Thursday, 25 August 2016

కృష్ణుడు - వ్యక్తిత్వ వికాసం

కృష్ణుడు

రచన:- గురుమంచి రాజేంద్రశర్మ

ఈ రోజు కృష్ణ జన్మాష్టమి

నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మం... " దైవం మానుష రూపేణ " అన్నట్లుగా  ద్వాపర యుగంలో సగుణ రూపంగా నడయాడడానికి అవతరించిన దినమిది.

శ్లో|| “బ్రహ్మణో వయసా యస్యమిమేష ఉపచార్యతే
సచాత్మా పరమం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే”
                             
                                   (శ్రీ బ్రహ్మవైవర్త పురాణం)

తా॥ ఎవని కనురెప్పపాటు కాలం బ్రహ్మ ఆయుర్దాయమో అటువంటి ఆత్మ స్వరూపుడైన పరబ్రహ్మమే కృష్ణుడు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది.

మరి అటువంటి కృష్ణుని జన్మదినం రోజున నాలుగు కొబ్బరికాయలు కొట్టి, ఉపవాసాలు ఉన్నంత మాత్రాన సరిపోతుందా?

పూజించడం అంటే ఏమిటి?

ఒక పుత్రుడు తండ్రిని పూజించడం అంటే ప్రతీ రోజూ కాళ్లు కడిగి నమస్కరిస్తూ తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సరిపోతుందా?

అవన్నీ చేసినా చేయకున్నా తండ్రి చెప్పిన మంచి విషయాలను త్రికరణశుద్ధిగా ఆచరించినప్పుడే అది నిజమైన పూజ అవుతుంది.

ఇక్కడ కూడా వేలసంవత్సరాలుగా మనం ఎందుకు కృష్ణుని ఆరాధిస్తున్నామూ , పూజిస్తున్నాము.

" కర్షయతి ఇతి కృష్ణః "– అని కృష్ణ శబ్ద వ్యుత్పత్తి.

అంటే ఆకర్శించేవాడు కృష్ణుడు అని.

వేలసంవత్సరాలుగా కృష్ణుడు మనను ఎందుకు ఆకర్శిస్తున్నాడు.

అతని వ్యక్తిత్వమూ , గుణగణాలు . బోధలు ఏమిటి? వాటి గూర్చి కొంతవరకైనా తెలుసుకుని త్రికరణశుద్ధిగా ఆచరించినపుడు అది నిజమైన పూజ అవుతుంది.

కృష్ణుని వ్యక్తిత్వంలోని కొన్ని అంశాలను ఈ వ్యాసంలో చర్చించే ప్రయత్నం చేద్దాము.

1.కృష్ణుడు - ఉత్తమ స్నేహితుడు

శ్లో౹౹ పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీ కరోతి !
ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే
షణ్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః !!

తా॥ ఒక మంచి స్నేహితుడు తన స్నేహితుడు పాపపు పనులు - తప్పుపనులు చెయ్యకుండా నివారిస్తాడు, మంచి పనులు చేసేలా చేస్తాడు;
తన స్నేహితుని లోని బలహీనతలు రహస్యంగా ఉంచుతారు, అతని సద్గుణాలను అందరికీ తెలిసేలా చేస్తాడు; 
ఆపదలలో ఉన్నప్పుడు వదిలిపెట్టడు, అవసరమైన సమయంలో సహాయం చేస్తాడు.

"ఈ ఆరు మంచి మిత్రుల లక్షణములు " అని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ ఆరు లక్షణాలే కాకుండా ఇంకా అనేక ఉత్తమ స్నేహలక్షణాలను కలిగిన ఉత్తమ స్నేహితుడు శ్రీకృష్ణుడు.

బాల్యంలో స్నేహాలు వేరు. వయసు వచ్చి వ్యక్తిత్వం ఏర్పడ్డాక ఉండే స్నేహాలు వేరు.
బాల్యంలో ఆటపాటల మాటున మంచి చెడులు తెలియని స్నేహంలో బాధ్యత ఉండదు. బంధం మాత్రమే ఉంటుంది.

కానీ ,విచక్షణా జ్ఞానం తెలిసిన తర్వాత ప్రతీ బంధంలోనూ అలాగే ప్రతీ పనిలో కూడా  ఒక బాధ్యత ఏర్పడినట్లే స్నేహబంధంలో కూడా ఒక బాధ్యత ఏర్పడుతుంది.

స్నేహ ధర్మమంటే అదే!

అంతే కానీ , స్నేహితులు చేసిన ప్రతీ పని అది మంచిది కానీ చెడ్డది కానీ  సరియైనది అని నమ్మడం , అనుసరించడం నిజమైన స్నేహధర్మానికి వ్యతిరేకం.

యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం వచ్చిన తరువాత స్నేహితులలో ఎవరైనా తప్పుదారిలో వెళుతున్నప్పుడు హెచ్చరించడం చాలా ముఖ్యమైనది. స్నేహితుల్లో ఎవరికి అవసరమైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్లే, తప్పు అనిపించినపుడు చెప్పడం కూడా అత్యంత అవసరం.

ఈ స్నేహలక్షణాలన్ని మనకు శ్రీకృష్ణుని లో కనిపిస్తాయి.

అర్జునుడు యుద్ధ సమయంలో నిర్వీర్యుడైనపుడు, కర్తవ్యోన్ముఖుని చేసి శ్రీకృష్ణుడు తన స్నేహధర్మాన్ని చక్కగా అమలుపరిచాడు. చాలా సందర్భాలలో ఆవేశానికి గురియైన అర్జునుని  నివారించి సరియైన మార్గంలో నడిపించాడు.  అరణ్యవాస సమయంలో ఎప్పటికప్పుడు వారు  బలహీనతలకు గురియైనపుడు ధర్మమార్గాన్ని వీడకుండా స్నేహితుడై కాపాడాడు.

ధర్మప్రియులైనప్పటికీ, కష్టాల కొలిమిలో కొట్టుకుపోతున్నప్పుడు దారి తప్పే సందర్భాలు మానవులకు సహజం.
కాబట్టి ధర్మాచరణ చేయాలనుకున్న ఉత్తములైన పాండవులకు పరీక్షలు ఎదురైన సమయాలలో అండగా నిలిచాడు శ్రీకృష్ణుడు.
ఇందులో శ్రీకృష్ణుని స్వార్థప్రయోజనాలేవీ లేవు.

సహనాన్ని, మంచితనాన్ని, ధైర్యాన్ని పెంచడానికే శ్రీకృష్ణుని స్నేహధర్మం ఉపయోగపడింది. తద్వారా అర్జునుని ఆత్మోన్నతికి, అతడు పాశుపతాది అస్త్రాలను పొంది మరింత బలవంతుడూ, కీర్తిమంతుడు కావడానికి తద్వారా ధర్మసంస్థాపన జరిగి చివరకు సమాజహితానికి ఉపయోగపడింది.

చాలామంది దుర్యోధనుడు - కర్ణుని స్నేహం కూడా ఉత్తమ స్నేహంగా భావిస్తుంటారు.

కానీ అది తప్పు .

దుర్యోధనుడు ఏ తప్పు చేసినా ఇంకా రెచ్చగొట్టినవాడు కర్ణుడు. తన స్వంత యుక్తాయుక్త విచక్షణ ఏనాడూ ఉపయోగించి దుర్యోధనునికి మంచి చెప్పలేకపోయాడు. దుర్యోధనునికి దాసానుదాసునిగా తన ఆత్మను బానిసగా ఉంచి అధికారమదంతో ఏం చేస్తున్నా, అండగా నిలబడ్డాడు. అంతే కాదు మరింత రెచ్చగొట్టాడు.

అందుకే " కర్ణుడు లేకుంటే భారతమే లేదని " నానుడి వచ్చింది.

నిజానికి నిండు సభలోకి బుుత స్నాతయై ఉన్న ద్రౌపదిని ఈడ్చుకురమ్మని ఆజ్ఞాపించి మహాభారత యుద్ధానికి ఆజ్యం పోసింది కర్ణుడే!

అంతే కాదు స్నేహితుడైన దుర్యోధనుడు కష్టకాలంలో ఉన్నప్పుడు గంధర్వులతో యుద్ధంలోనూ - విరాట పర్వం  గోసంగ్రహణ యుద్ధంలోనూ స్నేహితున్ని వదిలి పారిపోయినవాడు కర్ణుడు. 
తన వ్యక్తిగత పంతాలకు పోయి భీష్ముడు మరణించే వరకు స్నేహితున్ని తన కష్టాలకు తనను వదిలి యుద్ధరంగానికి రానివాడు కర్ణుడు.

