Wednesday 11 October 2017

కోపం - అవగాహన

వ్యక్తిగతమైన దుఃఖం తమో గుణమైతే..కోపం అనేది రజో గుణం!!

చాలా సందర్భాలలో మనం సరియైన విధంగా ఆలోచించక పోవడం - అవగాహన చేసుకోకపోవడమే కోపం రావడానికి కారణమౌతూ ఉంటుంది.

ఉదాహరణగా ఈ క్రింది కథ చదవండి!

                               ✡️✡️✡️✡️✡️

ఒక సాయంకాల సంధ్యా సమయంలో ఒక వ్యక్తి దేవాలయంలో దేవున్ని దర్శించుకుని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాడు.

అదే సమయంలో ఇద్దరు పిల్లలు అక్కడ విపరీతంగా అరుస్తూ అల్లరి చేస్తున్నారు.

ధ్యానం చేసే వ్యక్తి ఎంత సముదాయంచినా పిల్లలు అదే తంతును కొనసాగిస్తున్నారు.

ఆ వ్యక్తిలో అసహనం పెరిగిపోతూ ఉంది. ఆ పిల్లలు ఆడుతూ - తిరుగుతూ వుంటే వాళ్ల కాళ్లకు తగిలి అతని పూల బుట్టలో ఉన్న ప్రసాదం దూరంగా పడింది.

సరిగ్గా అప్పుడే ఆ పిల్లల తాలుకు వ్యక్తి పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చాడు.ఆ వ్యక్తి పిల్లల పై ఉన్న కోపాన్ని ఆ పిల్లల తాలుకు వ్యక్తిపై చూపిస్తూ చివాట్లు పెడుతూ అరవడం ప్రారంభించాడు.

అప్పుడు పిల్లల తాలుకు వ్యక్తి శాంతంగా ఇలా చెప్పడం ప్రారంభించాడు!!!

"అయ్యా! క్షమించండి!!
ఈ పిల్లలు తల్లి దండ్రి లేని అనాథ శరణాలయం పిల్లలు! నేను ఆ శరణాలయంలో ప్రతి సాయంత్రం ఉచితంగా సేవ చేస్తుంటాను.
ఈ పిల్లలిద్దరికి బ్రెయిన్ ట్యూమర్.
పిల్లలు ఆనందంగా ఉంటారనే ఉద్దేశ్యంతో ఇలా గుడికి తీసుకువచ్చాను.
జరిగిన పొరపాటుకు మన్నించండి " అన్నాడు.

అప్పుడు ఆ ధ్యానం చేసే వ్యక్తి కోపం అంతా ఒక్కసారిగా జాళి గా మారిపోయింది.

కాబట్టి రజో -తమో గుణ పరిధిలోని భావాలు ఎప్పుడూ శాశ్వతం కావు. అవి మన మనుసును బట్టి వెంటది వెంట మారుతూ వుంటాయి.

ఇదే ఉదాహరణలో  ఆ పిల్లల తాలుకు వ్యక్తి ఇప్పటికే పది మర్డర్లు చేసిన ఒక సైకో అన్న విషయం తెలిస్తే ఆ ధ్యానం చేసే వ్యక్తిలో కోపం - జాళి స్థానంలో "భయం "ప్రవేశించేది.

ఆ పిల్లల తాలుకు వ్యక్తి ఒక కర్ర తీసుకుని ఆవేశంతో చెడామడా వాయిస్తే "దు:ఖం " ప్రవేశించేది.

ఆ పిల్లలు యవ్వనం లో తాను చేసిన పొరపాటు వల్ల కలిగిన తన పిల్లలే అని తెలిస్తే " ప్రేమ "కలిగేది.

ఇలా అవగాహనను బట్టి ,మనుసును బట్టి కోపం రకరకాల భావాలుగా మారుతూ ఉంటుంది.

నిజానికి " ఉన్నది శుద్ధభావం ఒక్కటే! (అంటే కోపం,దుఃఖం,వ్యక్తిగత సంతోషం,జాలి,రాగం,ద్వేషం వంటి మంచిచెడులు అంటని ఒకానొక ప్యూర్ ఎమోషనల్ ఫీలింగ్)

అదే రకరకాల భావాలుగా మారుతుంది!!!"

పరమాత్మ కు మూడు లక్షణాలు.

1. సత్

అంటే ఈ విశ్వమంతా ఉన్న ఉనికి
దాని అంశ మనలో వ్యక్తిగతమైన కాన్సియస్ గా మారింది

2. చిత్

అంటే సర్వజ్ఞత్వం
దాని అంశ మనలో వ్యక్తిగతమైన "ఏకాగ్రతగా" మారింది.

3. ఆనందం

అంటే బ్రహ్మానందం (బ్రహ్మానందం అంటే ఏంటి?అనేది ఉపనిషత్తులు అద్భుతంగా వర్ణించాయి.ఇది పెద్ద టాపిక్ కాబట్టి ఇక్కడ వర్ణించడం లేదు.)

దాని అంశనే మనలో ఇంతకు ముందు చెప్పినట్లు "ప్యూర్ ఫీలింగ్ "గా మారింది.


పూర్ణంగా శుద్ధిగా ఉన్న ఆ లక్షణాలు మనలో అంశమాత్రంగా మాత్రమే ఇప్పుడు అనుభూతి చెందుతున్నాము!!

"తిరిగి పూర్ణత్వాన్ని చేరుకుని ఆ " సచ్చిదానంద స్థితిని పొందడమే జీవుని లక్ష్యం."

                               ✡️✡️✡️✡️✡️

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

No comments:

Post a Comment