Showing posts with label మనసులోని మాట. Show all posts
Showing posts with label మనసులోని మాట. Show all posts

Monday, 9 October 2017

సామాన్యుని సలహా


రచన:- గురుమంచి రాజేంద్రశర్మ

ఒక కారు తయారీ కంపెనీ యజమాని తన కంపనిలోని ఒక ఇంజనీయర్ కు " ఒక మంచి కారును డిజైన్ చేసి తయారు చేయుమని" ఒక పని అప్ప చెప్పాడు.

ఆ ఇంజనీయర్ " ఒక అద్భుతమైన కారును "తయారుచేసి సిద్ధంగా ఉంచి యజమానికి కబురుపెట్టాడు.యజమాని వచ్చి ఆ కారును చూసి ఆశ్చర్యానందాలను వ్యక్తం చేయడంతోపాటు అతని పనితనాన్ని చాలా మెచ్చుకున్నాడు.

ఆ కారును కంపెనీ తయారు ప్రదేశం నుండి షోరూంకు తీసుకొద్దామని చూసేసరికి ప్రవేశ ద్వారం కన్నా కారు కొన్ని ఇంచులు ఎత్తుగా ఉంది.

కారును తయారు చేసేముందు ఈ విషయం గమనించలేక పోయినందుకు ఇంజనీయర్ లోలోపల చింతించసాగాడు.

తయారీ ప్రాంతం నుంచి వెలుపలకు కారును ఎలా తీసుకోవాలో ఆ యజమాని ఆలోచించసాగాడు.

అక్కడే ఉన్న "ఫేంటర్" కారును అలాగే బయటకు తీసుకు వద్దాం! కారు పైన కొన్ని గీతలు.. నొక్కులు పడితే తర్వాత సెట్ చేసుకోవచ్చు!! అని సలహా ఇచ్చాడు.

"ప్రవేశ ద్వారం పగులగొట్టి కారు బయటకు తీసుకువద్దాం! తర్వాత ద్వారాన్ని రిపేర్ చేయిద్దాము! " అని ఇంజనీయర్ సలహా ఇచ్చాడు.

ఈ రెండు సలహాలు విని యజమాని కన్వీనెన్స్ కాలేక పోయాడు.ఎందుకంటే అలా కారుకు నొక్కులూ,గీతలు పడడం కానీ, ద్వారాన్ని పగలగొట్టడం కానీ మంచి శకునంగా అతడు భావించలేకపోయాడు.

జరుగుతున్న విషయమంతా చూస్తున్న అక్కడే ఉన్న "వాచ్ మెన్ " భయం భయంగా సందేహిస్తూనే తన మనసులోని ఐడియా చెప్పాలని " ఒక చిన్న సలహా సార్! "అన్నాడు.

అక్కడున్నవాళ్ళు " నిపుణులే ఇవ్వలేని సలహాని వాచ్ మెన్ ఏమిస్తాడా? " అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా..

ఆ వాచ్ మెన్ ఇలా అన్నాడు.

"కారును బయటకు తీసుకురావడం చాలా ఈజీ సార్! కారు, ద్వారం కన్నా కొన్ని ఇంచులే ఎత్తుగా ఉందికదా సార్! కారు టైర్లలోని "గాలి" కొంత తీసేసి బయటకు తెచ్చి తిరిగి కారుటైర్లలో గాలినింపితే సరి!!" అన్నాడు.

వాచ్ మెన్ సలహా విని అతన్ని అభినందిస్తూ అక్కడున్న ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టసాగారు.

                          ✡️✡️✡️✡️✡️
కాబట్టి ,కేవలం నిపుణుల అభిప్రాయం  తీసుకుని మాత్రమే సమస్యలను విశ్లేషించవద్దు!!

ఒక్కోసారి చదువుకోని తాతనో, నానమ్మనో, అమ్మమ్మనో వంటి  తాము సామాన్యంగా భావించే వ్యక్తులు కూడా..

"ఎంతో కష్టం అని భావించిన సమస్యను అతి సులభంగా పరిష్కరించవచ్చు!! "

...ఈ కథలో నేర్చుకోవలసిన మరో నీతి కూడా ఉంది.
మిత్రులతోనో, బంధువులతోనో.. గొడవ వల్లనో మరే కారణం వల్లనో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఈ కథలోని కారులా మనం ఎత్తుగా (ఉన్నతంగా అనుకొని)  వారి ఇంటి ప్రవేశ ద్వారం చిన్నగా ప్రవేశించలేనిదానిలా కనిపిస్తుంది.

అప్పుడు ఈ కథలోని వాచ్ మెన్ సలహా పాటించాలి!!

కొంత గాలి (ఇగో) తీసివేసి...ఎత్తును (ప్రవర్తనను) అడ్జెస్ట్ చేసుకోవాలి.

నిజానికి మనమందరం ఆనంద స్వరూపమైన "ఆత్మ" కలవారం!!
కానీ,
""అనవసరమైనవి జమ చేస్తూ ఉంటే అశాంతితో బరువెక్కిపోతాము!!!!!
ఈ చెత్తానంతా తొలగించుకుంటున్నా కొద్దీ ఆనందంతో తేలికైపోతాము!!!!! ""
                           ✡️✡️✡️✡️✡️
ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

మన జీవితమే మనకు ముఖ్యం





ఒక వ్యక్తి బ్రహ్మచారిగా  ఉన్నప్పుడు .." ఊ! ఏమిటి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ?" అని అడుగుతుంటారు.

