Saturday, 13 August 2016

కృష్ణానది పుష్కరాలు

రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


కృష్ణానది పుష్కరాలు
--------------------------------

"పుష్కరం దుష్కరం గంతుం " అని ప్రమాణం .

అంటే-

"పాపం ను పోగొట్టేది పుష్కరమని అర్థం"

ఇలా పుష్కరాలు రావడం వల్ల నదులకు ఎందుకు ఇంత ప్రత్యేకత అనేదాన్ని ఒక చిన్న ఉపమానం ద్వారా చూద్దాము.

సేవా తత్పరుడు అయిన ఒక MLA ఉన్నాడనుకుందాము.
అతడు తన ఇంట్లో ప్రజలకు అందుబాటులో వుంటూ సేవ చేస్తున్నాడు. ప్రజలందరు తమ తమ అవసరాల నిమిత్తం ఆ MLA ఇంటికి వెళుతూ ఉంటారు. జనప్రవాహం అధికంగా ఉంటుంది.
ఒకసారి ప్రధానమంత్రి వచ్చి ఆయన ఇంట్లో 12 రోజులు ఉన్నాడు. అంతే కాదు అతనికి పూర్తి అనుకూలంగా ఉన్నాడు.

అప్పుడు ఏం జరుగుతుంది?

ఆ ఇంటికి - MLA కు మరింత ఆకర్షణ , అధికారం , తన ప్రజల అవసరాలను నెరవేర్చగలిగే శక్తి అత్యధికంగా వృద్ధి పొందుతాయి.

ఈ ఉపమానం లాగానే సహజంగానే నదులు చాలా మహిమాన్వితమైనవి. అలాంటి నదులలో పుష్కరుడు ప్రవేశించడం వల్ల  పుష్కరకాలంలో నదులు అత్యంత మహిమాన్వితమై ప్రజలను పాపం నుండి వేగంగా తరింప జేసే మహాత్మ్యం కలిగి ఉంటాయి.

సనాతన ధర్మం ప్రకారం షడైశ్వర్యాలను కలిగి ఉండి ,వాటిని ప్రసాదించే శక్తి కలిగిన అన్నింటిని భగవత్స్వరూపంగా భావించి పూజిస్తాము.

కాబట్టే నదులన్నింటిని సనాతనధర్మం దైవంగా పూజిస్తుంది.

నదులు తమ అనుగ్రహంతో మనుషులను నిరంతరం పవిత్ర పరుస్తూ ఐశ్వర్యవంతులను కూడా చేస్తాయి.

గురు గ్రహం కన్యారాశిలో ప్రవేశించినపుడు కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి.

ధర్మబుద్ధి  గురుగ్రహ అనుగ్రహం వల్ల లభిస్తుంది.గురు అనుగ్రహం లేని వ్యక్తి పెద్ద మోసకారిగా మారుతాడు.

ధర్మానికి కారకత్వం వహించడం వల్లనే గురు గ్రహా సంచారాన్ని బట్టే నదులకు పుష్కరాలు ఏర్పడుతున్నాయి.

"స చాపి ధర్మో దేశేషు తీర్ధ రూపేణ తిష్ఠతి " అని బ్రహ్మపురాణ వచనం.

అంటే దేశంలో ధర్మం అనేది క్రియాశీలమైన నదులలో - మహత్వపూర్వకమైన తీర్థ క్షేత్రాలలో ప్రతిష్ఠితమై ఉంటుంది.ఈ నదీ తీర్థ క్షేత్రాలలోని ధర్మం ఎప్పుడూ మార్పు చెందకుండా నాలుగు పాదాలతో సంపూర్ణంగా ప్రతిష్ఠితమై ఉంటుంది.

ఎందుకంటే..ధర్మం రెండు రకాలుగా ఉంటుంది. (ధర్మాశ్రయశ్చ ద్వివిధో దేశ : కాలశ్చ సర్వదా )
1) కాలాన్ని ఆశ్రయించి 2) దేశాన్ని ఆశ్రయించి

కాలాన్ని బట్టి కృతయుగంలో నాలుగు పాదాలుగా ఉన్న ధర్మం ... కలియుగం కు వచ్చేసరికి ఒకటే పాదంగా క్షీణిస్తుంది. అంటే కలియుగంలో 25% మాత్రమే ధర్మం ఉంటుంది.

కాని దేశాన్ని ఆశ్రయించిన ధర్మం తీర్థ క్షేత్రాలలో ఎలాంటి మార్పు చెందకుండా నాలుగు పాదాలుగా అంటే 100% గానే ప్రతిష్ఠితమై ఉంటుంది.

