దుఃఖం పై ఒక చిన్న వ్యాసం
---------------------------------------
రచన :- గురుమంచి రాజేంద్రశర్మ
జ్యోతిష శాస్త్ర దృష్ట్యా చంద్రుడు, కుజుడు - రాహువు వ్యతిరేక స్థానంలో ఉంటే అతిగా దుఃఖపడే స్వభావం, నెగిటివ్ థింకింగ్ ఉంటాయి.
ఇక్కడ వ్యతిరేక స్థానంలో ఉన్న చంద్రుడు ఆ వ్యక్తి గత జన్మల నుండి మనస్సులో చేస్తున్న నెగిటివ్ భావాల అభ్యాసాన్ని సూచిస్తే..
వ్యతిరేక స్థానాలలో ఉన్న కుజ - రాహువులు ఆ వ్యక్తిలోని ధైర్యం క్షీణించడాన్ని - తరుచుగా భయపడే అభ్యాసం చేస్తుండడాన్ని సూచిస్తారు.
అసలు ఈ దుఃఖం అనేది ఎందువల్ల కలుగుతుందని ఆలోచిస్తే...
ఎక్కువ సార్లు " దుఃఖం " అనేది ఉండాలనుకున్న స్థితికి - ఉన్న స్థితికి మధ్య ఏర్పడిన సంఘర్షణ తీవ్రమైన మానసిక బాధగా మారి దుఃఖం అనే అనుభూతిగా రూపాంతరం చెందుతుంది.
1)ఆశించినది జరగకపోవడం (పరాజయం) వల్ల....
2) దగ్గరి వ్యక్తులను కోల్పోవడం వల్ల..
3) భయం - అభద్రతా భావనల వల్ల...
4) పశ్చాత్తాపం వల్ల...
5) శారీరక బాధల వల్ల...
6) అవమానం వల్ల...
7) ఆవేదన వల్ల..
8) అపకీర్తి వల్ల...
9) ఉన్నది కోల్పోవడం వల్ల..
10 ) మమకారం వల్ల..
11) ఒంటరితనం వల్ల...
12) అనుబంధం వల్ల...
13) జాలి పడడం వల్ల..
14) ఇతరులు తన గురించి ఏమనుకుంటారో అన్న భావన వల్ల...
15) అసమర్థత వల్ల...
16) అజ్ఞానం వల్ల...
17) ప్రేమ వల్ల...
..... ఇలా అనేక కారణాల వల్ల మనిషికి దుఃఖం కలుగుతూ ఉంటుంది.
ఈ దుఃఖం రెండు రకాలుగా ఉంటుంది.
1) నిస్వార్థమైన దుఃఖం
2) స్వార్థమైన దుఃఖం
నిస్వార్థమైన దుఃఖంలో మనిషి తన గూర్చి తాను దుఃఖించడు.
సకల మానవాళి ( ఇతరుల ) కష్టాలనూ, బాధలను చూసి దుఃఖిస్తాడు.
దేశం కోసం దుఃఖిస్తాడు.
లక్ష్య సాధన పట్ల తీవ్రమైన ఆరాటం వల్ల దుఃఖిస్తాడు.
లేదా
భగవంతుని కోసం దుఃఖిస్తాడు.
ఒక వివేకానందుడు, ఒక మదర్ థెరిసా దుఃఖం, ఒక రామకృష్ణ పరమహంస దుఃఖం ఈ కోవ లోకి వస్తుంది.
దీనివల్ల అభివృద్ధికి నష్టం లేదు.పైగా ఒక పూజా - తపస్సు - ప్రార్థన కన్న అధిక ఫలం సిద్ధించబడి మనసు తేటపడి పవిత్రమౌతుంది.
ఈ నిస్వార్థమైన దుఃఖం నుండి ఒక గొప్ప చరిత్ర సృష్టించబడవచ్చు కూడా!
స్వార్థమైన దుఃఖంలోనే ఉంది ఉన్న నష్టమంతా -
ఈ దుఃఖం వల్ల వివేకం నశిస్తుండడమే కాక, తేజస్సు కూడా తగ్గుతుంది.
దుఃఖపడడం జీవులకు సహజమే అయినా వీలైనంత తొందరగా ఈ దుఃఖం నుండి బయటపడాలి.
ఆయా వ్యక్తుల స్వభావం పై "ఈ దుఃఖం యొక్క తీవ్రత " ఆధారపడి ఉంటుంది.
కొంతమంది చిన్ననాటి నుండే " దుఃఖభావాన్ని " వృద్ధి పొందించుకుంటారు.
తనపై తనకే సానుభూతి, బాధలు చెప్పుకోవడం, ఇతరుల సానుభూతిని కోరుకోవడం, ఎప్పుడూ అసంతృప్తి ... ఇలా నిరంతరం దుఃఖాన్ని ధ్యానం చేయడం వల్ల అలాంటి వారికి " దుఃఖ పడే సంఘటనలే " ఎదురౌతుంటాయి.
