Showing posts with label జ్యోతిషం. Show all posts
Showing posts with label జ్యోతిషం. Show all posts

Monday, 5 September 2016

మహాగణపతి తొలగించే విఘ్నలు - 1.అలసత్వం

వినాయక నమోస్తుతే!

------------------------------

   మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు 


రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

విఘ్నాలు తొలిగించే శక్తి ఉన్న ఒకే ఒక దేవతామూర్తి విఘ్నేశ్వరుడు . అందుకే విఘ్నాలు తొలగించే నాయకుడిగా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం. 

దేవతాగణాలన్నింటికీ కూడా ఆయనే అధిపతి.అందుకే ఆయనను వినాయకుడు - గణపతి అనే పేర్లతో పిలుస్తున్నాము.


జాతకం లో ఉన్న కేతు దోషాలు తొలగడానికి మహా గణపతిని పూజిస్తుంటారు.

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా కేతువుకు జ్ఞాన కారకుడు, మోక్ష కారకుడని పేరు.
జాతకంలో కేతువు అనుకూలంగా ఉంటే జ్ఞానాన్ని కలిగించి అనవసర బంధనాలను తొలగిస్తూ అభివృద్ధి పథంలో ప్రయాణింపజేస్తాడు.

అలా కాకుండా కేతువు వ్యతిరేక స్థానంలో ఉన్న వారికి అజ్ఞానం ఏర్పడుతూ అంటే బ్రమ, మాయలలో కూరుకుపోతూ వారు చేసే స్పృహ లేని పనుల వల్ల బంధనాలు ఏర్పడి పరాజయ మార్గంవైపు ప్రయాణిస్తూ ఉంటారు.మహా గణపతిని భక్తితో ఆరాధించడం వల్ల ఈ మాయా, బ్రమలూ, బంధనాలూ, విఘ్నాలు.. ఇవన్ని తొలగిపోతాయి.


మహా గణపతిని ఆరాధించడం వల్ల అభివృద్ధికి అంతరాయాలుగా ఉన్న విఘ్నాలన్నీ తొలిగిపోతాయి.

మరి ఈ విఘ్నాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎలా ఏర్పడుతాయి?

మహా గణపతి తొలగించే విఘ్నాలు  విఘ్న బీజాలు  గురించి వివరంగా తెలుసుకుందాము.

1) అలసత్వం


అలసత్వం అంటే సోమరితనం, బద్ధకం

ఈ రెండింటికీ కొద్దిగా తేడా ఉంది.


"వర్తమానంలో (అవసరమైన) ఉపయోగపడే పని విషయంలో ఏకాగ్రత లోపించడాన్ని"... సోమరితనం అంటాము.

అంటే ఉదాహరణకు 
ఒక విద్యార్థికి అవసరమైన ఉపయోగపడే పని - చదవడం. 

కాని అతనికి చదవడం పట్ల ఆసక్తీ - ఏకాగ్రత ఉండకుండా ప్రస్తుతం అవసరం, ప్రయోజనం లేని ఇతర వ్యాపకాలలో మునిగిపోవడం సోమరితనం అవుతుంది.

ఈ విఘ్నబీజం వల్ల భవిష్యత్తులో ఆ విద్యార్థి చదువు విషయంలో విఘ్నాలనూ, ఆటంకాలను ఎదుర్కొంటాడు.

అలాగే ఒక గృహిణికి అవసరమైన ఉపయోగపడే పని ఇల్లునూ - పిల్లలనూ - భర్తనూ శ్రద్ధగా చూసుకోవడం.
కాని ఈ విషయంలో ఆసక్తీ - ఏకాగ్రత ను కోల్పోయి TV సీరియల్లు - సెల్ ఫోన్ చాటింగ్ లలో మునిగిపోవడం, అలాగే TV సీరియల్లు చూస్తూ పిల్లల తో హోమ్ వర్క్ చేయించడం వంటివి చేస్తూ ఉంటే సోమరితనం అవుతుంది.

ఈ విఘ్నబీజం వల్ల భవిష్యత్తులో ఆమె పిల్లలు ...చదువూ - అభివృద్ధి విషయంలో వెనుకబడడం, కుటుంబ అభివృద్ధి మందగించడం, అనారోగ్యం, గొడవలు వంటి విఘ్నాలూ - సమస్యలు ఏర్పడుతుంటాయి.

మొత్తం మీద సోమరితనం అంటే అవసరమైన పనులనూ, ఉపయోగపడే పనులను నిర్లక్ష్యం చేసి అనవసర వ్యాపకాలలో మునిగిపోవడం.
ఇక
"శరీరాన్ని సుఖపెట్టాలనే కాంక్ష "  ను బద్ధకం అంటాము.

అంటే కూర్చుంటే లేవడం విసుగు . పనిచేయడం విసుగు .నడవడం విసుగు.
ఎప్పుడూ కాలు నొప్పి - కడుపు నొప్పి - భుజం నొప్పి - తలనొప్పి అంటూ సమస్యలను ఎకరువు పెడుతుంటారు.పోని అన్ని నొప్పులతో విశ్రాంతి తీసుకుంటారా?అంటే అలా ఉండదు. TV- ముచ్చట్లు - లాంటి వృథా కాలక్షేప వినోదాలలో మునిగిపోతారు.

ఇలా శరీరం లో సుఖ లాలసత ఏర్పడడం వల్ల శ్రమించడం అంటేనే విసుగు ఏర్పడుతుంది.కొద్దిగా శ్రమించే ఒక చిన్న పని కూడా ఏకాగ్రతగా చేయలేరు.
దీని వల్ల చేసే పనులలో నాణ్యత కొరవడి తన జీవితం- తనతో పాటు జీవించే వారి జీవితం కూడా నాణ్యత లేకుండా తయ్యారౌతుంది.

శ్లో|| అలసానాం మనుష్యాణాం సదా దు:ఖం దరిద్రతా I
ఆలస్యం పాతకం లోకే ఆలస్యం భూతి నాశనమ్ ॥
నాధిగచ్ఛన్తి భోక్తవ్య మలసాయే నరాధమా |
అలసానాం మనుష్యాణాం ప్రాప్తోZప్యర్థో వినశ్యతి ||
అని శాస్త్రం చెబుతుంది.

అంటే సోమరిపోతులూ - బద్ధకస్తులైన వారికి దు:ఖం, దరిద్రత వెన్నంటి ఉంటాయి. సోమరితనం ..అనేది పాప ఫలితం . సోమరితనం వల్ల ఐశ్వర్యమూ - అదృష్టం క్షయించబడుతాయి.వీరికి అనుభవించవలసిన శుభాలు కూడా విఘ్నాలు ఏర్పడి చేజారిపోతాయి.
అంటూ శాస్త్రం చెబుతూ ఉంది.

 మహాగణపతిని అత్యంత శ్రద్ధగా - భక్తిగా ఆరాధిస్తే మూలాధారం చైతన్యమౌతూ దోషాలు తొలగి ఈ అలసత్వం అనే విఘ్నబీజం తొలగిపోతుంది.

ఇక 

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా చూసినపుడు...
జాతకంలో కేతువు అనుకూలంగా ఉన్న "జ్ఞాని " కర్మ ఫలాలకు అంటకుండా ఉండే అభ్యాసం చేస్తూ ఉంటే..

జాతకంలో కేతువు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి మాయలో, సుఖ లాలసత్వం అనే మైకంలో మునిగి కర్మలకు దూరంగా ఉండే అభ్యాసం చేస్తూ కర్మ ఫలాలను మాత్రం తీవ్రంగా ఆపేక్షిస్తుంటాడు. అంటే పని చేయకుండా ఫలితాన్ని కోరుతాడన్నమాట!

"దంత పాశాంకుశ విఘ్న పరుశు లడ్డు సంజ్ఞికా :I బీజాపూర హవ్య ముద్రా విఘ్నేన విఘ్న పూజనాత్॥" 

అంటూ శాస్త్ర గ్రంథాలు మహాగణపతి ఉపాసనలో ఉపయోగించే 7 ప్రధాన ముద్రలగూర్చి వివరిస్తున్నాయి.

