Tuesday 31 October 2017

ఉసిరిచెట్టు పూజ

ఉసిరి చెట్టు పూజ
-----------------------------

రచన:- గురుమంచి రాజేంద్రశర్మ

కార్తీక మాసం..వైకుంఠ చతుర్దశి..

తన కోడలును తీసుకుని గుడికి బయలుదేరింది సీతమ్మ!

కోడలు తనతో పాటు తన 3 సంవత్సరాల బాబును తీసుకుని వచ్చింది.

వాళ్ళతో పాటుగా.. తమ ప్రాంతంలో జరిగే కార్తీకపౌర్ణిమ జాతర సందర్భంగా వచ్చిన12 సంవత్సరాల .. "సీతమ్మకూతురుకొడుకైన".. "ధ్రువ"ని కూడా బాబును చూసుకోవడానికి తోడుగా తీసుకెళ్లారు.

గుడికెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత..
"బావ దగ్గర ఆడుకో నాని!!" అంటూ బాబుని ధ్రువకు అప్పజెప్పి సీతమ్మ కోడలుతో కలిసి ఉసిరి చెట్టును పూజించడానికి వెళ్ళింది.

కార్తీకమాసంలో ఉసిరి చెట్టును ధాత్రి నారాయణ స్వరూపంగా భావించి పూజిస్తుంటారు! అక్కడ వత్తులు ..దీపాలు వెలిగించడం వంటివి చేస్తుంటారు!!

అక్కడ జరుగుతున్న పూజాతతంగమంతా చూసి ధ్రువ అకస్మాత్తుగా తనదగ్గరున్న బాబు బుగ్గలను చాలా గట్టిగా పిండి వాణ్ణి ముద్దుపెట్టుకున్నాడు.

ఆ బాబు.. 'బుగ్గలు పిండిన నొప్పి' వల్ల గట్టిగా ఏడుపులంకించుకున్నాడు!!!

ఆ ఏడుపువిని సీతమ్మ..కోడలు పరుగెత్తుకొచ్చారు.ఏం జరిగిందోనని...

జరిగింది తెలుసుకుని..

సీతమ్మ ధ్రువని..

"నీ ప్రేమా..మురిపెం విడ్డూరంగానూ!..
బాబును చంపేస్తావా ఏమీ???
బుగ్గలింత గట్టిగా పిండుతారా??
బుగ్గలన్నీ ఎర్రగా ఎలా కందిపోయాయో చూడొకసారి!!
ఇదేం ప్రేమరా మనవడా??
పసి పిల్లలు భగవంతుని స్వరూపంరా!!
అలా హింసించొద్దు!!!" అంటూ మందలించింది..ఆ బాబుని ఎత్తుకుని బుజ్జగిస్తూ...

అవే మాటలను అనుకరిస్తూ ధ్రువ కూడా సీతమ్మతో...

" మీ మూఢ భక్తి..పూజలు విడ్డూరంగానూ!...
చెట్టును చంపేస్తావా ఏమీ???
చెట్టు మొదట్లో వేయి వత్తులు..లక్ష వత్తులు అంటూ ముట్టిస్తారా??
చెట్టు కాండమంతా నల్లగా ఎలా కాలి మాడిపోయిందో చూడొకసారి!!
ఇదేం భక్తినే అమ్మమ్మా!!
భగవంతుని స్వరూపమనే చెట్టుకు పూజ చేస్తున్నారు కదనే!!
అలా హింసించొద్దు!!!"  అన్నాడు..ఏడుపు మగ్గిన ఆ బాబును తిరిగితీసుకుని ఆడిస్తూ...

ధ్రువ ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ తో  తిరిగి ఉసిరిచెట్టు వద్దకు వెళ్లిన సీతమ్మ-ఆమె కోడలు ఈ సారి చెట్టుకు చాలా దూరంగా వత్తులూ..దీపాలు పెట్టి పూజించసాగారు!!

🔯🔯🔯🔯🔯

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

No comments:

Post a Comment