Tuesday, 16 August 2016

స్వామి వివేకానంద - ఒక ఆసక్తికర ఉపన్యాసం

(శ్రీ స్వామి వివేకానంద సాహిత్య సర్వస్వం నుండి...)
స్వామీజి అమెరికాలో ఇచ్చిన ఒక ఆసక్తికరమైన ఉపన్యాసం

స్వమత దురభిమానం
______________________

ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా!

స్వమత దురభిమానం అనేక రకాలు.మద్య నిషేదం విషయమై కొందరికి దురభిమానం ఉంటుంది. చుట్ట కాల్చకూడదని మరికొందరి పట్టుదల . ఈ లోకంలో అందరూ చుట్ట కాల్చడం - తంబాకు సేవించడం మానివేస్తే స్వర్ణయుగం వస్తుందని కొందరి అభిప్రాయం.ఒకనాడు ఇక్కడి తరగతి గదికి ఒక యువతి వచ్చింది. ఆమే ఈ లోకంలోని అనర్థాలను గురించి చెబుతూ వీటిని పోగొట్టే మార్గం తనకు తెలుసు అంది.
"నీ ఉపాయం ఏమిటి?" అని నేనడిగాను.
"నువ్వు హల్ హౌస్ (మరణశిక్ష విధించే గృహం ) చూశావా? "అని అడిగింది.మానవున్ని పతితున్ని చేసే సమస్త పాపాలకు ఆ గృహానికి పంపడమే విరుగుడని ఆవేశంగా చెప్పింది. ఆమె ఈ ఆలోచన నాకు విచారాన్ని కలిగించింది. ఇదోక రకమైన దురభిమాన మాడ్యమే!

స్వమత దురభిమానం మంచి జరగడానికి జరిగే కృషికి అధిక ప్రోత్సాహకారి అని నేను చిన్నతనంలో భావించేవాణ్ణి.కాని, అది నిజం కాదని పెరిగే కొద్ది తెలుసుకున్నాను.

ఒక స్త్రీకి దొంగతనం చెయ్యడానికి. అభ్యంతరం లేదు. మరొకరి చేతి సంచి తీసుకొని చల్లగా పోతుంది. కాని, ఆమె పొగ త్రాగదు. ఆ పనిని తీవ్రంగా ద్వేషిస్తుంది. పొగ త్రాగేవాడినెవడి నెైనా చూస్తే తీవ్రంగా విమర్శిస్తుంది.

ఒకడు జనులను వంచిస్తుంటాడు. లంచాలు తీసుకుని ఎన్నో డబ్బలు కూడ బెడుతాడు.అతన్ని నమ్మడానికి ఎంత మాత్రం వీలు లేదు. అతడితో మెలిగిన ఏ స్త్రీకి శీలం దక్కదు. కాని అతడు తాగుబోతు కాదు. మద్యం సేవించే వారందరిని పాపులుగానే భావిస్తూ తీవ్రంగా విమర్శిస్తాడతడు. వారిలో అతడికి ఒక్క సుగుణం కూడా కనపడదు.తాను చేసే దుర్మార్గాలు అతడి లెక్కలోకి రావు.

ఇది మానవ సహజమైన స్వార్థ పరత్వం.పక్షపాతబుద్ధి .

ప్రపంచాన్ని పరిపాలించే భగవంతుడు ఒకడు ఉన్నాడనీ, అతడు ఈ లోకాన్ని మన దయా ధర్మాలకు వదిలి వెయ్యలేదని మీరు గ్రహించాలి. అతడే జగత్పాలకుడు, రక్షకుడు.

ముందు చెప్పిన తన తప్పులను గుర్తించక ఇతరులను తీవ్రంగా విమర్శించే మూర్ఖులు ఏమేం వాగుతున్నా, లోకం ముందుకు సాగిపోతూనే వుంది. వీరంతా చనిపోయినా ఏ కొరతా లేకుండా ప్రపంచం పురోగమిస్తూనే వుంటుంది.

ఇతర దేశాలను ఆక్రమించుకున్న జనులు మనకు చరిత్రలో కనిపిస్తారు. తమ మత నియమాలకు సంబంధించినంత వరకు వారు పరిశుద్ధ వర్తనులే, సజ్జునులే! కాని, వారు ఇతరులను హింసించడానికి సిద్ధపడ్డారు. మానవ కోటి చరిత్ర అంతటా ఈ ధోరిణే కనబడుతుంది. చివరకు ఇతరుల హింస నుండి తప్పించుకుని పారిపోయిన వారు కూడా మళ్లి తమకు అవకాశం దొరికినప్పడు ఇతరులను హింసించడాని పూనుకొంటారు.