ఈ  అలసత్వం అనే విఘ్న బీజం తొలిగి మూలాధార చక్రం జాగృతం కావడానికి దంత ముద్ర తో     "ఓం వక్రతుండాయ హుం " అనే మంత్రాన్ని 21 లక్షల జపం చేయాలి.

ఈ విధంగా చేస్తే అలసత్వం సమూలంగా తొలిగిపోతుంది.

లేదా

ఇదే మంత్రాన్ని జపం చేస్తూ ప్రతి రోజు ఉదయం - సాయంత్రం శక్తికొలది గుంజీలు తీసినా ఫలితం ఉంటుంది.
   

                స్వస్తి .

(మరో రోజు గణపతి తొలగించే మరో విఘ్నం గూర్చి తెలుసుకుందాము.)

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ I
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ॥


       (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

నన్ను "నేను" తెలుసుకోవటానికి
నన్ను "నేను" మార్చుకోవటానికి
నన్ను "నేను" చేరుకోవడటానికి
మరియు అత్యుత్తమ జీవన విధానానికి
మీ ముందుకు "మహాగణపతి పూజ" తో వస్తున్నాను.        

గురుమంచి రాజేంద్రశర్మ













Monday, 29 August 2016

చంద్రుడు ఇచ్చే ఫలితాలు - దోషనివారణకు చంద్రకవచం

చంద్రుడు
---------------------------------------



రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


భోజనం _ నిద్ర విషయంలో సరియైన విధంగా వ్యవహరించకుంటే చంద్రుని అనుగ్రహాన్ని కోల్పోతారు. లేదా చంద్రుని అనుగ్రహం లేకుంటే ఆ విషయాలలో సరియైన విధంగా ఉండలేరు.

భోజనం - నిద్ర అనేవి పునాది లాంటివి.వీటి విషయంలో మనం వ్యవహరించే విధానాన్ని బట్టే ప్రస్తుత మన మానసిక స్థితి ఉంటుంది.

ఆనందంగా ఉండాలనుకునే వ్యక్తి ఆరోగ్యం - పవిత్రత - అవసరం - సమయం అనే వాటిని దృష్టిలో ఉంచుకుని భుజించాలి. కాన్సియస్ తో భుజించాలి.

పాపం లేదా దోషాలు పెరుగుతున్న ఫుడు మనిషి స్పృహ లేకుండా తింటాడు.

ఒక మనిషికి వ్యతిరేక సమయం నడుస్తున్నపుడు ఎలా ప్రవర్తిస్తాడు.అలాగే అదృష్ట సమయం నడుస్తున్నపుడు ఎలా ప్రవర్తిస్తాడు. అనే దానిని "మహాభారతం " వివరించింది.

ఆ సందర్భంగా ఆహార అలవాట్ల ప్రస్తావన కూడా ఉంది.

ఉదాహరణకు...

ఒక మనిషికి వ్యతిరేక సమయం నడుస్తున్నపుడు.....

శ్లో|| యదాయ మతి కష్టాని సర్వాణ్యుపనిషేవతే| 
      అత్యర్థ మపివా భుంక్తే నవా భుంక్తే కదాచన॥


అంటే...

తనకు హాని కలిగించే విరుద్ధమైన ఆహార పదార్థాలను తింటూ ఉంటాడు.

ఒకప్పుడు జిహ్వ చాపల్యం వల్ల అతిగా తింటాడు. మరొకప్పుడు పూర్తిగా తినడాన్నే మానుకుంటాడు.

(పండ్లు ఫలాలు లాంటి ఆరోగ్యాన్ని కలిగించే పదార్థాలు ఇంట్లో మురిగి పోతుండగా చూస్తాడు కాని వాటిని తినాలనిపించదు.
పవిత్రపరిచే దేవుని ప్రసాదాలు చీమలు పడుతున్నా చూస్తాడు కాని, తాను తినడు - ఇతరులకు పంచి పెట్టడు. ఆయా విషయాల్లో అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది.కాని ప్రకాశవంతంగా లేకపోవడం వల్ల విరుద్ధంగా ప్రవర్తిస్తాడు.)

శ్లో || దుష్టాన్న మిషపానంచ యదన్యోన్య విరోధిచI 
       గురుచాప్య మితం భుంక్తే నాతి జీర్ణేZపివాపున:॥

తినకూడని, త్రాగకూడని పదార్థాలను సేవిస్తాడు. ఒకదానితో ఒకటి సరిపడని పదార్ధాలను తింటాడు.
బలం తక్కువ బరువు ఎక్కువైన వాటిని తింటూ ఉంటాడు.అంతేకాక, అంతకు ముందు తిన్నది జీర్ణం కాకముందే మరల పొట్టను నింపుతూ ఉంటాడు.

ఉదాహరణగా రెండు శ్లోకాలను మాత్రమే ఇచ్చాను.

నిద్ర కూడా వీలైనంత తొందరగా పడుకుని సూర్యోదయం లో పే నిద్ర లేచే ప్రయత్నం చేయాలి.

 అలాగే ఇంతకు ముందు చెప్పినట్లు....

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా మానసిక శక్తికి చంద్రుడు కారకత్వాన్ని వహిస్తాడు.

జాతకంలో చంద్రుడు అనుకూలంగా ఉంటే దానర్థం... అతడు గత జన్మల నుండే మానసికంగా ఉత్సాహంగా ఉండడాన్ని అభ్యాసం చేస్తున్నాడన్నమాట!

ఎవరికైతే జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేడో అతడు గత జన్మల నుండే దు:ఖపడడాన్ని - నిరుత్సాహాన్ని - నెగిటివ్ థింకింగ్ ను అభ్యాసం చేస్తున్నట్లు అర్థం.

ఈ జన్మంతా వ్యతిరేక ఆలోచనలతో గడిపి మరణిస్తే వచ్చే జన్మ జాతకంలో చంద్రుడు పూర్తి వ్యతిరేక స్థానంలో ఉంటాడు.

ఒక వ్యక్తి చేసిన మంచి - చెడు అభ్యాసాలు సంస్కార రూపంలో జీవుని వెన్నంటి ఉంటాయి. ఆ సంస్కారాలనూ, ఆ సంస్కారాల వల్ల ఆతడు పొందబోయే ఫలితాలను జాతకం విశ్లేషిస్తుంది.

కాబట్టి ప్రస్తుత స్థితి అనేది గత కర్మల ఫలితం.భవిష్యత్తు మరింత బాగుండాలంటే అది మనం చేసే వర్తమాన కర్మలను బట్టి ఉంటుంది.

మనం చేసే కర్మలన్నింటిని ప్రధానంగా మనస్సే ప్రేరేపిస్తూ ఉంటుంది.

... అలా సరియైన విధంగా ప్రేరేపించే మానసిక శక్తిని - పాజిటివ్ థింకింగ్ ను - మంచి భావాలు వ్యాప్తి చేయడం - ప్రేమపంచడం - భోజనం, నిద్ర విషయంలో క్రమశిక్షణ - బావులూ చెరువులు త్రవ్వించడం - జల సంరక్షణ -  ఉత్సహంగా సంతోషంగా ఉండడం - వినయం - ప్రసన్నత- మాతృభక్తి - మంచి కీర్తి - మాతృభాషలో ప్రావీణ్యం - హాస్యాన్ని ఆస్వాదించడం ..... మొ॥ మంచి లక్షణాలు చంద్రుని అనుగ్రహం వల్ల లభిస్తాయి.

ఈ క్రింద "చంద్రకవచం" ఫైల్ ఇస్తున్నాను .దీని పారాయణం వల్ల చంద్ర సంబంధ దోషాలు తొలగడమే కాక చంద్ర సంబంధ ఆయా మంచి లక్షణాలు మనలో వృద్ధి పొందుతాయి.

(ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటుంది. ఉపయోగపడే ఏ పనులు మనకు చేయాలని అనిపించదో అందులోనే అదృష్టం దాగి ఉంటుంది.

సాధారణంగా మనస్సు ఎప్పుడూ ప్రయోజనం లేని పనుల వైపే లాగుతుంది.

