Monday 30 October 2017

కాఫీ & ఫెస్ట్

కాఫీ & ఫెస్ట్
----------------

రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

ఒక వర్ధమాన రచయిత మన కథలలో ఉండే స్వామీజీ దగ్గరికి వెళ్లి ఇలా ప్రశ్నించాడు.

స్వామీజీ! నేను కథలను రాస్తున్నాను. రాసిన కథలను ఫేస్బుక్ మొదలగు వాటిల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కానీ, అలా పెట్టిన కథలను చాలామంది నా పేరు తీసివేసి కాఫీ అండ్ పేస్ట్ చేస్తున్నారు స్వామీ!!

మరి కొంతమందయితే నా పేరు స్థానంలో తమ పేరు పెట్టుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి ?స్వామీ!" అంటూ ప్రశ్నించాడు.

ఎప్పటిమాదిరిగానే ఆ స్వామిజీ ఒక పది నిమిషాలు ధ్యానముద్రలో కి వెళ్లి.. ఇలా చెప్పసాగాడు.

"నాయనా !అది ప్రకృతి సూత్రం!!

అది ఏ  ఉద్యోగమైనా, పనైనా ఆ వ్యక్తి ట్రేనింగ్ లో వున్నప్పుడు..

'ఫలితం తక్కువగా ఉంటుంది! శ్రమ దోచుకోబడుతుంది!

అలాగే అనుభవం పెరిగిన కొలది అదే శ్రమకు ఫలితం ఎక్కువగా ఉంటుంది. పైగా ప్రమోషన్లు కూడా వస్తాయి!! 

నాయనా! నువ్విప్పుడు ట్రైనింగ్ లో ఉన్నావు..." అన్నాడు స్వామీజీ.

ఆ మాటలు విన్న వర్ధమాన రచయిత యొక్క సందేహం తీరడమే గాక ఒకానొక ఆనందం కూడా అతని ముఖంపై కనిపించింది.

"ధన్యవాదాలు! స్వామి!!" అంటూ నమస్కరించి లేవబోయే లోపు...

స్వామీజీ ఇలా అన్నాడు.

"నాయనా ! మరో మాట !!నరేంద్ర మోడీ ఒక కవిత రాసి ఫేస్బుక్లో పోస్టు చేశాడనుకో!

అప్పుడు ఆ కవితను కాఫీ అండ్ పేస్ట్ చేస్తారా? లేక షేర్ చేస్తారా?"

"నిశ్చయంగా షేర్ చేస్తారు స్వామి! ఎందుకంటే.. కవిత కున్న ప్రఖ్యాతి కన్నా మోడీ కున్న ప్రఖ్యాతి ఎక్కువ కనుక!!" అన్నాడు వర్ధమాన రచయిత.

"సరే !ఈ విషయం కూడా గమనిస్తావనే ఉద్దేశ్యంతో చెప్పాను.
అయినా నీకు ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు! రచయితవి కదా!!" అంటూ చిరునవ్వు నవ్వాడు స్వామిజీ.

                                  ✡️✡️✡️✡️✡️

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

No comments:

Post a Comment