Sunday, 14 August 2016

బాహుబలి ది బిగినింగ్ సినిమా


"బాహుబలి  ది బిగినింగ్" సినిమాపై ఒక వ్యాసం లేదా రివ్యూ

ఒక మిత్రుని ఆహ్వానం మేరకు   "బాహుబలి సినిమా " చూసి రావడం జరిగింది.

సినిమా చాలా బావుంది. విశ్లేషిస్తే సినిమాలోని ఒక్కొక్క సన్నివేశం ఒక సినిమాతో సమానం.

మొదటి రోజు సినిమాను చూసి వచ్చిన కొంత మంది బాహుబలి సినిమాను వ్యతిరేకంగా విమర్శిస్తూ FaceBook లోనూ , Watsup లోనూ రివ్యూలు post చేశారు.

చౌకబారు హాస్యా‌న్ని ఇష్టపడే వారికి - తృప్తి పడే గుణం లేని వారికి - తనను తాను మేధావులుగా భావించుకునే వారికి - వాస్తవంలో జీవించడం తెలియక అతిగా ఊహించుకునే వారికి-అతి దరిద్రమైన వారి కంపెనీతో ఈ సినిమాకు వెళ్లిన వారికి  - పెదవి విరవడానికే పుట్టాను అని భావించే వారికి - ఇతరులను మెచ్చుకునే గుణం లేని వారికి - అర్థం చేసుకో గలిగే జ్ఞానం లేని వారికి -. అనుష్క ను అందంగా చూడాలని ఆశపడిన అభిమానులకు - ....ఈ   "బాహుబలి  ది బిగినింగ్" అనే సినిమా నచ్చకపోవచ్చు !

మన దేశంలో చాలా మంది "నేను పెదవి విరవడానికే పుట్టాను " అన్నట్లుగా ప్రవర్తించే వారు ఉంటారు.

ఒకరికి గ్రూప్ 1 లో ఉద్యోగం వస్తుంది.
"అబ్బెే! అతనిదేం గొప్పండి ? 10 లక్షలు లంచం పెడితే ఇచ్చారంట ఉద్యోగం " అని పెదవి విరచి ప్రచారం చేస్తారు.

ఒకరు రాత్రింబవళ్లు కష్టపడి ఒక గొప్ప పుస్తకాన్ని రాస్తారు.అర్థం చేసుకునే జ్ఞానం లేని వీరు "అబ్బెే! " అని పెదవి విరచి ప్రచారం చేస్తారు.

వేరొకరి కొడుకు 1st ర్యాంక్ తెచ్చుకుంటారు. "అబ్బెే! అంతా కాఫి కొట్టాడు. ఆ బాబు గూర్చి నాకు ముందు నుండి తెలుసు. ఏదో గూఢపుఠాణి జరిగింది" అని పెదవి విరచి ప్రచారం చేస్తారు.

ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు అంతో ఇంతో సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నో మంచి పనులు చేస్తాడు.ఆ నాయకుడు దగ్గరికి తమ వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లడానికి మార్గం లేని వారు "అబ్బెే! " అని పెదవి విరచి ప్రచారం చేస్తారు.

మళ్లి వీళ్లే తమ దగ్గరికి వచ్చే సరికి మరో రకంగా ప్రవర్తిస్తారు.
తాము రాసిన ఒక చెత్త కవితను గొప్పగా ప్రచారం చేస్తారు.
తమ కొడుకూ - కూతురు గొప్పదనం గూర్చి ప్రచారం చేస్తారు. తమ గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటారు.

నిజానికి సైకాలోజి ప్రకారం వీరు బాల్యం నుండి ఆత్మన్యూనత భావంతో పెరిగిన వారు. వీరికి అంతర్గతంగా "ఇన్ ఫీర్ యారిటి కాంఫ్లేక్స్ " ఉంటుంది. ఇతరులను విమర్శించడం వల్ల తమను తాము గొప్పగా అయినట్లుగా బ్రాంతి చెందుతుంటారు.

ఇతరులకు తెలియని ఒక పది విషయాలు నేర్చుకుని తమను తాము మేధావులుగా భావించుకునే వారు మరికొంత మంది . రాజమౌళి నో - ఇంకా ఎవరైనా ప్రముఖుల నో విమర్శించి "చూశావా ! నీ దాంట్లో తప్పులు చూపగలిగాను .కాబట్టి నీ కంటే నేనే మేధావిని ,గొప్పవాన్ని "అని మానసికంగా తాత్కాలిక తృప్తి చెందుతుంటారు.