ఈ క్రింద ఇచ్చే చంద్రకవచాన్ని డౌన్లోడ్ చేసుకోరు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా  తన కోసం కాదన్నట్లు అలా జరుపుతూ వెళతారే కాని, చదవాలని అనిపించదు.
కాని ప్రతి సోమవారం చదివితే ఒక సంవత్సరం వరకు దీని ఫలితం ఏమిటో అర్థమౌతుంది.అదే సంస్కృత శబ్దాలకు ఉన్న మహాత్మ్యం.)


1. చంద్ర కవచం. ఇక్కడ నొక్కి డౌన్లోడ్ చేసుకోండి


2.లేదా ఇక్కడ నొక్కి చంద్రకవచం డౌన్లోడ్ చేసుకోండి



           ( ఓపికగా చదివినవారికి)
                ధన్యవాదములతో

           గురుమంచి రాజేంద్రశర్మ

         శ్రీ రవీంద్ర జ్యోతిషాలయం


Wednesday, 24 August 2016

అన్యోన్య దాంపత్యం కోసం జపాలు


కొంతమంది భార్యాభర్తల మధ్య చీటికిమాటికి తగాదాలు , గొడవలు , అభిప్రాయభేదాలు ఏర్పడుతుంటాయి.

అటువంటి వారు వారిమధ్యగల అభిప్రాయభేదాలు తొలిగి , అన్యోన్య దాంపత్యసౌఖ్యం ఏర్పడడం కోసం ఈ క్రింది సూచనలను పాటించండి.

1. ప్రతిరోజు సూర్యోదయం లోపు స్నానం చేయాలి.

2 . సాయంకాలం కూడా స్నానం చేయాలి.

3. అలాగే రెండు పూటల బ్రష్ చేసుకోవాలి.

4. టీవీ సీరియల్లు , టీవీ ఎక్కువగా చూడడం మానివేయాలి.

5. బెడ్ రూమ్ పరిశుభ్రంగా , నీట్ గా ఉంచుకోవాలి. 
( దాంపత్య సౌఖ్యాన్ని ప్రసాదించే గ్రహం " శుక్రుడు". జాతకంలో శుక్రుడు అనుకూలంగా లేని వారు బెడ్ రూం ను చిందరవందరగా ఉంచుకుంటారు.)

6. ఇంటిలో వెంట్రుకల చిక్కులు కనిపించకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. (ఇది పితృదోషాన్ని సూచిస్తుంది.)

7. ఉదయం 8 am లోపు టిఫిన్
మధ్యాహ్నం 1-2 pm మధ్య లంచ్
రాత్రి 8.30 pm లోపే డిన్నర్ పూర్తి చేసుకోవాలి.
(అకాల భోజనం జాతకంలోని చంద్ర దోషాన్ని సూచిస్తుంది.)

8. ఇంటి టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
(టాయిలెట్స్ పరిశుభ్రంగా లేకపోవడం రాహు- శని - చంద్ర సంబంధ దోషాలను సూచిస్తుంది.)

9. ఈ క్రింది లింక్ నుండి దాంపత్య సౌఖ్య జపాలు ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి రోజు అందులో సూచించిన విధంగా జపం చేయండి.




                                స్వస్తి

అన్యోన్య అనుకూల దాంపత్యసౌఖ్యాభివృద్ధిరస్తు
                        ధన్యవాదములతో
                   గురుమంచి రాజేంద్రశర్మ



Tuesday, 23 August 2016

రవిగ్రహ ఫలితాలు - అనుగ్రహం పొందడానికి స్తోత్రాలు

రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


సూర్యడు
---------------------------------------
జ్యోతిషశాస్త్ర దృష్ట్యా ఆత్మ శక్తికి సూర్యుడు కారకత్వాన్ని వహిస్తాడు.

ఆత్మశక్తి ఉద్దీపనం చెందిన వ్యక్తి మిగతా శక్తులను సులభంగా పొందుతాడు.

తండ్రిని గౌరవించని వ్యక్తి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండని వ్యక్తి, సమయ పాలన విషయంలో నిర్లక్ష్యం గల వ్యక్తుల జాతకాలను పరిశీలించినపుడు వారికి సూర్యుడు వ్యతిరేక స్థానాలలో ఉండడాన్ని మనం గమనిస్తాము.

సూర్యుని అనుగ్రహాన్ని పొందిన వ్యక్తులకు ఈ లోకంలో సాధించలేనిది అంటూ ఉండదు.
ఎందుకంటే సూర్యుని అనుగ్రహం వల్ల ఆత్మ ప్రకాశవంతమౌతూ ఎప్పుడూ కాన్సియస్ తో ఉంటాడు. అటువంటి వ్యక్తి అన్ని దోషాలనుండి విముక్తమౌతూ అన్ని విషయాల్లోనూ సరియైన ప్రవర్తనను కలిగి ఉంటాడు.

అలాగే ఒక వ్యక్తికి నాయకత్వ లక్షణాలు సూర్యుని అనుగ్రహం ఉంటేనే లభిస్తాయి.
ఒక నాయకుడు ఎప్పుడూ సూర్యుడిలా నియమబద్ధంగా - ధర్మబద్ధంగా నడుచుకుంటాడు. అప్పుడు మిగతావారు అతనికి అడ్జెస్ట్ అవుతూ అనుసరిస్తూ ఉంటారు.
సూర్యుని అనుగ్రహం లేని వ్యక్తి తాను అసంతృప్తిని అనుభవిస్తూ ఇతరులను తృప్తి పరిచే ప్రయత్నం చేస్తుంటాడు. దానివల్ల చివరకు తాను తృప్తిగా ఉండలేడు - అలాగే ఇతరులనూ సంతృప్తి పరచని స్థితి ఏర్పడుతుంది.

ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలి అనే విషయం సూర్యున్ని చూసి నేర్చుకోవచ్చు!
సూర్యుడు ఇతరుల కోసం ప్రాత:కాలంలో ఉదయించడం లేదు. ఇతరుల కోసం అస్తమించడం లేదు. అది తన ధర్మం కాబట్టి ఈ పనులన్ని చేస్తున్నాడు. అప్పుడు లోకమంతా అతని ప్రవర్తనను అర్థం చేసుకుని తమ జీవితాలను అందుకు అనుగుణంగా మార్చుకుని సూర్యున్ని అనుసరిస్తుంది.
ఒక నాయకుడు కూడా సూర్యుని లాగే వ్యవహరించాలి.
తాను హృదయపూర్వకంగా నమ్మిన సిద్ధాంతాన్ని నియమబద్ధంగా ధృడమైనదీక్షతో ఆచరిస్తూ వెళుతున్నా కొద్దీ లోకం కూడా క్రమంగా అతన్ని అర్థం చేసుకుని అనుసరిస్తుంది.
విజయం పొందిన ఏ నాయకుల చరిత్రను చూసినా ఈ విషయం సత్యమైనదని అర్థమౌతుంది.

సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది.

రథస్యైకచక్రం భుజగనమితా సప్తతురగాః
నిరాలంబో మార్గశ్చరణవికలసారథిరపి
రవిర్యాతే వాన్తంప్రతిదినమపారస్యనభసః
క్రియా సిధ్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణె
అంటే ....
(పురాణాలు వర్ణించిన ప్రకారం )సూర్య భగవానుడు ప్రయాణించే రథానికి ఒకే చక్రం ఉంటుదట. ఆ రథాన్ని ఏడు గుర్రాలు లాగుతుంటాయి.ఇక ఆ గుర్రాలను పట్టి ఉంచే పగ్గాలేమో పాములు. ప్రయాణించే మార్గం...ఆధారం లేని ఆకాశ మార్గం. ఆ రథాన్ని నడిపే   రథ సారథి తొడల నుండి క్రింది భాగం లేని అంగ వైకల్యం కల అనూరుడు.
ఇన్ని కష్టాలతో కూడిన ప్రయాణం చేస్తుా  కూడా ఆకాశంలో సూర్యుడు  గతి - నియమం - ధర్మం తప్పడం లేదు. మహాత్ములకు ఏ ఉపకరణాలు లేకున్నా సమస్త కార్యాలు సిద్ధిస్తాయని పై శ్లోకం యొక్క అర్థం.

ఇలాంటిదే సూర్యవంశ సంజాతుడైన రాముని గూర్చిన మరో శ్లోకం ఉంది.

