Friday, 5 August 2016

"సౌభాగ్యం అంటే ఏమిటి?"




    "సౌభాగ్యం అంటే ఏమిటి?"
--------------------------------------------------

రచన :- గురుమంచి రాజేంద్రశర్మ



సౌభాగ్యం అంటే చాలా మంది "భర్త ఉండి మంగళసూత్రం ధరించే యోగ్యత ఉండడమని " అనుకుంటారు.దాన్ని సుమంగళత్వం అంటారు.

సౌభాగ్యం అంటే  "భర్త తన పట్ల సంపూర్ణ ప్రేమను కలిగి ఉండడం".

అందుకే 14 సం.అరణ్యవాసం, భరతుని పట్టాభిషేకం అనే రెండు వరాలు కావాలని పట్టుపట్టిన కైకేయిని చూసి దశరథుడు " ఈ రోజు వరకు నువ్వు గొప్ప సౌభాగ్యవతివి.కాని నేటి నుండి నువ్వు సౌభాగ్యన్ని కోల్పోయావు పో!" అని నిందిస్తాడు.

అలాగే హరివంశంలో...

నారదుడు స్వర్గం నుండి పారిజాత పుష్పాన్ని తీసుకువచ్చి రుక్మిణీదేవి అంత:పురంలో కృష్ణుడు ఉన్న సమయంలో ఆ పుష్పం యొక్క గొప్పదనాన్ని వివరించి బహూకరిస్తాడు.అప్పుడు కృష్ణుడు తన ప్రక్కనే ఉన్న రుక్మిణికి ఇస్తాడు.
అది చూసి నారదుడు ఇలా అంటాడు.

"కృష్ణా! నీ భార్యలందరిలో ఎవరు గొప్ప సౌభాగ్యవతి? అని నేను ఆలోచించే వాడిని. సత్యభామ కావచ్చేమోనని భావించే వాడిని కాని నేటితో అందరిలోకి రుక్మిణీదేవి గొప్ప సౌభాగ్యవతి అని బుుజువైంది." అంటాడు.

ఈ విషయం తెలిసిన సత్యభామ అలుగుతుంది..నిజానికి ఆ పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చినందుకు మాత్సర్యంతో అలగలేదు సత్యభామ . అంత చిన్న వ్యక్తిత్వం కాదు ఆమెది. భర్త మనసులో తన స్థానం తగ్గిందని అలుగుతుంది .

అప్పుడు కృష్ణుడు సాధారణ మనుషుల మాదిరిగా "నీకు స్వార్థం ఎక్కవ . ఉదార స్వభావం లేదు." అంటూ కోపగించలేదు.

ఎందుకంటే కృష్ణుడు పరిపూర్ణ వ్యక్తిత్వం కలవాడు.
ఎవరిని ఎలా తృప్తి పరచాలో అతనికి తెలుసు. అదీగాక సత్యభామ అలకలో ధర్మం ఉంది.భర్త మనసులో తనపట్ల సంపూర్ణ ప్రేమను కలిగి ఉండాలని కోరుకుంది.అందుకే వెళ్లి సత్యభామను ఓదార్చుతాడు.

అప్పుడు సత్యభామ ఇలా అంటుంది.

"ప్రాణేశ్వరా! మనం ఏకాంతంగా ఉన్నప్పుడు అనేక సార్లు నేను అడగకున్నా ' భామా ! అందరిలోకి నువ్వే గొప్ప సౌభాగ్యవతివి, అని చెప్పేవారు. నేటితో మీ మాటలు అబద్దాలని తేలిపోయింది. నేను సౌభాగ్య హీనురాలనని అందరి ముందు బుుజువైంది.. " అని దు:ఖిస్తుంది.

అప్పుడు కృష్ణుడు...
"భామా ! నేను నిజం చెబుతున్నాను. నా శరీరం ఈ లోకంలో ఎంత వరకు నిలిచి ఉంటుందో అంతవరకు నీ పట్ల నాకున్న మోహం తీరనిది .అంతగా నీ ప్రేమతో నన్ను గెలుచుకున్నావు..
నీ కోసం పారిజాత వృక్షాన్నే తీసుకువచ్చి నీతో "పుణ్యక వ్రతాన్ని " చేయిస్తాను. "అని మాట ఇస్తాడు కృష్ణుడు.

అప్పుడు సత్యభామ నా సౌభాగ్యత్వం అందరి ముందు బుుజువౌతుంది అంటూ సంతోషిస్తుంది.

కాబట్టి "సౌభాగ్యం అంటే భర్త మనసులో తన పట్ల సంపూర్ణ ప్రేమను కలిగి ఉండడం.". అందుకోసం ప్రతి స్త్రీ నిరంతరం పరితపించాలి.. అలా సౌభాగ్యవతి గా ఉండేలా తన మనసును .. వ్యక్తిత్వాన్ని.. శరీరాన్ని.. బుద్ధిని .. చివరకు ఆత్మను సంసిద్ధపరుచుకోవాలి.

అలాంటి స్త్రీల నే సనాతన ధర్మం "పతివ్రతలని "పిలిచింది.
వీరు నడయాడు తీర్థాలు.
కనబడు దేవతలు .