విడుదల రోజే సినిమా చూసి  విమర్శ్యిస్తూ వీరి అభిప్రాయాన్ని  చెప్పడంలోనే " అందరి కంటే నేనే గొప్ప " అనిపించుకోవాలనే ప్రయత్నం కనిపిస్తూ ఉంది.

రవీంద్రనాథ్ టాగోర్ "గీతాంజలి "ని బెంగాలిలో మొదట రచించినపుడు చాలామంది పెదవి విరచిన వారే! తర్వాత దాన్ని ఆంగ్లంలోకి అనువదించి  పంపిన తర్వాత నోబుల్ ప్రైజ్ రాగానే తమ తీరు మార్చుకుని "నేను ముందే అనుకున్నాను. ఇది ఇంత గొప్పదని " అని ప్రచారం చేశారు.

ఇలా ప్రచారం చేసే వారిని మరి కొందరు అనుసరిస్తారు.

మన దేశంలో దాదాపు 30% వరకైనా ఆలోచించని వారు ఉంటారు. ఎందుకంటే వీరు పెరిగిన పరిస్థితులు అలాంటివి.వీరికి బాల్యం నుండి ఎవరూ ఆలోచించడం నేర్పలేదు.పైగా ఆలోచించడానికి అవాంతరాలు కల్పించారు. వారితో అంతా బట్టీ పెట్టించడం వల్ల అక్కడ ఆలోచించే అవసరం లేదు. అవసరానికి తల్లిదండ్రులు అన్నీ సమకూర్చారు. అక్కడ కష్టపడే అవసరం - ఆలోచించే అవసరం లేదు.mpc లేదా Bi.p.c తీసుకో! అంటే ఆలోచించకుండా తీసుకుంటారు.అరేయ్ ! మనకు వాకింగ్ చేయడం అచ్చి రాదురా ! లాంటి విషయాలు చెబితే ఆలోచించకుండా కళ్లు మూసుకుని అమలు చేస్తారు.ఇలా 20 సం॥వయస్సు వరకు పెరిగిన వారు తరువాత ఆలోచిస్తారా? ఆలోచించకుండా ప్రేమిస్తారు. ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటారు. ఆలోచించకుండా పిల్లలను కంటారు. ఆలోచించకుండా రోటిన్ గా పని చేస్తారు. ఆలోచించకుండా బ్రతుకుతారు. ... చివరకు ఆలోచించకుండా మరణిస్తారు. ఆలోచించమే తెలియదు వీరికి.

ఇలాంటి వారు ఇతరుల అభిప్రాయాన్ని తమ అభిప్రాయంగా ప్రచారం చేసుకుంటారు. ఏదెైనా క్రొత్తగా అర్థo అయ్యి కానట్లు అనిపిస్తే ఇదేదో బాగానే ఉందిరా! అనుకుని వాళ్ల పేరు తీసేసి తమ పేరుతో ప్రచారం చేసుకుంటారు.

ఇక "బాహుబలి  ది బిగినింగ్" సినిమా విషయానికి వస్తే.. వాళ్లు విమర్శించిన వాటికి సమాధానం చెబుతాను.

1) విదేశి సినిమాలను కాఫి కొట్టినట్లు ఉంది అన్నారు కొందరు.

మహాభారతం - రామాయణం లాగా ఉందని ప్రచారం జరిగింది. ఈ సినిమాలో అలా ఏం వుందో అర్థం కాలేదు. అంటూ తమ రివ్యూలో వ్రాసారు మరి కొందరు.

దానికి సమాధానం...

సినిమా మొత్తం భారతీయ విలువలతో - భారతీయ కథనంతోనే కూడుకుని ఉంది.

ఉదాహరణకు...

i).కట్టప్ప పాత్ర మహాభారతంలో భీష్ముని లాంటిది.
భీష్ముడు ఇచ్చిన మాట కోసం,  మరణించే వరకు కట్టుబడి ఉన్న వ్యక్తి. అతనికి ధర్మం తెలుసు. మానసికంగా పాండవ పక్షపాతే ! కాని, తాను విధించుకున్న నైతికవిలువల ప్రకారం జీవించాడు. చివరకు కౌరవుల తరపున మహాభారత సంగ్రామంలో నాయకత్వం వహించాడు.