విజేతవ్యా లంకా, చరణ తరణీయో జలనిధిః
విపక్షః పౌలస్త్యః, రణభువి సహాయాశ్చ కపయహః | 
పదాతిర్మర్త్యోZసౌ,సకలమవధీద్రాక్షసకులమ్
క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణైః||

భావము :- తాను జయించవలసినది ఏదో సామాన్యమైన పట్టణాన్ని కాదు. లంకానగరాన్ని.
అది నూరుయోజనాల సముద్రానికి అవతల ఉంది. శత్రుదుర్భేద్యమైనది.
గెలవడంమాటఅటుంచి అసలు అక్కడకు చేరుకోవడమే అసాధ్యమైనపని.
సముద్రాన్ని దాటడానికి తనవద్ద ఎటువంటి ఉపకరణాలు , అంటే
విమానాలు , నౌకలు వంటివి లేవు.పాదాలే శరణ్యం. ఒకవేళ చేరుకున్నా , శత్రువు సామాన్యుడు కాడు. రావణబ్రహ్మ. అత్యంత బలవంతుడు.ప్రకృతినే శాసించినవాడు, తపోసంపన్నుడు,వరసంపన్నుడు,
అష్టదిక్పాలకులను అదుపులో పెట్టుకున్నవాడు. త్రిమూర్తులలో
ఇద్దరికి అత్యంత ప్రియమైనవాడు. బ్రహ్మగారికి స్వయానా మనుమడు.
శివుడికి అత్యంత ప్రియభక్తుడు, బ్రాహ్మణుడు, ప్రతిరోజూ 9 కోట్ల శివలింగాలకు
స్వయంగా అభిషేకంచేసేవాడు, వేదపండితుడు,  ఇతన్ని
యుద్ధరంగంలో జయించాలి. మామూలువాణ్ణికాదు. పోనీ తనకేమైనా యుద్ధరంగంలో
సహాయం చేసేవాళ్ళు గొప్పవాళ్ళాఅంటే, చంచలస్వభావంకల కోతులు.
పోనీ తనపరిస్థితి చూస్తే, 14 సం. నుండి సరైన నిద్రాహారములు సరిగ్గా లేనివాడు.
మామూలు రాజకుమారులకుండే అన్ని సౌకర్యములకు దూరమైనవాడు.
పినతల్లి వల్ల కలిగిన అవమానభారంతో, భార్యావియోగంతో మానసికంగా
గడ్డుస్థితిని ఎదుర్కొంటున్నవాడు. ఇక తనలాంటివాడే తమ్ముడు.
అయోధ్యనుండి ఎలాంటి సైనికసహకారం లేదు.
ఇటువంటిస్థితిలో ఉన్న శ్రీరామచంద్రుడు,విజయం సాధించి
ఈభూమిమీద దుష్ట రాక్షసుడనేవాడిని మిగల్చకుండా చంపేసాడు.
కాబట్టి మహాత్ములు  లభించిన ఉపకరణాలనూ - అనుచరులనూ - పరిస్థితులనే తమకు అనుకూలంగా మార్చుకుని లక్ష్యాన్ని - విజయాన్ని సాధించగలరు.
ఆదే విధంగా నిజమైన నాయకులు ఎలాంటి అనుచరులూ - ఉపకరణాలు ఉన్నా , ఎన్ని కష్టాలు ఎదురైనా వాటినే తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధిస్తారు.
ఇదిగో ఇలాంటి ధృతిని - నాయకత్వ లక్షణాలను ప్రసాదించేది సూర్యుడు.

ఇంకా
సమయ పాలన - ఇతరులను గౌరవించడం - దానగుణం - మాటకు కట్టుబడి ఉండడం -పితృభక్తి - ఆరోగ్యం పట్ల శ్రద్ధ - నాయకత్వ లక్షణాలు - అంత:శుద్ధి - హుందా స్వభావం - ఆత్మ విశ్వాసం - నిజాయితీ - రాముని లా ధర్మం,సత్యం విషయంలో కఠిన ప్రవర్తన... మిగతా విషయాలలో సున్ని తత్వం  - ఆర్థిక పరమైన స్పృహ లేదా అభిమానం - ఇతరుల వద్ద చెయ్యి చాపక పోవడం ..... మొ|| మంచి లక్షణాలు సూర్యుని అనుగ్రహం ఉంటే లభిస్తాయి.

ఈ క్రింది ఆదిత్య హృదయం ఫైల్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోండి. దీనిని పారాయణం చేయడం వల్ల ఆయా మంచి లక్షణాలు మనలో వృద్ధి పొందుతాయి.ఈ ఆదిత్య హృదయం రావణునిపై విజయం సాధించడం కోసం అగస్త్య మహర్షి స్వయంగా రామునికి ఉపదేశించాడు. ఇది చాలా మహత్యం కలిగింది.దీనిని ప్రతిరోజూ చదివితే మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


ఈ క్రింది  "సూర్య కవచం " ఫైల్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా మహిమాన్వితమైన కవచం. దీనిని శ్రద్ధగా పారాయణం చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం లభించడమే కాక, పితృ దోషాలు జాతకంలో ఉన్న వారికి ఆ దోష ప్రభావం తగ్గి అన్ని విషయాలలో చక్కని అభివృద్ధి ఏర్పడగలదు.


ఇంకా ఇతర స్తోత్రాలు ఆదివారం చదవ వలసినవి.ఈ క్రింది ఫైల్స్ పై నొక్కండి.



                           స్వస్తి
                                 ధన్యవాదములతో
                         గురుమంచి రాజేంద్రశర్మ


Sunday, 21 August 2016

డబ్బు నిలకడ ఉండాలంటే.....


డబ్బు నిలకడ ఉండాలంటే పాటించవలసిన రెమిడి.
-----------------------------------------------------------


చాలా మందికి డబ్బు నిలకడ ఉండడం లేదు అనేది సమస్య.

"ఎంతో కష్టపడుతున్నాను. ఆదాయం కూడా పర్వాలేదు.కాని ఇన్ని సంవత్సరాలు ఫలితం చూస్తే మిగిలింది కూడా పెద్దగా లేదు." అనే బాధ ఉంటుంది.

సంపాధించిన డబ్బు అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్స్ లో ఖర్చు చేయడం వల్లనో,  ఇతర కుటుంబ సభ్యుల అభివృద్ధికి ఖర్చు కావడం వల్లనో,  ఇతరులకు అప్పులు -జామీనులు ఇచ్చి మునగడం వల్లనో, లేదా ఉన్న ఆదాయాన్ని మరింత ఆశతో అనవసర వ్యాపారాల వైపు మళ్లించి నష్టపోవడం వల్లనో ... ఇలా ఏదో ఒక కారణం వల్ల డబ్బు నిలకడ తగ్గుతుంది.

పోని,తెలివి లేక నష్టపోయారా? అంటే అదీ కాదు. వీరే ఎంతో మందికి సలహాలు ఇచ్చి - సహాయాలు చేసి ఇతరుల అభివృద్ధికి కారణమౌతారు.ఆ లాభపడ్డ వ్యక్తులెవరూ వీరి సహాయాన్ని గుర్తించే స్థితిలో ఉండరు. పైగా ఒకింత వ్యతిరేక భావనతోనే ఉంటారు.

జ్యోతిష దృక్కోణంలో విశ్లేషించినపుడు గతజన్మ సంబంధించిన జాతక దోషాలు ఉండవల్లగానీ, లేదా వంశపారంపర్య పితృ దోషాలు ఉండడం వల్లనో ఇలాంటి పరిస్థితి ఉంటుంది.

అంటే ... (గత జన్మలలో)వీరు కానీ లేదా వీరి పూర్వీకులు గాని ..."ఉన్న పుణ్యఫలం కన్న లేదా చేసిన శ్రమ కన్నా అధికంగా సుఖాలు అనుభవించడం వల్ల ఇలాంటి దోషాలు వస్తూ ఉంటాయి."

" అంటే కాలానికి శ్రమను లేదా పుణ్యఫలాన్ని బాకిపడి (అప్పు పడి)ఉంటారన్న మాట!

ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు ఈ క్రింది లింక్ ను నొక్కి "సిద్ధలక్ష్మీ స్తోత్రం"ను డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు ఉదయం స్నానం తరువాత చదువుకోవాలి. ఇది మనను పూర్తిగా పాజిటివ్ గా ఉంచే బీజాక్షరాలతో కూడిన స్తోత్రం. ఎలాంటి అనుమానాలు లేకుండా స్నానం తరువాత వెంటనే ఈ స్తోత్రం చదువవచ్చు. ఈ స్తోత్రం చదివిన తరువాత ఎలాంటి కోరిక లేకుండా నిష్కామంగా ఒక 4 నుండి 6 కిలోమీటర్లు నడిచి రావాలి (వాకింగ్ చేయాలి).
ఇది ఇంతకు ముందు ఎంతో మంది పరీక్షించి అనుకూల ఫలితాలు పొందిన రెమిడి.

1) స్తోత్ర పారాయణం వల్ల క్రమంగా పాజిటివ్ మార్గంలో ప్రయాణించి వేగంగా పుణ్యఫలం వృద్ధి పొందుతుంది.

2) తరువాత చేసే వాకింగ్ వల్ల శ్రమశక్తి వృద్ధి చెంది విధికి (లేదా కాలానికి) ఉన్న బుణం చెల్లింపు జరిగి వేగంగా అభివృద్ధి జరుగుతుంది.

ఇది అనుభవ పూర్వకంగా కేవలం ఒక మూడు నెలల లోనే బుుజువయ్యే రెమిడి.

రెమిడిలోని రెండు విషయాలను (స్తోత్ర పఠనం - వాకింగ్) ఆచరించినప్పుడే పూర్తి ఫలితం ఉంటుంది. వాకింగ్ కు అవకాశం లేని వారు కోరిక లేకుండా ఏదైనా గుడికి వెళ్లి 108 లేదా 41 ప్రదక్షణాలు చేయవచ్చు.

ఈ రెమిడి పాటించడం మొదలు పెట్టిన తరువాత మన హృదయంలో పెరుగుతున్న శాంతి మనం సరియైన మార్గంలోనే వెళుతున్నట్లు సూచిస్తుంది.

                         స్వస్తి
           ధన్యవాదములతో
       గురుమంచి రాజేంద్ర శర్మ.
ఈ క్రింది లింక్ నొక్కి "సిద్ధలక్ష్మీ స్తోత్రం" ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి.




Tuesday, 16 August 2016

ప్రేమా, ఓదార్పు - చంద్రుని ప్రభావం

మానసికంగా ప్రేమనూ, ఓదార్పునూ, ధైర్యాన్ని అందించే గుణం - చంద్రుని ప్రభావం
------------------------------------------------

మానసికంగా ప్రేమనూ, ఓదార్పునూ, ధైర్యాన్ని అందించే గుణం జాతకం లో చంద్రుడు అనుకూలంగా ఉన్నవారికి సహజంగానే ఉంటుంది.

జాతకంలో చంద్రుడు పూర్తి వ్యతిరేకంగా ఉన్నవారు సాధారణంగా ఇతరుల మనసును నొప్పిస్తుంటారు. వారు ప్రేమనూ, ఓదార్పును ఇవ్వలేరు.స్వీకరించలేరు కూడా!

ఎందుకంటే వారు గత జన్మల నుండే ద్వేషాన్ని - ద్వేషభావనలను ... దు:ఖాన్ని - దు:ఖ భావనలను అభ్యాసం చేస్తున్నారన్నమాట.
ఇప్పుడు అకస్మత్తుగా ప్రేమనూ - ధైర్యాన్ని అందించుమంటే అది వారికి కష్టమైన పని.

"ఎవరైన తమ దగ్గర ఏది ఉందో దాన్ని మాత్రమే ఇవ్వగలరు ".

అందువల్ల జాతకంలో ఈ చంద్రుడు వ్యతిరేకంగా ఉన్నవారు ఇతరులకు దు:ఖాన్ని ఇవ్వగలరు. లేదా భయాన్ని అందించగలరు. లేదా వారి మనుసులో అశాంతినీ - ద్వేషాన్ని సృష్టించగలరు. ఇంకా ప్రయత్నిస్తే రాగాన్ని (ద్వేషానికి వ్యతిరేక పదం . ఈ రాగం అశాశ్వతం. ఇది ఏ క్షణమైనా ద్వేషంగా మారిపోవచ్చు!) కలిగించగలరు.కాని ప్రేమనూ - ఓదార్పును అందించడం వారికి కష్టమైన విషయం. ఎందుకంటే ఏదైనా మనకు అభ్యాసం వల్లనే సాధ్యమౌతుంది.

"అభిత : అస్యతే పరిచీయత ఇత్యభ్యాస : "

(అంటే అంతట పరిచయం చేయబడి ఉన్నది.)

"అభిత : అశ్యతే వ్యాప్యత ఇత్యభ్యాశ:"

(అంటే అంతట వ్యాపించి ఉన్నది.)

అనే రెండు వ్యుత్పత్తి అర్థాలు అభ్యాస శబ్దానికి ఉన్నాయి.

మొదటి అర్థం ప్రకారం అది మంచిదైనా చెడ్డదైనా అభ్యాసం చేసిన విషయం శరీరానికీ - మనసుకూ - బుద్ధికీ - చివరకు ఆ జీవాత్మకు బాగా పరిచయం చేయబడి సహజ గుణంగా మారుతుంది.

రెండవ అర్థం ప్రకారం అభ్యసించిన విషయం స్థూల శరీరంలోనూ - సూక్ష్మ శరీరంలోనూ - చివరకు కారణ శరీరంలోను పూర్తిగా వ్యాపించి సహజ గుణంగా మారుతుంది.

జాతకం అనేది ఒక వ్యక్తి గత జన్మలలో చేసిన మంచి - చెడు అభ్యాసాలను విశ్లేషించి దాని వల్ల ఆ వ్యక్తి పొందబోయే ఫలితాలను తెలుపుతుంది.

ఇక్కడ ఒక వ్యక్తికి  జాతకంలో చంద్రుడు వ్యతిరేక స్థానంలో ఉన్నాడంటే అతనికి దు:ఖం లేదా ద్వేషం సహజగుణంగా మారిందన్న మాట! ఈ కర్మ ఫలితాన్నంతా చంద్ర దశా అంతర్దశలలో అనుభవిస్తాడు.

ఉదాహరణకు

తండ్రి పట్ల ద్వేషంతో ఉన్నవాడైతే రవిదశ - చంద్ర అంతర్దశలో , భాగ్యాధిపతి మొక్క చంద్ర అంతర్దశలో , చంద్రదశ - రవి అంతర్దశలో ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు.

తల్లితో ద్వేష ప్రవర్తన ఉంటే - చంద్ర (చతుర్ధిపతి) సంబంధ దశా అంతర్దశలలో ...

మేనమామ తో ద్వేష ప్రవర్తన ఉంటే - బుధ సంబంధ దశా అంతర్దశలలో ...

సోదరులతో ద్వేష ప్రవర్తన ఉంటే - కుజ సంబంధ దశా అంతర్దశలలో ...

....ఇలా కారకత్వాలను బట్టి దశా అంతర్దశలలో కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది.

కాబట్టి ఇతరులకు మానసికంగా ప్రేమనూ, ఓదార్పునూ, ధైర్యాన్ని అందించడం వల్ల చంద్రుని అనుగ్రహాన్ని పొందుతాము .దీని వల్ల అవతలి వ్యక్తుల కన్న ఎక్కువ ప్రయోజనం మనకే సిద్ధిస్తుంది అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి.

కేవలం డబ్బు మాత్రమే కాదు సుగుణాలు కూడా సంపదనే!

ఇంతకు ముందు చెప్పనట్లు  "ఎవరైన తమ దగ్గర ఏది ఉందో దాన్ని మాత్రమే ఇవ్వగలరు ".

మనం ఇతరులకు దు:ఖాన్ని కలిగిస్తున్నామంటే మన దగ్గర సమృద్ధిగా దు:ఖం ఉందన్న మాట!

మనం ఇతరులకు ద్వేషాన్ని కలిగిస్తున్నామంటే మన దగ్గర సమృద్ధిగా ద్వేషం ఉందన్న మాట!