శ్లో|| ధన్యా పతివ్రతా నారీ నాన్యా పూజ్యా విశేషత: I పావనీ సర్వలోకానాం సర్వపాపౌఘ నాశినీ ||

తా॥పతివ్రత అయిన స్త్రీ ధన్యురాలు. ఆమే విశేషంగా పూజనీయురాలు. ఆమే తన చుట్టూ ఉన్న వారిని పవిత్రపరిచే శక్తిని కలిగి ఉండి అన్ని పాపాలను నశింపజేస్తుంది.

శ్లో || సా ధన్యా జననీ లోకే సధన్యో జనక : పితా| ధన్య: సచపతిర్యస్య గృహే దేవీ పతివ్రతా ॥

తా॥అలా పతివ్రత గా జీవించేలా తర్పీదు నిచ్చిన తల్లి ధన్యురాలు. తండ్రి ధన్యుడు. అలాంటి స్త్రీని భార్యగా పొందిన భర్త ధన్యుడు. అలాంటి స్త్రీ ఆ ఇంటి దేవత.

శ్లో || పితృవంశ్యా మాతృవంశ్యా:పతి వంశ్యాస్త్రయస్త్రయ :I పతివ్రతాయా : పుణ్యేన స్వర్గే సౌఖ్యాని భుంజతే ॥

తా|| ఆ పతివ్రత వల్ల ఆమే తల్లి వంశం - తండ్రి వంశం - భర్త వంశం ఈ మూడు వంశాలు పావనమౌతాయి.

శ్లో॥ యథా గంగావగాహేన శరీరం పావనం భవేత్| తథా పతివ్రతాం దృష్ట్వా సకలం పావనం భవేత్ ॥

తా॥గంగా స్నానం చేస్తే ఏలా పావనం అవుతామో అలాగే పతివ్రత దర్శనం వల్ల సమస్తమూ పవిత్రమౌతుంది.

..... అంటూ శాస్త్ర పురాణేతిహాసాలు సౌభాగ్యవతులైన పతివ్రతలను కీర్తిస్తున్నాయి.

శ్లో || భార్యా మూలం గృహస్థస్య భార్యా మూలం సుఖస్యచ I భార్యా ధర్మ ఫలావాప్త్యై భార్యా సంతాన వృద్ధయే ॥

తా॥గృహస్థాశ్రమానికి భార్యనే మూలం. అందులో సుఖానికి ఆమే మూలం. భార్య వల్లనే ధర్మఫలం సిద్ధించబడుతుంది. ధర్మబద్ధమైన సంతానానికి కూడా భార్యే కారణం...
... అంటూ అలాంటి భార్య పట్ల సరియైన విధంగా నడుచుకో అంటూ శాస్త్ర పురాణేతిహాసాలు పురుషునికి హితోపదేశం చేస్తున్నాయి.

ఇటువంటి పతివ్రతలకు నమస్కరించినా..వీరి సన్నిధి లో కొంత సమయం గడిపినా ఒక తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించిన ఫలితం లభిస్తుంది. వీరి సన్నిధి లో దుర్మార్గుడు వ్యసనపరుడైన భర్తతో సహ ఎవ్వరైనా పరివర్తన చెందవలిసిందే!

ఇది నా జ్యోతిష - ఆథ్యాత్మిక అనుభవంతో చెబుతున్న సత్యం.

భర్తను నిరంతరం ప్రేమించే స్త్రీ ఉన్న గృహం సమస్త దారిద్ర్యాల నుండి విముక్తమై ఐశ్వర్యవంతమౌతుంది.

అలాగే
భర్తను నిరంతరం ద్వేషించే స్త్రీ ఉన్న గృహం .. సమస్త ఐశ్వర్యాలు హరించబడి దారిద్ర్య స్థితిని పొందుతుంది.

అదే విధంగా ...

" యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః |
యత్రైతాస్తు నపూజ్యంతే
సర్వాః తత్రాఫలాః క్రియాః ||

ఎక్కడ స్త్రీలు పూజించబడతారో.. గౌరవించబడతారో అక్కడ సమస్త దేవతలు నివసిస్తారు.
ఎక్కడ స్త్రీలు ఆవమానాన్ని పొంది దు:ఖిస్తారో అక్కడ అన్ని కర్మలు విఫలమౌతాయి.

ఈ వ్యాసంలో ఆలోచించే వారికి ఏది ప్రేమ? ఏది స్వార్థం? అన్న విచక్షణతో పాటు వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక విషయాలు అంతర్లీనంగా కనిపిస్తాయి.

ఒక దేశంలో ధర్మం వృద్ధి చెందాలంటే.. శాస్త్రం చెప్పిన ప్రధాన కారణాలలో రాజు - తీర్థ స్థలాలు ( నదులు) తరువాత మూడవ స్థానంలో వచ్చేది స్త్రీలే!
( ఎందుకు అనేది మరో వ్యాసంలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.)

అలాంటి సౌభాగ్యవంతులైన - పతివ్రతలైన స్త్రీలతో మరియు స్త్రీలను గౌరవించే పురుషులతో మన దేశం నిండిపోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

చివరగా "సౌభాగ్యాన్ని "ఒక్క మాటలో అర్థమయ్యే విధంగా చెప్పాలంటే....

" సంపూర్ణ దాంపత్య సౌఖ్యమే ! "

                      స్వస్తి

యాదేవి సర్వభూతేషు మాతృ రూపేన సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ: ||

యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ: ||

యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ: ||

             (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

        గురుమంచి రాజేంద్రశర్మ

1 comment: