Wednesday, 10 August 2016

మనం పెంచిన చెట్లు పుత్రులు ఇచ్చే ఫలితాన్ని ఇస్తాయి


తెలంగాణ ప్రభుత్వ హరితహారం ఒక  ఆథ్యాత్మిక సాధన
--------------------------------------------------------------------------------

రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి హరితహారం పేరిట ఒక బృహత్ పథకం అమలుపరుస్తుంది. దేనికి ప్రజల తోడ్పాటు కూడా ఎంతో అవసరం.నిజానికి ఇది ఒక ఆథ్యాత్మిక సాధన కూడా! 

ఆశ్చర్యంగా అనిపించినా  "వృక్షసేవ " అనేది కూడా ఒక గొప్ప అథ్యాత్మిక సాధన.యజ్ఞయాగాదులు ఎంతటి ఫలితాన్ని కలిగిస్తాయో అంతే ఫలితాన్ని చెట్లను నాటి, పెంచి, పోషించి పొందవచ్చు !

"పుత్రా : ప్రదిష్టా: పురుషస్య వృక్షా: స్వయం కృతాస్తేషు నరేణ భావ్యమ్ " 

అని శాస్త్రం చెబుతుంది.

అంటే దశవిధ పుత్రులలో వృక్షాలు మానవులకు "స్వయం కృత పుత్రులు " అవుతున్నారు.

"ఏకోZపి రోపితో వృక్ష : పుత్ర కార్య కరో భవత్ "
అని శాస్త్రం.

అంటే కనీసం ఒక చెట్టును నాటి పోషించినా ఆ చెట్టు ఒక పుత్రుడు చేసే కార్యాలన్నింటినీ చేసి పున్నామ నరకం నుండి గట్టెక్కిస్తుంది. ( ధర్మ సంతానంగా ఒక పుత్రుడు నిర్వహించాల్సిన ధర్మాలనన్నింటిని ఆ వృక్షం నిర్వహిస్తుంది.)

ఏ విధంగా అంటే -

1) "దేవాన్ప్రమానై : ప్రీణాతి "

తన పుష్పాలతో దేవతలను తృప్తి పరుస్తుంది.

2) "ఛాయయా చాతిథీం స్తథా "

తన నీడ చే అతిథులను సంతృప్తి పరుస్తుంది.

3) "ఫలైర్మనుష్యాన్ప్రీణాతి"

ఫలాలతో మనుష్యులందరకు ప్రీతిని కలిగించి మానవసేవ చేస్తుంది.

4) " శీతవాతా తప క్షేశం తథాచ్ఛేదన భేదనే | సహన్తే పరమం వృక్షాస్తద్ధి తేషాం మహత్తప:"॥

చలి - గాలి - ఎండ - వర్షం ... వలన కలుగు క్షేశాలనూ, నరకుట - పగులగొట్టుట వలన కలిగే బాధలను సహించి ద్వేషభావం లేకుండా తిరిగి ప్రత్యుపకారమే చేయడం వల్ల "మహాతపస్సు'' చేసిన పుణ్యఫలాన్ని సంపాదించుకుని, పితృసమానులైన ఆ "చెట్లు నాటిన వారికి " కూడా తపోభాగాన్ని అందిస్తుంది.

5) చివరగా

" స్నేహేన నిత్యం పురుషం మృతన్తే కామైస్తు దివ్యై : పరి తర్పయన్తి."

వర్షించుచుండగా ఆ వృక్షం ఆకుల నుండి ఏ జలం స్రవిస్తుందో .... ఆ జలం పితృతర్పణంగా మారి ఆ వృక్షాన్ని నాటిన వారు మరణించిన తర్వత కూడా ఆ "దివ్య తర్పణ" పుణ్యఫలితంగా వారికి ఉత్తమ పుణ్యలోకాలను అందిస్తుంది.

కాబట్టే వృక్షాలు "స్వయం కృత పుత్రులు" అవుతున్నారు.

తాను స్వయంగా జన్మనిచ్చిన పుత్రుడు పున్నామ నరకం నుండి గట్టెక్కడానికి ఆయా బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తిస్తాడో ? లేదో? కాని, వృక్షాలు సందేహం లేకుండా ఆ బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వహిస్తాయి.

"కాబట్టి మనిషి తప్పనిసరి వృక్షాలను నాటి పోషించాలి."
దీనివల్ల పాపపరిహారంతో పాటు పుణ్య ఫలితం కూడా సిద్ధిస్తుంది.

"వృక్ష సంరోపణాన్మర్త్యో మహత్ఫల ముపాశ్నుతే "
అంటూ శాస్త్రాలు ఈ విషయాన్నే నొక్కి చెబుతున్నాయి.

ఇలా చెట్లను నాటి, వాటిని శ్రద్ధగా పోషించాడాన్నే శివపురాణం "స్థావర లింగ పూజ " గా వర్ణించింది.

ఇక వర్షాలు చక్కగా కురిసి దేశం సుభిక్షంగా ఉండాలంటే మూడు ప్రధాన కారణాలను శాస్త్రాలు చెబుతున్నాయి.

1) యజ్ఞ యాగాదులు.
2) వృక్షాలు.
3) ధర్మబద్ధమైన ప్రజలు

ఈ మూడింటి బాధ్యతలను ఒక్క వృక్షాలే నెరవేర్చి తత్ఫలితాన్ని కూడా అందిస్తున్నాయి.

తెలంగాణా లో ప్రభుత్వం "హరిత హారం" పేరిట బృహత్ ప్రణాళికతో చెట్లను నాటడానికి సంకల్పించింది.ఈ ప్రయత్నం సంపూర్ణంగా ఫలించాలనీ, తద్వారా దేశంలో ధర్మం వృద్ధి చెందాలని ఆశిద్దాం.

        స్వస్తి శివం కర్మాస్తు !

(శుభకరమైన - ఆనందకరమైన    పనులనే చేయుదం గాక! )

                      ధన్యవాదములతో
                 గురుమంచి రాజేంద్ర శర్మా





No comments:

Post a Comment