చివరకు తన మాటలూ - చర్యలతో రెచ్చగొట్టి దుర్యోధనునితో సహా కౌరవులందరూ పతనం కావడానికి కారణమయ్యాడు.

దూరదృష్టి - వివేకం లేనిపనులతో ఒక స్నేహితుడు ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణగా కర్ణుడు నిలిస్తే....

ఒక మంచి స్నేహితుడు ఎలా ఉండాలో దానికి ఉదాహరణగా శ్రీకృష్ణుడు నిలుస్తాడు.

ఒక స్నేహితుడు తండ్రిగా అక్కున చేర్చుకుంటాడు. సోదరునిగా అనురాగాన్ని పంచుతాడు.గురువుగా ఉపదేశమిస్తాడు. శిష్యునిగా సేవిస్తాడు.నాయకునిగా నడిపిస్తాడు. అనుచరునిగా అనుసరిస్తాడు. ఒక బావ గా పరిహాసాలాడుతాడు.సహచర్యం కోసం ఒక ప్రేమికునిలా తహతహలాడుతాడు.

అందుకే ఒక కవి..

" కేన రత్నమిదం సృష్టం మిత్రమిత్యక్షర ద్వయమ్!"

' మిత్రం ' అనే రెండు అక్షరముల రత్నాన్ని ఎవరు సృష్టించారో కదా!!

అని ఆశ్చర్యపోతాడు.

ఈ స్నేహ లక్షణాలన్నీ మనకు శ్రీకృష్ణుని లో కనిపిస్తాయి.

ఇక శ్రీకృష్ణుని స్నేహశీలతకు దృష్ట్వాంతంగా నిలిచే మరో ఉదాహరణ కుచేలోపాఖ్యానం .

శ్లో౹౹ దదాతి ప్రతిగృహ్ణాతి
గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి !
భుంక్తే భోజయతేచైవ
షడ్విధం మిత్ర లక్షణమ్ !!

అని శాస్త్రం మిత్రుని లక్షణాలను వివరిస్తూ తెలుపుతుంది.

అంటే స్నేహితుడు తన మిత్రునికి తన దగ్గర ఉన్నవి ఇస్తాడు. అతను ఇవ్వగలిగినవి తాను ప్రీతితో తీసుకుంటాడు.అతని రహస్యాలను అడుగుతాడు. తనవి చెప్తాడు;  స్నేహితుడు ఇచ్చిన దానిని ఇష్టంగా తింటాడు. తన దగ్గర ఉన్న వాటిని స్నేహితునికి అనురాగంతో తినిపిస్తాడు.

ఈ లక్షణాలన్నీ కుచేలునితో స్నేహాంలో కనిపిస్తాయి.

కుచేలుడు తనశక్తికొలది తెచ్చిన అటకులను సిగ్గుపడుతూ ఇవ్వడానికి బిడియపడినా తీసుకుని ఇష్టంగా తిన్నాడు. చెప్పకున్నా కుచేలుని కష్టాలను అర్థం చేసుకుని తీర్చాడు. సాదరంగా ఆహ్వానించాడు. ప్రేమగా వీడ్కోలు పలికాడు. తన రాచ కార్యాలను కూడా ప్రక్కకు పెట్టి కుచేలునితో మచ్చటించాడు. ప్రేమ పూర్వకంగా కౌగిలించుకున్నాడు.

ఎటువంటి భేషజాలు లేని నిష్కల్మషమైన స్నేహాన్ని , శ్రీ కృష్ణుడు కుచేలునిపై చూపించిన సందర్భంలో చూడవచ్చు.

బంధుత్వాల కన్నా ఎప్పుడూ ఒక మెట్టు పైనుండే స్నేహాలకు కాలక్షేపమే కాక బాధ్యత కూడా ఎక్కువేనని శ్రీకృష్ణుని ఉదాహరణగా తీసుకుని మనం గ్రహించవలసిన అవసరం ఉంది.

    ( శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీకందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకృష్ణుని మరిన్ని ఉత్తమ వ్యక్తిత్వ అంశాలను తరువాతి భాగాలలో తెలుసుకుందాము.)
                  స్వస్తి
               ధన్యవాదములతో
          గురుమంచి రాజేంద్రశర్మ


No comments:

Post a Comment