... ఇలా తాము సచ్చీలురమనుకుని ఇతరులను ద్వేషంతో విమర్శించే స్వమత దురభిమానులలో నూటికి తొంబై మంది కాలేయాలు వ్యాధిగ్రస్థం కావడమో? అజీర్ణ రోగులుగానో? లేదా ఏదో విధమైన అనారోగ్యంతో బాధపడేవారౌతారు.నిజానికి ఇలా అసహనం - ద్వేషంతో కూడిన దురభిమానం కూడా ఒక మానసిక వ్యాధే!

అసహనం - ద్వేషంతో కూడిన సంస్కరణ విధానాలకు దూరంగా ఉండడమే వివేకమని నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను.

ఈ ప్రపంచం నెమ్మదిగా సాగిపోతుంది. నిదానంగా పోనివ్వండి.
తొందర దేనికి?
బాగా నిద్రపోండి. పెందలకడనే నిద్ర లేవండి. నరాలను మంచి స్థితిలో ఉంచుకోండి. సాత్వికమైన ఆహారాన్ని భుజించండి.లోకం పట్ల కరుణ చూపండీ! పేదల పట్లా - త్రాగుబోతుల పట్ల కూడా కరుణ చూపండీ!
మీరే ఆ పరిస్థితులలో ఉంటే ఆత్మహత్య చేసుకుని వుండేవారేమో?

దురభిమానులు లోకంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తారు. వారు లోకంలో ప్రతిఫలాన్ని ఏదో ఆశించే వారై ఉంటారు.కొల్లగొట్టడమే వారి పని .
దురభిమానుల సాంగత్యం విడిచిపెట్టిన తరువాతనే నిజమైన ప్రేమ, కరుణ అంటే ఏమిటో మనకు తెలుస్తుంది.

తప్పులూ, దోషాలు లేని వ్యక్తులు ఈ లోకంలో ఎవరూ ఉండరు. తమలోని దోషాలను గుర్తించే వారు స్వయంగావారు పరివర్తన చెందడమే గాక ఇతరుల తప్పులను కూడా మన్నించ గలుగుతారు.

గతంలో జరిగిన సంఘటన ఒకటి నాకు జ్ఞాపకం వస్తోంది.
ఒక స్త్రీ నా వద్దకు వచ్చి తన భర్త త్రాగుబోతు అయ్యాడని చెప్పింది.ఆమెకు వ్యక్తి స్వాతంత్ర్యాల గూర్చి అపోహలు ఎక్కువ. పురుషుడు తనకు పాదాక్రాంతుడవ్వాలని ఆమె కోరిక. తనకిష్టం లేని విషయం చెప్పడం ఆరంభించగానే తన మాటలతో ఆఘాయిత్యం చేస్తుంది. ఓర్మి - సహనం లేని మనిషి .ఇలాంటి స్త్రీలైనా- పురుషులైనా లోకానికి చేటు కలిగిస్తారు.

నేను ఆ స్త్రీతో ఇలా అన్నాను.

"అమ్మా ! నీలాంటి భార్యలు ఇరవై లక్షల మంది ఉంటే వారందరి భర్తలు కూడా త్రాగుబోతులయ్యేవారు. "

వ్యవహారాలు జరగాల్సిన తీరు అది కాదు. ఇతరులను సానుభూతితోనూ, ప్రేమతోను అర్థం చేసుకోవాలి.

నా ధర్మం సత్యం చెప్పడమే కాని ముఖస్తుతులు చెయ్యడం కాదు.

మానవుడికి విశ్వాసం - అభిమానం ఉంటే మాత్రం చాలదు. అది జ్ఞానంతో కూడి ఉండాలి.

ఇక నిజంగా మతానుష్ఠానం చేయని వ్యక్తే పర మతాలను విమర్శిస్తాడు.

భగవంతుడు నిన్ను అవసరమైన చోటనే పుట్టించాడు.

నువ్వు హిందువుగా పుట్టినందుకు గర్వించనవసరం లేదు.
మహమ్మదీయుడవైనందుకు గర్వించనవసరం లేదు.
క్రిష్టియన్ గా జన్మించినందుకు గర్వించనవసరం లేదు.

ఒకవేళ గర్వించవలసి వస్తే మానవుడిగా పుట్టినందుకు... మానవత్వాన్ని కలిగి ఉన్నందుకు గర్వించు ! సత్యాన్ని తెలుసుకునే అవకాశం దొరికినందుకు గర్వించు!

No comments:

Post a Comment