ఈ సినిమాలో కూడా కట్టప్ప పాత్ర అచ్చంగా భీష్ముని నుండి ప్రేరణ పొందినది.

ii) నాజర్ (బిజ్జాల దేవ) పాత్ర మహాభారతంలో ధృతరాష్ట్రుని లాంటిది. ఇద్దరికి వైకల్యం . ఇద్దరూ ధర్మం పట్ల కాకుండా తమ పుత్రుల పట్ల పక్షపాతులు.

iii) రాణా (భళ్లాల దేవ) పాత్ర దుర్యోధనుని, కంసుని కలగలిపినది. దుర్యోధనుడు ఎన్నో సార్లు పాండవులను చంపించాలని చూశాడు.బాల్యం నుండి పాండవుల పై ఈర్శ్య పెంచుకున్నాడు. ఈ లక్షణాలన్ని ఈ పాత్రలో కనిపిస్తాయి.

iv) శివ గామి పాత్ర  మహాభారతంలో తన పిల్లలను - తన చెల్లలి పిల్లలను పక్షపాతం లేకుండా పెంచిన ఒక"కుంతి"- ధర్మాన్ని ఆచరించే విషయంలో తన పుత్రుని పట్ల కూడా కఠినంగా వ్యవహారించిన ఒక "విదుల ".. వంటి ఉదాత్త స్త్రీలను కలగలిపినది.

V) పాండవులను - కృష్ణుని కలగలిపినది - బాహుబలి

Vi) దేవకి - వసుదేవులను కలగలిపి = దేవసేన

... ఇలా ఈ సినిమా అంతా రామాయణ - భారత - భాగవతాలను రంగరించి సృష్టించిందే !

2) రెండవ విమర్శ్య .

చాలా సేపు యుద్ధమే ఉంది. అనేది.

గంట కాదు ఇంకా రెండు గంటలు అలాగే ఉన్నా ఎక్కడా బోర్ కలిగే విధంగా లేదు.

చెత్త ఫైటింగ్ లతో కూడిన ప్రస్తుత సినిమాలకు భిన్నంగా భారతీయ యుద్ధ రీతుల గూర్చి - మహాభారతంలోని పద్మ - త్రిశూల-గరుడ .. ఇలాంటి యుద్ధవ్యూ హాల గూర్చి నేటి తరానికి తెలియజెప్పే ప్రయత్నం నిజంగా అభినందనీయం.

ఇక మహాభారతం మొత్తం 18 పర్వాలలో దాదాపు భీష్మ, ద్రోణ .. మొ॥5,6 పర్వాలు యుద్ధం గూర్చే ఉంటాయి. అయినా అది ప్రఖ్యాతి గాంచిన ఇతిహాసం.

రామాయణంలో ప్రత్యేకంగా యుద్ధకాండమే ఉంది. అయినా అది ప్రఖ్యాతి గాంచిన ఇతిహాసం.

నిజానికి ఒక మనిషి జీవితమంతా మంచికి-చెడుకు జరిగే పోరాటమే!

అంత కష్టపడింది ..విమర్శ్యించే కొద్ది మందికి నచ్చినట్లుగా 10ని II యుద్ధం తీయడానికి కాదు. నువ్వు పెట్టే 100 రూపాయల ఖర్చుకన్న ఒక 1000 రెట్లు ఆనందించే విధంగానే రూపొందించిన రాజమౌళి ప్రయత్నాన్ని చేతనైతే ఒక తెలుగువాడిగా అభినందించు! లేదా మౌనంగా ఉండాలి.కాని, తన అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయవద్దు .

నిజంగా సమస్యలు ఎదురైనపుడే ఒక వ్యక్తిలోని ధైర్యం - ధీరోదాత్తత - మానవీయ స్వభావం ...మొ॥ లక్షణాలు బయటపడేది.
దర్శకుడు ఈ యుద్ధంలో ఆయా పాత్రల స్వభావాన్ని కళ్లకు కట్టినట్లుగా వ్యక్తం చేసే ప్రయత్నం చేశాడు.

నాటకానికి లేదా సినిమాకు
ప్రధానమైన అంగాలు కొన్ని ఉంటాయి.

1.వస్తువు(ఇతివృత్తం )(Plot)
2.నాయక (Hero)
3. ప్రతినాయక (Villain)
4)రసము (Sentiment)... ఇలా

 

నాయకులు నాలుగు రకాలు.

అందులో ఒక ఉత్తమ నాటకానికి (ఇక్కడ సినిమా)  ధీరోదాత్తుడు నాయకుడు కావాలని శాస్త్రనియమం.

“మహాసత్వోऽతిగంభీరః, కృపావానవికత్థనః”

– ఇవి ధీరోదాత్తుని లక్షణాలు
అంటే ...

i) మహాశక్తివంతుడు - వీరుడు - ధీరుడు -పరాక్రమవంతుడై ఉండాలి.
యుద్ధం గెలువడమే ముఖ్యం కాదు. ధర్మబద్ధంగా గెలవాలి.

ii) గంభీర స్వభావుడై ఉండాలి.అంటే కష్టాలు ఎదురైనపుడు, తొణకని - బెణకని వాడు కావాలి.

iii) “కృపావాన్” – కృపాంతరంగుడు కావాలి.

iv) అవికత్థనుడు అయి ఉండాలి

అవికత్థనుడంటే – ఆత్మప్రశంస చేసికోనివాడు

 ఈ ధీరోదాత్తుడి లక్షణాలను -  యుద్ధ సమయంలో విజయవంతంగా వ్యక్తంచేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

ఎలాంటి జ్ఞానం లేకుండా సినిమాలు తీసే ఈ కాలంలో మంచి జ్ఞానం కలిగిన దర్శకులను విమర్శించడం ఎంత వరకు సబబు.

3) ఇక మూడవ విమర్శ్య

కథనం గూర్చి...( కథను దేవసేన కోణం నుండి మొదలు పెడితే ప్రేక్షకులు కథలో తొందరగా లీనమయ్యేవారు. అన్నాడు ఒక విమర్శకుడు.)

కథనాన్ని నడిపించే విధానాలు రెండు రకాలు.

1) ఏదో ఒక పాత్ర ద్వారా కథను చెప్పించడం.

ఇది వేదవ్యాసుల వారు అనుసరించిన పద్ధతి.

2) రచయితనే కథనాన్ని నడిపించడం

ఇది వాల్మీకి రామాయణంలో అనుసరించిన పద్ధతి.

ఇక్కడ దర్శకుడు వాల్మీకి పద్ధతి అనుసరించాడు.

ఈ సినిమా ప్రధానంగా వీర రసానికి సంబంధించినది.
ఇక్కడ వాల్మీకి పద్ధతే అనుసరణీయం .

శృంగార రస ప్రాధాన్య సినిమాలలో(నాటకాలలో) ఏదో ఒక పాత్ర చే కథనాన్ని నడిపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

4) నాలుగవ విమర్శ్య

సంగీతానికి సంబంధించి ( కీరవాణి సంగీతం పేలవంగా ఉంది అన్నాడు ఓ విమర్శకుడు.)

ఈ విమర్శ్య సంగీత పరిజ్ఞానం లేని వ్యక్తి చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు.

ఇక చివరగా ....

డిస్కో పాటలను విని ఆనందించే ఒక వ్యక్తి "బాల మురళికృష్ణ గారి "కచేరికి వెళ్లి విమర్శించాడనుకుందాము.
అది ముమ్మాటికి బాల మురళికృష్ణ గారి తప్పు కాదు.

ఇక్కడ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

వీలైతే దర్శకుడిని అభినందించండి.లేదా మౌనంగా ఆస్వాదించండి.

ఒక సినిమాలో అశ్లీల దృశ్యాలు ఉంటే విమర్శించాలి.
హింసను ప్రేరేపించే విధంగా ఉంటే విమర్శించాలి.
కుల మత బేధాలను రెచ్చగొట్టే విధంగా ఉంటే విమర్శించాలి.
అంతే కాని అనవసరంగా విమర్శించడంలో ఔచిత్యం లేదు.

సినిమా చూస్తున్నంతసేపు ఎప్పుడో చదువుకున్న సాహితీ సౌరభాలను వెలికి తీసుకు వచ్చిన ఈ సినిమా నిజంగానే "ఒక దృశ్య కావ్యం " .

అందుకు హృదయ పూర్వకంగా దర్శకుడు " రాజమౌళి " గారిని అభినందిస్తున్నాను.

         (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములతో

        గురుమంచి రాజేంద్రశర్మ

P. S:-

ఒక సినిమా గూర్చి ఇంత సమయం తీసుకుని వ్రాయడం అవసరమా? అని మీకు అనిపించవచ్చు!
ఇది Hand writing App ద్వారా వ్రాయబడినది.అంటే చేతితో వ్రాస్తూ వెళితే తెలుగులో టైపు అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది సులువుగానే వ్రాయడం జరిగింది.

మంచి వాటిని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నపుడు అందులోని మంచిని వివరించి చెప్పడం కూడా అవసరమే కదా!

No comments:

Post a Comment