మనం ఇతరులకు ప్రేమనూ - ధైర్యాన్ని అందిస్తున్నామంటే మన దగ్గర సమృద్ధిగా ఆ గుణాలు ఉన్నాయన్న మాట!

ఆలోచించేవారికి మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి మనలో ఉన్న గుణ సంపదలు - గత జన్మల నుండి అభ్యాసం చేస్తున్న మన సంస్కారాలు అర్థమౌతుంటాయి.

ఇతరులకు ప్రేమనూ - ధైర్యాన్ని అందించినపుడు ఒక్కొక్కసారి అది ఎంతటి ప్రభావం చూపిస్తుందో ఉదాహరణగా ఈ క్రింది కథను చదవండి.

ఇది పూర్తిగా చదివితే మీ గుండె లోతులలో ఉన్న తడి బయటకు వస్తుంది .
.
.
జీన్ థామ్సన్  ఒక ఉపాధ్యాయురాలు. ఆమె ఆ రోజు ఐదవ తరగతి క్లాసులోకి వెళ్ళింది .

పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది . " నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని .

అబద్ధం ఎందుకు అంటే ఎప్పుడూ మూడో వరసలో కూర్చునే  "టెడ్డీ స్టాండర్డ్ " ఆమెకు నచ్చలేదు . క్రిందటి సంవత్సరం అతడిని చూసింది . అతడు మిగిలిన పిల్లల్లా ఆటల్లో ఉండకపోవడం , సరిగా డ్రెస్ చేసుకుని రాకపోవడం గమనించింది . అయితే అప్పుడు అతడు తన క్లాస్ కాదు . అయినా ఆమెకు అతడంటే సదభిప్రాయం లేదు . 
.
నెలలు గడుస్తున్నాయి . అతడి పేపర్స్ లో ఆమె రెడ్ మార్కులూ , తక్కువ మార్కులూ వేస్తోంది . అతడు మిగిలిన పిల్లలతో కలవలేక పోవడమూ గమనించింది . 
.
ఆమె పని చేసే స్కూల్ లో పిల్లలను గురించి టీచర్ రికార్డు రాయాలి . అందరి రికార్డులు రాసేసినా ఎందుకో ఆమెకు టెడ్డీ రికార్డు రాయాలనిపించక ఆలస్యం చేసింది . క్రిస్మస్ వచ్చేస్తోంది . రికార్డు రాసి అప్పగించాలి . 
.
ఒక రోజు అతడి పాత రికార్డు తిరగేసింది . 
.
అతడు ఒకటవ తరగతిలో టీచర్ ఇలా రాసింది .

" టెడ్డీ చాలా సరదా కుర్రాడు . అతడితో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు . హోం వర్క్ నీట్ గా చేస్తాడు . బ్రిలియంట్ బాయ్ " 
.
రెండో తరగతి టీచర్ రిపోర్ట్

" టెడ్డీ ఎక్సలెంట్ కుర్రాడు . కానీ అతడి తల్లికి వచ్చిన జబ్బు వలన అతడు కొంత కుటుంబం లో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు " 
.
మూడో తరగతి టీచర్ రిపోర్ట్

" టెడ్డీ చాలా కష్ట పడుతున్నాడు .. చదువులో బాగానే ఉన్నాడు కానీ అతడి తల్లి మరణం అతడిని కుంగ తీసింది . అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు . అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు " 
.
నాల్గో తరగతి టీచర్ రిపోర్ట్

" టెడ్డీ చదువులో వెనుకబడి పోయాడు . అతడు ఫ్రెండ్స్ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటున్నాడు . క్లాస్ లో నిద్ర పోతున్నాడు . అతడు ఒక ప్రోబ్లం చైల్డ్ కాబోతున్నాడు " 
.
.
థామ్సన్ కి ప్రాబ్లం అర్ధం అయ్యింది .

ఇన్నాళ్ళూ తను టెడ్డి గురించి తెలుసుకోనందుకు బాధ పడింది ఆమె .
అయితే ఆమె క్రిస్మస్ వేడుకలకు పిల్లలను తయారు చెయ్యడం లో తలమునకలు ఐపోయింది . టెడ్డీ ని సానుభూతితో చూడడం తప్ప ఏమి చెయ్యాలో ఆమెకు తోచలేదు . 
.
.
క్రిస్మస్ కు అందరు పిల్లలూ టీచర్ కి కానుకలు ఇవ్వడం ఆచారం 
.
పిల్లలు ఆమెకు విలువైన కానుకలు ఇస్తున్నారు అందమైన రేపర్లు చుట్టిన కాగితాలలో విలువైన గిఫ్ట్స్ . 
.
ఇంటికి సరుకులు తెచ్చిన పేపర్ బాగ్ లో ఏదో పెట్టి తెచ్చి ఇచ్చాడు టెడ్డీ . ఆ బేగ్ సగం చిరిగి ఉంది . అందులో ఒక ఇమిటేషన్ రాళ్ళ నెక్లెస్ ఉంది అందులో సగం ఊడిపోయాయి . ఒక సెంటు బాటిల్ ఉంది .అందులో సగం సెంటు ఉంది . 
.
అందరు పిల్లలూ అది చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు . థామ్సన్ వారిని గట్టిగా కసిరి ఆ నెక్లెస్ మెడలో వేసుకుంది . ఆ సెంటు రాసుకుంది .
.
" చాలా బావుంది " అని అంది .
.
ఆమె వెనుకగా నించున్న టెడ్డీ "నిజంగా ఈ రోజు మీరు  మా అమ్మలా వాసన వేస్తున్నారు " అన్నాడు .
.
.
అందరు పిల్లలూ వెళ్లి పోయారు . అయినా క్లాసును వదల లేకపోయింది థామ్సన్ . క్లాసులో కూర్చుని గంట సేపు ఏడ్చింది . 

ఆ రోజు నుండి ఆమె వాడి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టింది . టెడ్డీ లో మార్పు చాలా త్వరగా వచ్చింది . ఆమె ప్రోత్సహిస్తున్నకొద్దీ చురుకుగా తయారయ్యాడు . వాడు ఆ సంవత్సరం తరగతి ఫస్ట్ గా వచ్చాడు . 
.
.
ఇక్కడితో అయిపోలేదు . 
.
.
నెక్స్ట్ సంవత్సరం ఆమెకు టెడ్డి నుండి వచ్చిన ఉత్తరం లో " ప్రాధమిక విద్యాభ్యాసం లో నాకు నచ్చిన ఉపాధ్యాయిని మీరు " .అది ఆ ఉత్తరం సారాంశం . 
.
6 సంవత్సరాల తర్వాత వచ్చిన ఇంకో ఉత్తరం " నేను సెకండరీ విద్య క్లాస్ లో థర్డ్ గా కంప్లీట్ చేశాను . అయినా మీరే నా ఫేవరెట్ టీచర్ " 
.
నాలుగు సంవత్సరాల తర్వాత ఇంకో ఉత్తరం " నేను ఇపుడు చదువు విషయం లో కష్టపడుతున్నాను . ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను . ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ "
.
ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచాయి . ఇంకో ఉత్తరం " డిగ్రీ తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు చదవాలి అనుకున్నాను . చదివాను . సాధించాను . ఇదంతా మీ చలవే . మీరే నాకు ఫేవరెట్ టీచర్ " ఈసారి అతడి సంతకం లో Theodore F. Stoddard, M.D. అని సంతకం చేశాడు . 
.
.
ఇంతటితో ఈ కధ అయిపోలేదు . 
.
ఇంకో ఉత్తరం వచ్చింది .
" నేను ఒక అమ్మాయిని చూశాను చర్చిలో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను . మా నాన్న రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు . చర్చిలో పెళ్ళికొడుకు తల్లి కూర్చునే బెంచి మీద మీరు కూర్చోవాలని నా కోరిక " 
.
.
.
.
థామ్సన్ పెళ్ళికి వెళ్ళేటపుడు టెడ్డీ ఇచ్చిన నెక్లెస్ పెట్టుకుంది . అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి . సెంట్ రాసుకుంది . 
.
.
.
.
ఆ రోజు కూడా టెడ్డీ కి వాళ్ళ అమ్మ కనిపించి ఉంటుంది . 
.
.
.
.
.
( మనం మన ప్రభావం ఎవరి మీద అయినా ఎలా పడుతుందో ఊహించలేము . అందుకని మిత్రులారా! ఎదుటి వ్యక్తి తో ప్రేమగా ఉందాము . ప్రేమను పంచే ప్రయత్నం చేద్దాము !)

