Thursday 12 October 2017

అకారణ ద్వేషం

#అకారణద్వేషం#

రచన:-గురుమంచి రాజేంద్రశర్మ.

ఒక గ్రామ సర్పంచ్ తన కుటుంబంతో సహ హరిద్వార్ టూర్ వెళ్లాడు.

అక్కడి ప్రదేశాలన్ని చూసిన తర్వాత
అక్కడ ఒక కొండగుహలో ఒక స్వామీజి ఉన్నాడని, అక్కడికి వెళ్దామని భార్య బలవంతపెడితే వెళ్లాడు.

అతని భార్య తన పిల్లల గూర్చి ఏవేవో ప్రశ్నలు అడిగితే స్వామీజి సమాధానం చెప్పారు.

తర్వాత స్వామీజి ఈ సర్పంచ్ వైపు తిరిగి "నాయనా! నువ్వు కూడా ఏమైనా అడగాలనుకుంటున్నావా?"అని ప్రశ్నించాడు.

"స్వామీజీ! నిజానికి నాకు ఇటువంటి వాటిపైన పెద్దగా నమ్మకం లేదు! కానీ ,ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో !!స్వామీజీని అడగకపోతినే! అడిగితే  చెప్పేవాడేమో! అనే ఒక బాధ మిగిలిపోతుంది. అందుకని నా మనసులో పట్టిపీడిస్తున్న సందేహాన్ని అడుగుతున్నాను.

మా గ్రామంలో నలుగురు పెద్ద మనుషులున్నారు. వారు నా ముందు బాగానే ఉన్నా, చాటుగా బద్ద శత్రువుల మాదిరిగా నాకు వ్యతిరేక ప్రచారం చేస్తూవుంటారు.

మొదట్లో వాళ్లు నాకు అనుకూలంగా ఉన్న వారే !సహాయం చేసిన వాళ్లే!

నేను వాళ్లకు చేసిన నష్టం కూడా ఏమీలేదు! పైగా అంతో ఇంతో లాభమే చేశాను.ఇప్పటికి కూడా వాళ్ళ పట్ల నాకు మంచి భావమే ఉంది.

కానీ, వాళ్లు నన్నెందుకు శత్రుభావంతో చూస్తున్నారు ?ఎందుకు  నాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారో ? దానికి కారణాన్ని తెలుసుకోవాలని వుంది !స్వామీజీ!

సాధ్యమైతే చెప్పగలరని ప్రార్థిస్తున్నాను!! "

అది విన్న స్వామీజీ ఒక పది నిమిషాలు ధ్యానముద్రలోకి వెళ్ళి ప్రశాంతంగా చిరునవ్వుతో ఇలా చెప్పసాగాడు.

నాయనా !ఆ నలుగురిలో ఒకరి విషయాన్ని చెబుతాను. దాదాపు ఆ మిగిలిన వారు కూడా ఇలాంటి కారణాలతోనే నీ పట్ల శత్రుభావాన్ని పెంచుకున్నారు.

"ఒక రోజు అతను తన మిత్రులతో కలిసి నడచి వస్తున్నాడు అప్పుడు నువ్వు ఎమ్మెల్యే నుండి ఫోన్ వస్తే హడావుడిగా వెళ్తున్నావు.

అతను నిన్ను చూసి విష్ చేసాడు కానీ హడావుడిలో ఉన్న నువ్వు అది గమనించక వెళ్ళిపోయావు.

అతను విష్ చేయడానికి లేపిన చేతితో తల గోక్కున్నట్లు నటించాడు.

మరోసారి 'అలిగివెళ్లిన నీ కొడుకు' చాలాసేపటి వరకూ ఇంటికి రాకపోయేసరికి  ఆందోళనతో నీ కొడుకు గూర్చి వెతుకుతున్నావు.

అతను దారిలో నిన్ను చూసి విష్ చేసాడు. కానీ ఆందోళనతో ఉన్న నువ్వు అది గమనించలేదు.

ఈసారి అతను విష్ చేయడానికి లేపిన చేతితో ముక్కు గోక్కున్నట్లుగా నటించాడు. నీకు బాగా పొగరు వచ్చిందని మనసులో అనుకున్నాడు. అవమానంగా ఫీలయ్యాడు.

