Sunday, 14 August 2016

ఖాళి సమయాలు

ఖాళి సమయాలు
__________________

నిజానికి ఒక మనిషికి తనతో తాను గడపగలిగేటంత ఏకాగ్రత శక్తి లేకపోవడం వల్లనే TV ,  ముచ్చట్లు...... మొll ఏదో ఒక కాలక్షేప వ్యాపకాన్ని ఆశ్రయిస్తూ ఉంటాడు.

.... ప్రతీ వ్యక్తికి అప్పుడప్పుడు కొన్ని ఖాళి సమయాలు ఏర్పడుతుంటాయి. అప్పుడు ఒక రకమైన ఉద్వేగం ఏర్పడుతుంది. ఎంత మందిలో ఉన్నా బోర్ కొడుతుంది. ఏమీ తోచని పరిస్థితి ఏర్పడుతుంది.

అప్పుడు తమలో ఉన్న ఏకాగ్రత స్థాయిని బట్టి మనుషులు ఆయా ఆకర్షణలను ఆశ్రయిస్తూ ఉంటారు. అలా ఖాళి సమయాలు ఏర్పడినపుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది కూడా!

" మన జీవితాలను విశేషంగా మార్చివేసే శక్తి కలిగినవి ఈ ఖాళి సమయాలే!

ఆ సందర్భాలలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ప్రతిస్పందిస్తుంటాడు.

కొందరు ఆ ఖాళి సమయాలను తట్టుకోలేక ఒక రకమైన ఉద్వేగం ఏర్పడి.... రుచులు (చిరుతిండ్లు), T. V, మచ్చట్లు లేదా గొడవలు, వ్యసనాలు, .... మొ॥ వాటిని ఆశ్రయిస్తారు. దీని వల్ల తక్కువ స్థాయి ఫలితం ఉంటుంది.

మరికొందరు ఆ ఖాళి సమయాలను ఉపయోగపడే పనులతో భర్తి చేస్తారు. దీని వల్ల మధ్యమ స్థాయి ఫలితం ఉంటుంది.

ఇక చాలా కొద్దిమంది ఆ ఖాళి సమయాలను ఖాళిగానే ఉంచుతూ తనతో తాను గడుపుతారు.
అప్పుడు అత్యంత ప్రభావశీలమైన ఆలోచనలు ఏర్పడి జీవితాన్ని ప్రభావితం చేస్తూ  అభివృద్ధి వేగాన్ని పెంచుతాయి..... ఇలా ఖాళి సమయాలను ఖాళిగానే గడపడం వల్ల ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది.

నిజానికి తనతో తాను గడపడానికే ఈ ఖాళి సమయాలు ఏర్పడుతాయి.

ఈ ఖాళి సమయాలు సహజ సిద్ధంగా ఏర్పడే ధ్యాన సమయాలు .

మనం మరింత అభివృద్ధి సాధించడానికి ప్రకృతి నిరంతరం పంపించే సూచనలలో భాగమే ఈ ఖాళి సమయాలు .

మనలోని మంచి సంకల్పాలు ఫలవంతం కావడమే అభివృద్ధి.

కొందరికి రాజకీయమైన లక్ష్యాలు ఉంటాయి. మరి కొందరికి ధనపరమైన లక్ష్యాలు ఉంటాయి. కుటుంబ పరమైన లక్ష్యాలు కొందరికి.ఆథ్యాత్మిక లక్ష్యాలు మరికొందరికి. ఆయా వ్యక్తుల లక్ష్యాలు నెరవేరే దిశగా ఈ ఖాళి సమయాలు ఎంతగానో తోడ్పడుతాయి.

ఈ సారి ఖాళి సమయాలు ఏర్పడినపుడు వాటిని ఖాళిగానే ఉంచే ప్రయత్నం చేసినపుడు ఇందులోని సత్యం అర్థమౌతుంది.ఆ సమయంలో చేయవలసింది ప్రశాంతంగా కూర్చుని మనస్సులో వస్తున్న ఆలోచనలను గమనిస్తూ ఉండడమే! మొదట్లో ఆ ఆలోచనలలో మునిగి మనని మనం మరిచిపోతుంటాము. కాని క్రమంగా మన నుంచి వేరుగా జాగరుకతతో ఆ ఆలోచనలను గమనించగలుగుతాము.ఈ అభ్యాసం క్రమంగా ఆ ఆలోచనలు కూడా లేని నిశ్శబ్దంలో మమేకత్వాన్ని కలిగించి మనిషిలోని అంత:శక్తులను వెలికి తీసి తన స్వరూపాన్ని తనకు అవగత పరుస్తుంది.

                     ధన్యవాదములతో
          గురుమంచి రాజేంద్రశర్మ

No comments:

Post a Comment