             సౌమనస్య మస్తు !
                     స్వస్తి

అసారే సంసారే విషయ విషపూరే పటుతరే
ప్రవాహే ఘోరే మాం మలినతర మోహేన పతితమ్ |
భ్రమన్తం ధావన్తం మనసి విలపన్తం కరుణయా
సముద్ధర్తుం కృష్ణోవసతు మమ హృద్ధామ్ని సతతమ్ ॥

       (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

        గురుమంచి రాజేంద్రశర్మ

డబ్బు చలామణి - చాణుక్యుని ఆర్థికసూత్రాలు

డబ్బు చలామణి - చాణుక్యుని ఆర్థికసూత్రాలు
---------------------------------------------------

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా డబ్బుకూ, సంపదకు గురు కారకత్వం వహిస్తాడు.

ద్రవ్య సరపరా (డబ్బు చలామణి )కి గురు బుధులు కలిసి కారకత్వం వహిస్తారు.

అర్థ శాస్త్రం ప్రకారం ఒక దేశంలో సంపద సృష్టి పెరిగిన కొద్ది అది సంపన్న దేశమౌతుంది.
ఇక
ద్రవ్య సరఫరా (డబ్బు చలామణి) పెరిగిన కొద్ది ఆ దేశ ప్రజల అవసరాలు తీరుతూ ప్రజలలో తృప్తి శాతం పెరుగుతుంది.

చాణుక్యుని అర్థ శాస్త్ర సూత్రాల ప్రకారం సంపద సృష్టి ఎంత ముఖ్యమో డబ్బు చలామణి కావడం కూడా అంతే ముఖ్యం.

ప్రజల వద్ద పోగుపడిన డబ్బు తిరిగి సంపద సృష్టికి (పునరుత్పాదనకు) అయినా ఉపయోగపడాలి.లేదా చలామణిలోనైనా ఉండాలి.అప్పుడే ఆ
డబ్బు వల్ల దేశానికి ప్రయోజనం.

ఈ రెండూ లేకుండా డబ్బుకు మరింత డబ్బును చేర్చుతూ గుట్టలు గుట్టలుగా పోగు చేయడం వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదు.

ఈ విధంగా విరివిగా ద్రవ్య సరపరా (డబ్బు చలామణి) అయ్యేలా  తీర్థ యాత్రలు - వివాహాది ఉత్సవాలు - పండుగలు - దాన ధర్మాలు - పుష్కరాలు - జాతరలు.... వంటి వ్యవస్థలు భారతదేశంలో పూర్వం నుండే ఉన్నాయి.
సనాతన భారత దేశంలో ప్రజలందరు తమకున్న శక్తి సామర్థ్యాలనూ - నెైపుణ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వల్ల దేశంలో సంపద సృష్టి కూడా జరిగి కొన్ని వేల సంవత్సరాల పాటు సంపన్నదేశంగా నిలిచింది.
ప్రజలు తమకు తెలియకుండానే బలమైన అర్థ శాస్త్ర సూత్రాలను పాటించేవారు.

కాని,బౌద్ధ మతానంతరం కొన్ని శతాబ్దాల పాటు భారతదేశం అశాస్త్రీయ వైరాగ్యాన్ని పాటించడం వల్ల ఆర్థిక విషయాలలోనూ, యుద్ధ విద్యలలోను నిర్లక్ష్యం వహించింది. దానివల్ల విదేశి దండయాత్రలు ఎదుర్కునే విషయంలోనూ, పారిశ్రామిక విప్లవం విషయంలోనూ ఇబ్బందులు పడింది.

ఇక పోతే...

చాణుక్యుని అర్థ శాస్త్ర సూత్రాల ప్రకారం  విరివిగా జరిగే ద్రవ్య సరపరా (డబ్బు చలామణి) ప్రజల అవసరాలను తీర్చి ఎలా తృప్తిగా ఉంచుతుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా చూద్దాము !

          🔯🔯 ⭐🔯🔯

ఒక వ్యక్తి తీర్థయాత్రకు వెళ్లాడు.

అక్కడ ఒక లాడ్జికి వెళ్లి అడ్వాన్స్ గా 1000 రూపాయలు ఇచ్చి గదులు చూడడానికి వెళ్లాడు.

లాడ్జి మేనేజర్ ఆ వెయ్యి రూపాయలను తమకు ఆహారాన్ని సరఫరా చేసే వ్యక్తి వసూలుకు వస్తే ఇచ్చాడు.

అతడు ఆ డబ్బు తీసికెళ్లి కిరాణా కొట్టులోని అప్పు చెల్లించాడు.

కిరాణా కొట్టు యజమాని, తమకు దినుసులు సరఫరా చేసే వ్యక్తి వసూలుకు వస్తే ఆ1000 రూ॥లు ఇచ్చాడు.

దినుసులు సరఫరా చేసే వ్యక్తి ఆ డబ్బు తీసికెళ్లి తమకు దినుసులిచ్చిన రైతు అప్పు తీర్చాడు.

ఆ రైతు తన క్రింద పని చేసే కూలీలకు ఇవ్వాల్సిన 1000 రూ॥ఇచ్చి వేశాడు.

ఆ కూలీలు ఒక చిన్న హోటల్ యజమాని వద్ద ఉన్న అప్పును తీర్చేశారు.

హోటల్ యజమాని ఆ డబ్బును తీసికెళ్లి  లాడ్జి మేనేజర్ వద్ద ఉన్న అప్పు తీర్చేశాడు.

లాడ్జి మేనేజర్ ఆశలు వదులుకున్న ఆ  అప్పు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషించాడు.
అంతలోపు ఆ గదులు చూడడానికి వెళ్లిన యాత్రికుడు తిరిగి వచ్చి గదులలో వాసన వేస్తుంది. నాకు నచ్చలేవు అన్నాడు.

లాడ్జి మేనేజర్ అతని 1000 రూ॥అతనికి ఇచ్చాడు.
ఏమీ తగ్గించకుండా పూర్తిగా తన డబ్బులు తనకు వచ్చినందుకు ఆ యాత్రికుడు చాలా సంతోషించాడు.

          🔯🔯 ⭐🔯🔯

ఈ మొత్తం ఉదాహరణలో ఏ వ్యక్తి క్రొత్తగా సంపాదించలేదు. అలాగే ఏ వ్యక్తి నష్టపోలేదు.పైగా అందరూ తృప్తి పడ్డారు.డబ్బు చలామణి వేగంగా జరిగింది. దాదాపు పది కి పైగా చేతులు మారి అందరి అవసరాలు తీర్చింది. అందరిని సంతోషపరిచింది.

అది "ద్రవ్య సరఫరా (డబ్బు చలామణి)" మహాత్మ్యం.

                      స్వస్తి

          (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో
           .
               గురుమంచి రాజేంద్రశర్మ



Monday, 15 August 2016

దుఃఖం ఎందువల్ల కలుగుతుంది ?

దుఃఖం పై ఒక చిన్న వ్యాసం
---------------------------------------

రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


జ్యోతిష శాస్త్ర దృష్ట్యా చంద్రుడు, కుజుడు - రాహువు వ్యతిరేక స్థానంలో ఉంటే అతిగా దుఃఖపడే స్వభావం, నెగిటివ్ థింకింగ్ ఉంటాయి.

ఇక్కడ వ్యతిరేక స్థానంలో ఉన్న చంద్రుడు  ఆ వ్యక్తి గత జన్మల నుండి మనస్సులో చేస్తున్న నెగిటివ్ భావాల అభ్యాసాన్ని   సూచిస్తే..

వ్యతిరేక స్థానాలలో ఉన్న కుజ - రాహువులు ఆ వ్యక్తిలోని ధైర్యం క్షీణించడాన్ని - తరుచుగా భయపడే  అభ్యాసం చేస్తుండడాన్ని సూచిస్తారు.

అసలు ఈ దుఃఖం అనేది ఎందువల్ల కలుగుతుందని ఆలోచిస్తే...