ఉద్యోగమో, వ్యాపారమో చేసి ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యాడనుకో! " ఎం సంగతి? పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావ్ ?(వివాహం ఎప్పుడు?) అని అడుగుతారు.

వివాహం చేసుకున్నాడనుకోండి!  "పిల్లలు ఎప్పుడు? (ఇంకా పిల్లలు కాలేదా?) అని అడుగుతారు.

ఒక సంతానం కలిగింది అనుకోండి! " రెండో సంతానం ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? "అని అడుగుతారు

విడాకులు తీసుకుంటే, "ఎందుకు?? "అని అడుగుతారు

మళ్ళీ  జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తే
"ఎందుకు చాలా త్వరగా?? "అడుగుతారు.

పోనీ చేసుకోకుంటే " మళ్ళీ పెళ్లి చేసుకోవా? "అని అడుగుతారు.

సైకిల్ ఉంటే " బండి ఎప్పుడు కొంటున్నావు ? " అని అడుగుతారు. బండి ఉంటే " కారు ఎప్పుడు " అంటారు. కారు ఉంటే "క్రొత్త కారు ఎప్పుడు ?" అంటారు.

లోకం తీరే అంత!! ప్రజలు  ఒక వ్యక్తిని ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడూ ఒప్పుకోరు!! ఇంకేదో కావాలంటారు !!

కానీ , ఒక వ్యక్తి తాను ఉన్న స్థితిని ఎక్సెప్ట్ చేసి ..తన పట్ల తాను సగర్వంగా ఉంటే, ప్రజలు ఏమనుకుంటున్నారో పట్టించుకోడు!!

అలా లేని వారే ఇతరుల గురించి ఆలోచిస్తూ మనసు అశాంతి పర్చుకుంటారు.

ఇది మన  జీవితం..

ఇతరుల మాటలు వినో..ఇతరులతో పోల్చుకునో..తాత్కాలిక సుఖాలకు ఆశపడో.. అనవసర చెత్త ఆకర్షణలకు లోనయ్యో ..జీవితాన్ని గడపడం వల్ల అశాంతి తప్పదు!!

ఇతరుల మాటలు మనకు అనవసరం.మన లోపలి మనసు ఏం చెబుతుందో అదే ముఖ్యం....అలా అది కోరుకున్న విధంగా మనం జీవిస్తూ ఉండాలి ...!
                          ✡️✡️✡️✡️✡️
ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

Saturday, 30 September 2017

స్త్రీలో 50% పసితనం ?


     


నేను గమనించినంత మట్టుకు " స్త్రీ "లో
50% పెద్దరికం
50 % పసితనం
ఉంటాయనిపిస్తుంది.

బహుశా అందుకే పసిపిల్లలను అర్థం చేసుకునే మంచి తల్లిగా ఉండగలుగుతుంది.

అలాగే భర్తను అర్థం చేసుకునే మంచి భార్య కూడా కాగలదు.

పిల్లలకుండే "ప్రకృతితో తదాత్మ్యం చెందే భావుకత్వం" - "బుద్ధితో కాకుండా హృదయంతో వ్యవహరించే ప్రవర్తన " స్త్రీలలో సజీవంగానే ఉంటాయి.

చాలామంది అమ్మాయిలు " తనకు బాగా నచ్చిన మరియు అర్థం చేసుకున్న పురుషుడు" ఎవరంటే ... అది తన తండ్రే అని చెబుతారు. అందుకు కారణం తండ్రి తన కూతురిలో పెద్దరికంతో పాటు పసితనాన్ని కూడా చూసి వ్యవహరించడమే!

అదే మగవారిని గమనిస్తే వారు పూర్తిగా పెద్దరికంగా ఉండడానికి ఇష్టపడుతారు.

ఇక స్త్రీతో సంబంధ బాంధవ్యాల విషయం ఆమె ఆ క్షణంలో ఉన్న మానసిక స్థితిని అనుసరించి పసిపిల్లలా గారాబం చేసి ప్రేమనందించాలా? లేక పెద్దరికం ఆపాదిస్తూ సలహాలూ - సూచనలు తీసుకుని భాగస్వామ్యం కల్పించాలా? అని నిర్ణయించుకునే పురుషుని విచక్షణ మరియు సమయస్పూర్తిపై ఆధారపడి ఉంటుంది.

దేశాలను గెలిచిన రాజైనా స్త్రీతో వ్యవహరించే విషయంలో కొంత గందరగోళానికి గురి కావడానికి ఇదే కారణం అనిపిస్తుంది.

ఇక స్త్రీ పురుషునితో వ్యవహరించే విషయంలో 90% కన్ఫ్యూజ్ ఉండదు.పెద్దరికం ఆపాదిస్తూ ట్రీట్ చేస్తే సరిపోతుంది.ఒక చిన్న పిల్లాడుగా ట్రీట్ చేస్తే మాత్రం పురుషుడు తొందరగా హర్ట్ అవుతాడు.అది చిన్న పిల్లాడు అయినా సరే!☺ 

P.S: - ఇది నా అభిప్రాయం, పరిశీలన మాత్రమే! భార్యా - భర్తల మధ్య మంచి రిలేషన్స్ కోసం ఈ విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని మనవి.