ఇక ఒక్కొక్కసారి ఈ దుఃఖమనే అనుభూతి వెంటనే మరో అనుభూతిగా కూడా మారవచ్చు!
ఉదాహరణకు...
ఒకడికి భార్య చనిపోయిందనుకుందాము ! అప్పుడు అనుబంధం, ప్రేమ (❓) వల్ల విపరీతంగా దుఃఖిస్తుంటాడు.
అతన్ని చూసిన వారు "వీడు కోలుకోవడం చాలా కష్టం " అనుకుంటారు.
తరువాత భార్య తరుపు బంధువులు" భార్యను వీడే చంపాడు" అని కేసు పెట్టారనుకుందాము !
అప్పుడు అతనిలో భార్య తరుపు బంధువుల పైనా, చివరకు చనిపోయిన భార్య పైన కూడా అంతవరకు ఉన్న దుఃఖం ద్వేషంగా మారుతుంది. తరువాత అతడు సులభంగానే మరో పెళ్లి చేసుకోవడానకి సిద్ధంగా ఉంటాడు.
మొత్తం మీద అర్థం చేసుకుంటే...
"ఉన్నది భావావేశం ఒక్కటే... అదే దుఃఖంగా, సుఖంగా, రాగం గా , ద్వేషంగా .. ఇలా రకరకాల అనుభూతులుగా మారుతుందన్న విషయం "జ్ఞానం" వల్ల అర్థమౌతుంది.
ఈ "జ్ఞానం" అనుభవంలో ఉన్నప్పుడు "మనిషి "నిరంతరం "స్పృహ (కాన్సియస్)లో ఉంటాడు.
అంటే దుఃఖం - కోపం వంటి భావాలు ప్రవేశించగానే వెంటనే స్పృహలోకి వస్తాడు. లేదా అలాంటి భావాలు మనస్సులోకి వచ్చిపోతూండడాన్ని జాగరూకతతో గమనిస్తూ ఉంటాడు.
అప్పుడు ఈ భావావేశం బ్రమాత్మకమైనదనీ, ..ఇది మోహాన్ని కలుగజేస్తుందని గ్రహించి భావావేశానికి అతీత స్థితిలో ఉంటూ స్థితప్రజ్ఞుడౌతాడు.
కేవలం ఈ స్థితప్రజ్ఞతను పొందడం ద్వారా మాత్రమే దుఃఖం నుండి విముక్తులం కాగలము .
ఇదొక్కటే దుఃఖానికి శాశ్వత పరిష్కారం.
నిజానికి మనిషి క్రియాశీలుడౌతున్నా కొద్దీ సహజంగానే స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది.
"అతిగా దుఃఖపడే స్వభావం అనేది అభివృద్ధికి అతి పెద్ద అడ్డంకి."
ఒక దుఃఖస్తుడు ఆయా పనులను అసంతృప్తితో, క్రమశిక్షణా రహితంగా,స్పృహ లేకుండా చేస్తుంటాడు.
క్రియాశీలుడు అవే పనులను ఆసక్తీ, సంతృప్తి, శ్రద్ధలతో చేస్తుంటాడు.
ఇద్దరి మధ్య అంతే తేడా !
ఆహారం - నిద్ర - భయం - మైథునం - సుఖం - దుఃఖం అనేవి జీవులన్నింటికి సమాన లక్షణాలు.వీటికే సహజాతాలని(Basic Instincts) పేరు. వీటిపై అదుపు సాధిస్తూ వీటిని ఉత్తమ స్థితికి తెచ్చిన కొలది మనిషి అన్ని రకాల అభివృద్ధిని సాధిస్తూ ఉంటాడు.
ఇందుకోసం మనం నిరంతరం సాధన చేస్తూ ఉండాలి.
స్వస్తి
"యాని కానిచిచ్చాన్తాని లోకే సప్త బుుషయో విద: I
సర్వాణి శం భవన్తుమే శం మే అస్త్వభయంమే అస్తు ॥
(తా ॥ శాంతిని పొందడానికి లోకంలో ఏ ఏ మార్గాలు ఉన్నాయో అవన్ని సప్తబుుషులకు తెలుసు.
ఈ మార్గాలూ - సప్తబుుషులు నాకున్న సమస్త దుఃఖాలను తొలగింపజేసి శాంతిని చేకూర్చి మంగళాన్నీ, అభయాన్నీ ప్రసాదించుగాక!)
(ఓపికగా చదివిన వారికి )
ధన్యవాదములతో
గురుమంచి రాజేంద్రశర్మ
No comments:
Post a Comment