ఎక్కువ సార్లు " దుఃఖం " అనేది ఉండాలనుకున్న స్థితికి - ఉన్న స్థితికి మధ్య ఏర్పడిన సంఘర్షణ తీవ్రమైన మానసిక బాధగా మారి దుఃఖం అనే అనుభూతిగా రూపాంతరం చెందుతుంది.

1)ఆశించినది జరగకపోవడం (పరాజయం) వల్ల....
2) దగ్గరి వ్యక్తులను కోల్పోవడం వల్ల..
3) భయం - అభద్రతా భావనల వల్ల...
4) పశ్చాత్తాపం వల్ల...
5) శారీరక బాధల వల్ల...
6) అవమానం వల్ల...
7) ఆవేదన వల్ల..
8) అపకీర్తి వల్ల...
9) ఉన్నది కోల్పోవడం వల్ల..
10 ) మమకారం వల్ల..
11) ఒంటరితనం వల్ల...
12) అనుబంధం వల్ల...
13) జాలి పడడం వల్ల..
14) ఇతరులు తన గురించి ఏమనుకుంటారో అన్న భావన వల్ల...
15) అసమర్థత వల్ల...
16) అజ్ఞానం వల్ల...
17) ప్రేమ వల్ల...
..... ఇలా అనేక కారణాల వల్ల మనిషికి దుఃఖం కలుగుతూ ఉంటుంది.

ఈ దుఃఖం రెండు రకాలుగా ఉంటుంది.
1) నిస్వార్థమైన దుఃఖం
2) స్వార్థమైన దుఃఖం

నిస్వార్థమైన దుఃఖంలో మనిషి తన గూర్చి తాను దుఃఖించడు.
సకల మానవాళి ( ఇతరుల ) కష్టాలనూ, బాధలను చూసి దుఃఖిస్తాడు.
దేశం కోసం  దుఃఖిస్తాడు.
లక్ష్య సాధన పట్ల తీవ్రమైన ఆరాటం వల్ల దుఃఖిస్తాడు.
లేదా
భగవంతుని కోసం దుఃఖిస్తాడు.
ఒక వివేకానందుడు, ఒక మదర్ థెరిసా దుఃఖం, ఒక రామకృష్ణ పరమహంస దుఃఖం ఈ కోవ లోకి వస్తుంది.

దీనివల్ల అభివృద్ధికి నష్టం లేదు.పైగా ఒక పూజా - తపస్సు - ప్రార్థన కన్న అధిక ఫలం సిద్ధించబడి మనసు తేటపడి పవిత్రమౌతుంది.

ఈ నిస్వార్థమైన దుఃఖం నుండి ఒక గొప్ప చరిత్ర సృష్టించబడవచ్చు కూడా!

స్వార్థమైన దుఃఖంలోనే ఉంది ఉన్న నష్టమంతా -
ఈ దుఃఖం వల్ల వివేకం నశిస్తుండడమే కాక, తేజస్సు కూడా తగ్గుతుంది.

దుఃఖపడడం జీవులకు సహజమే అయినా వీలైనంత తొందరగా ఈ దుఃఖం నుండి బయటపడాలి.
ఆయా వ్యక్తుల స్వభావం పై "ఈ దుఃఖం యొక్క తీవ్రత " ఆధారపడి ఉంటుంది.

కొంతమంది చిన్ననాటి నుండే " దుఃఖభావాన్ని " వృద్ధి పొందించుకుంటారు.

తనపై తనకే సానుభూతి, బాధలు చెప్పుకోవడం, ఇతరుల సానుభూతిని కోరుకోవడం, ఎప్పుడూ అసంతృప్తి ... ఇలా నిరంతరం దుఃఖాన్ని ధ్యానం చేయడం వల్ల అలాంటి వారికి " దుఃఖ పడే సంఘటనలే " ఎదురౌతుంటాయి.

ఇక ఒక్కొక్కసారి ఈ దుఃఖమనే అనుభూతి వెంటనే మరో అనుభూతిగా కూడా మారవచ్చు!

ఉదాహరణకు...

ఒకడికి భార్య చనిపోయిందనుకుందాము ! అప్పుడు అనుబంధం, ప్రేమ (❓) వల్ల విపరీతంగా దుఃఖిస్తుంటాడు.

అతన్ని చూసిన వారు "వీడు కోలుకోవడం చాలా కష్టం " అనుకుంటారు.

తరువాత భార్య తరుపు బంధువులు" భార్యను వీడే చంపాడు" అని కేసు పెట్టారనుకుందాము !

అప్పుడు అతనిలో భార్య తరుపు బంధువుల పైనా, చివరకు చనిపోయిన భార్య పైన కూడా అంతవరకు ఉన్న దుఃఖం ద్వేషంగా మారుతుంది. తరువాత అతడు సులభంగానే మరో పెళ్లి చేసుకోవడానకి సిద్ధంగా ఉంటాడు.

మొత్తం మీద అర్థం చేసుకుంటే...

"ఉన్నది భావావేశం ఒక్కటే... అదే దుఃఖంగా, సుఖంగా, రాగం గా , ద్వేషంగా .. ఇలా రకరకాల అనుభూతులుగా మారుతుందన్న విషయం "జ్ఞానం" వల్ల అర్థమౌతుంది.

ఈ "జ్ఞానం" అనుభవంలో ఉన్నప్పుడు "మనిషి "నిరంతరం "స్పృహ (కాన్సియస్)లో ఉంటాడు.

అంటే దుఃఖం - కోపం వంటి భావాలు ప్రవేశించగానే వెంటనే స్పృహలోకి వస్తాడు. లేదా అలాంటి భావాలు మనస్సులోకి వచ్చిపోతూండడాన్ని జాగరూకతతో గమనిస్తూ ఉంటాడు.

అప్పుడు ఈ భావావేశం బ్రమాత్మకమైనదనీ, ..ఇది మోహాన్ని కలుగజేస్తుందని గ్రహించి భావావేశానికి అతీత స్థితిలో ఉంటూ స్థితప్రజ్ఞుడౌతాడు.

కేవలం ఈ స్థితప్రజ్ఞతను పొందడం ద్వారా మాత్రమే దుఃఖం నుండి విముక్తులం కాగలము .
ఇదొక్కటే దుఃఖానికి శాశ్వత పరిష్కారం.

నిజానికి మనిషి క్రియాశీలుడౌతున్నా కొద్దీ సహజంగానే స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది.

"అతిగా దుఃఖపడే స్వభావం అనేది అభివృద్ధికి అతి పెద్ద అడ్డంకి."

ఒక దుఃఖస్తుడు ఆయా పనులను అసంతృప్తితో, క్రమశిక్షణా రహితంగా,స్పృహ లేకుండా చేస్తుంటాడు.
క్రియాశీలుడు అవే పనులను ఆసక్తీ, సంతృప్తి, శ్రద్ధలతో చేస్తుంటాడు.
ఇద్దరి మధ్య అంతే తేడా !

ఆహారం - నిద్ర - భయం - మైథునం - సుఖం - దుఃఖం అనేవి జీవులన్నింటికి సమాన లక్షణాలు.వీటికే సహజాతాలని(Basic Instincts) పేరు. వీటిపై అదుపు సాధిస్తూ వీటిని ఉత్తమ స్థితికి తెచ్చిన కొలది మనిషి అన్ని రకాల అభివృద్ధిని సాధిస్తూ ఉంటాడు.

ఇందుకోసం మనం నిరంతరం సాధన చేస్తూ ఉండాలి.

                    స్వస్తి

"యాని కానిచిచ్చాన్తాని లోకే సప్త బుుషయో విద: I
సర్వాణి శం భవన్తుమే శం మే అస్త్వభయంమే అస్తు ॥

(తా ॥ శాంతిని పొందడానికి  లోకంలో ఏ ఏ మార్గాలు ఉన్నాయో అవన్ని సప్తబుుషులకు తెలుసు.
ఈ మార్గాలూ - సప్తబుుషులు నాకున్న సమస్త దుఃఖాలను తొలగింపజేసి శాంతిని చేకూర్చి మంగళాన్నీ, అభయాన్నీ ప్రసాదించుగాక!)

       (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

          
             గురుమంచి రాజేంద్రశర్మ