలన్నింటిలో నేను భాగమయ్యానన్న సంగతి మరచిపోకు!!!

నీవు నాపై కురిపించిన తలంబ్రాల ప్రేమ స్పర్శ ఇంకా నన్ను పులకరింప చేస్తూనే ఉంది.

పూర్వం నలుడు దమయంతికి మేఘం ద్వారా సందేశం పంపేవాడట!!!

ఇప్పుడు ఈ వాట్సాప్ అనే మేఘం ద్వారా పంపే మీ సందేశం కోసం ఎదిరిచూస్తుండే ....

నీ
శ్రీ

""""""""""""""""""""""""""" I Love U """"''"'""""""'''''"''''"""""""

( Ps:- ముఖ్యమైన విషయాన్ని ఈ గుర్తులో సూచిస్తారట!! అందుకే అన్ని గుర్తులతో సూచించాను😊)

......ఇలా మొదటి ప్రేమలేఖ రాసింది.

భర్త దగ్గరి నుండి ఇలా సమాధానం వచ్చింది.

Dear Sri
( డియర్ శ్రీ )

Em rasinav
(ఎం రాసినవ్)
Oka mukka kooda artham kale
( ఒక ముక్క కూడా అర్థం కాలే!)
Nuv rasinavanni pampadam ekkada sadhyamaitadi.
( నువ్వు రాసినవన్నీ పంపడం ఎక్కడ సాధ్యమౌతుంది?)

Nuv btech chesinavante mastu knowledge untadanakunna
( నువ్వు బిటెక్ చేసినవంటే మస్తు నాలెడ్జ్ ఉంటదనుకున్నా!)

Sare parledule
( సరే! పర్లేదులే!!)
Adollaki mogolla lekka knowledge undadani ma tata chebtunde
(ఆడోళ్ళకి మొగోళ్ళ లెక్క నాలెడ్జ్ ఉండదని మా తాత చెబ్తుండే!!)

Gavi sadhyam gavugani oka cheera koni pampumante pamputa
( గవి సాధ్యంగావుగానీ ఒక చీర కొని పంపుమంటే పంపుతా!)

Talambrala vishayam manchiga yadijesinav
Talambralaku biyyam takkuva posindlu ani ma amma annadi.
( తలంబ్రాల విషయం మంచిగా యాదిజేసినవ్! తలంబ్రాలకు బియ్యం తక్కువ పోసిండ్లు! అని మా అమ్మ అన్నది)

Last ki emo rasinav
Em gurtulu
(లాస్ట్ కి ఏమో రాసినవ్? ఎం గుర్తులు?)

Sare nenu ellundi vasta
Tensan pettukoku
(సరే! నేను ఎల్లుండి వస్తా. టెన్షన్ పెట్టుకోకు!!!!)

I Too Love U

.
.
.
.
.
.
.
.
.
.
.
.

( ఈ ఉత్తరం చదివిన అతని భార్య కారణం లేకుండానే కొన్ని గంటల పాటు ఏడ్చింది.

ఆమే సనాతన ధర్మంలో పుట్టిన ఋషుల మాటలను తు. చ.తప్పకుండా ఆచరించాలనుకునే స్త్రీ.

జీవితకాలమంతా అతనితో గడపబోయే జీవితం ఎంత భారంగా మారబోతుందో ఆమెకు ఊహించుకుంటేనే భయం వేయసాగింది!!!!!)

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

                              ✡️✡️✡️✡️✡️