ఈ నదులలో స్నానం - తీర్థయాత్రలు ల వల్ల ప్రజలలో పాప నాశనం జరిగి ధర్మస్వభావం పెరుగుతుంది.

పుష్కర మహాత్మ్యం పరిధి
------------------------------------

ఒక దీపం ప్రకాశానికీ - కాగడా ప్రకాశానికి తేడా ఉంటుంది కదా!

అదే విధంగా శాస్త్రం ప్రకారం

సాధారణ సమయంలో కృష్ణానదికి ఉత్తర తీరం నుండి మూడు ఆమడల దూరం..... దక్షిణ తీరం నుండి రెండు ఆమడల దూరం తీర్థ మహత్యం ఉంటే....

పుష్కర సమయంలో

ఐదు క్రోసుల దూరం అంటే... తీరానికి అటు 15 కి॥మీ - ఇటు 15 కి॥మీ పుష్కర మహాత్మ్యం విస్తరించి ఉంటుంది.

ఈ పరిధిలో నివసించే వారు ఈ 12 రోజులు పుణ్యకర్మలు చేస్తే అనేక రెట్ల పుణ్యాన్ని ... అదే విధంగా పాపకర్మలు చేస్తే అనేక రెట్ల పాపాన్ని పొందుతారు.

కాబట్టి కృష్ణానది నది నుండి 15 కి॥మీ ॥ లోపు వారు దీక్షలో ఉండాలి.

మద్య - మాంసాలకు దూరంగా ఉండాలి. ఈ 12 రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

హెచ్చరికలు
____________

1) పుష్కర క్షేత్రం అత్యధిక ఫలితాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉంటుంది.

అంటే  పుణ్యమైనా - పాపమైనా అత్యధిక ఫలితం ఉంటుంది.

కాబట్టి అక్కడికి వెళ్లి  పుణ్యం బదులుగా పాపాన్ని వెంట తెచ్చుకునేలా ప్రవర్తించవద్దు.

''దశ హస్తం పరిత్యజ్య మూత్రం కుర్యాజ్జలాశయే I శత హస్తం పురీషేతు నదీ తీరే చతుర్గణమ్ II "

"అన్యధా కురుతే యస్తు మలం ప్రాశ్నాతి సద్విజ: II "

అని శాస్త్రం.

దీని ప్రకారం నదీ తీరం నుండి దాదాపు 200 గజాలు విడిచి మల మూత్ర విసర్జన చేయాలి. ఈ నియమాన్ని పాటించకుంటే మరు జన్మలో మలాన్ని భుజించే క్రీమిగా జన్మిస్తాడని శాస్త్రం చెబుతుంది.

అంతే కాదు "తీర్థే శౌచం న కుర్వీత " అంటే నదిలో మల మూత్ర విసర్జన  తరువాత శుభ్ర పరచుకోవడం మహాపాపం.

అలాగే స్త్రీలు బట్టలు మార్చుకుంటూ ఉంటే కామ దృష్టి తో చూడడం - అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తే అత్యధిక పాప ఫలం సిద్ధించి తేజో విహీనులై తరువాత కష్టాల పాలౌతారు.

పుష్కర స్నానం శుభ్రత కోసం చేసేది కాదు.
ఇది దివ్య స్నానం.
అందుచేత ముందుగా ఇంటి వద్ద స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి పుష్కర స్నానానికి వెళ్ళాలి. మలిన వస్త్రములతో పుష్కర స్నానం చేయరాదు.
సబ్బు షాంపూ వంటి వాటిని వాడరాదు. వంటికి నూనె రాసుకోవడం వంటివి చేయరాదు. నదిలో బట్టలు పిండరాదు. కేవలం నదిలో మూడు మునకలు వేసి స్నానం చేయాలి తప్ప శరీర శుభ్రత కోసం కాదు.

నదిలో విడిచిన బట్టలు పారవేయరాదు. ఒకవేళ పారవేయవలసి వస్తే 400 గజాలు విడిచి పారవేయాలి.

పుష్కర క్షేత్రంలో గొడవలు పెట్టుకుంటే తరువాత 100 గొడవలు నీ కోసం సిద్ధంగా ఉంటాయి.

పుష్కర స్నానానికి వెళ్లి తేజస్సు (పుణ్యం ) తో రావాలి. కాని తేజో విహీనత (పాపాన్ని ) పొందకుండా జాగ్రత్త వహించాలి.

                  స్వస్తి

                     ధన్యవాదములతో
                గురుమంచి రాజేంద్రశర్మ

No comments:

Post a Comment