మరో రోజు నీకు గుర్తుందా!  అపెండిసైటిస్ ఆపరేషన్ అయిన సందర్భంలో బాగా కడుపునొప్పి వచ్చి బయలుదేరావు !

అప్పుడు కూడా అతడు విష్ చేసాడు. బాధతో ఉన్న నువ్వు అతన్ని గమనించలేదు.

ఈసారి అతను విష్ చేయడానికి లేపిన చేతితో భుజాలమీద పడిన దుమ్ము దులుపుకున్నాడు.

ఇలా మూడుసార్లు జరిగే సరికి అతను చాలా అవమానంగా ఫీలయ్యాడు నీపట్ల పూర్తి వ్యతిరేక భావం ఏర్పడింది.

ఒక పెళ్ళిలో మీరిద్దరు కలిశారు. అతడు పలకరించడానికి ముందుకు వస్తున్నాడు.. అదే సమయంలో నువ్వు కూడా అతన్ని చూసి పలకరిద్దామని వెళుతున్నావు .

అప్పుడే నీకు మీ అన్న కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని పోలీస్ స్టేషన్లో ఉందని ఫోన్ వచ్చింది హడావుడిగా వెళ్లిపోయావు.

అతనికి భరించలేని అవమానంగా అనిపించింది. నీ పట్ల పూర్తి శత్రుభావం ఏర్పడింది.అందుకే అవకాశం దొరికినపుడల్లా లేదా అవకాశం సృష్టించుకుని నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు.

ఒకసారి వెనక్కి చూసుకుంటే నీకు అర్థమౌతుంది అప్పటినుండి అతను నీ వద్దకు ఎప్పుడూ రాలేదు కలిసినప్పుడు కూడా నువ్వు మాట్లాడిస్తేనే మాట్లాడాడు.

మిగతా ముగ్గురు కూడా దాదాపు ఇలాంటి కారణాలతోనే నీపట్ల శత్రుభావాన్ని ఏర్పరుచుకున్నారు.

ఇదే !నాయనా!! నువ్వడిగిన దానికి  కారణం!!! " అని సమాధానం ఇచ్చాడు స్వామీజీ.

ఆ సర్పంచ్ చాలా ఆశ్చర్యపొయాడు.

" స్వామీజీ! మరీ ఇంత చిన్న విషయానికి అంత శతృత్వమా? " అని ప్రశ్నించాడు.

"నాయనా! మనుషుల్లో ఆరురకాల స్థాయిలు ఉంటాయి .

అందులో మొదటి స్థాయి వారు నీ దగ్గర నుండి తేరగా వచ్చే వాటి కోసం ఆశపడతారు. అందుకోసం నీచుట్టూ తిరుగుతారు. వారితో నువ్వెలా వ్యవహరించినా సరే! వారి దృష్టంతా నీనుంచి పొందే లాభాలమీదనే ఉంటుంది.

నీపట్ల శతృభావం కలిగిన ఈ నలుగురిది రెండవదైన ఆవేశ స్థాయి.

వీరిని ఆశపెట్టి నీవైపు మలుచుకోలేవు . వీరికి కావలసింది అవసరమైనదానికన్నా ఎక్కువ మర్యాద- గౌరవం

వీటిని ఎవరైనా విరివిగా గుమ్మరించారంటే.. వారికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు దీనికి వ్యతిరేకంగా ఎవరైనా అవమానించారని భావిస్తే శత్రుభావం వహించి తీవ్రమైన చెడు ప్రచారం చేస్తారు.వీరికి డాబు-దర్పం ఎక్కువ." అన్నాడు స్వామిజీ.

" స్వామిజీ! ఆ మిగతాస్థాయిల గూర్చి కూడా వివరిస్తారా?" ప్రశ్నించాడు సర్పంచ్.

" చాలు నాయనా! నీకు రెండుస్థాయిల వరకే సరిపోతుంది. ఇప్పటికే మీకు ఎక్కువ సమయం కేటాయించాను. శుభమస్తు!" అంటూ దీవించాడు స్వామిజీ.

ఆ సర్పంచ్ చిరునవ్వుతో " స్వామిజీ! నేను చాలా సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నాను.ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థమైంది. చాలా చాలా ధన్యవాదాలు స్వామి! " అంటూ భక్తితో నమస్కరించాడు.
           
                                    ✡️✡️✡️✡️✡️

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

No comments:

Post a Comment