మానసికంగా ప్రేమనూ, ఓదార్పునూ, ధైర్యాన్ని అందించే గుణం - చంద్రుని ప్రభావం
------------------------------------------------
మానసికంగా ప్రేమనూ, ఓదార్పునూ, ధైర్యాన్ని అందించే గుణం జాతకం లో చంద్రుడు అనుకూలంగా ఉన్నవారికి సహజంగానే ఉంటుంది.
జాతకంలో చంద్రుడు పూర్తి వ్యతిరేకంగా ఉన్నవారు సాధారణంగా ఇతరుల మనసును నొప్పిస్తుంటారు. వారు ప్రేమనూ, ఓదార్పును ఇవ్వలేరు.స్వీకరించలేరు కూడా!
ఎందుకంటే వారు గత జన్మల నుండే ద్వేషాన్ని - ద్వేషభావనలను ... దు:ఖాన్ని - దు:ఖ భావనలను అభ్యాసం చేస్తున్నారన్నమాట.
ఇప్పుడు అకస్మత్తుగా ప్రేమనూ - ధైర్యాన్ని అందించుమంటే అది వారికి కష్టమైన పని.
"ఎవరైన తమ దగ్గర ఏది ఉందో దాన్ని మాత్రమే ఇవ్వగలరు ".
అందువల్ల జాతకంలో ఈ చంద్రుడు వ్యతిరేకంగా ఉన్నవారు ఇతరులకు దు:ఖాన్ని ఇవ్వగలరు. లేదా భయాన్ని అందించగలరు. లేదా వారి మనుసులో అశాంతినీ - ద్వేషాన్ని సృష్టించగలరు. ఇంకా ప్రయత్నిస్తే రాగాన్ని (ద్వేషానికి వ్యతిరేక పదం . ఈ రాగం అశాశ్వతం. ఇది ఏ క్షణమైనా ద్వేషంగా మారిపోవచ్చు!) కలిగించగలరు.కాని ప్రేమనూ - ఓదార్పును అందించడం వారికి కష్టమైన విషయం. ఎందుకంటే ఏదైనా మనకు అభ్యాసం వల్లనే సాధ్యమౌతుంది.
"అభిత : అస్యతే పరిచీయత ఇత్యభ్యాస : "
(అంటే అంతట పరిచయం చేయబడి ఉన్నది.)
"అభిత : అశ్యతే వ్యాప్యత ఇత్యభ్యాశ:"
(అంటే అంతట వ్యాపించి ఉన్నది.)
అనే రెండు వ్యుత్పత్తి అర్థాలు అభ్యాస శబ్దానికి ఉన్నాయి.
మొదటి అర్థం ప్రకారం అది మంచిదైనా చెడ్డదైనా అభ్యాసం చేసిన విషయం శరీరానికీ - మనసుకూ - బుద్ధికీ - చివరకు ఆ జీవాత్మకు బాగా పరిచయం చేయబడి సహజ గుణంగా మారుతుంది.
రెండవ అర్థం ప్రకారం అభ్యసించిన విషయం స్థూల శరీరంలోనూ - సూక్ష్మ శరీరంలోనూ - చివరకు కారణ శరీరంలోను పూర్తిగా వ్యాపించి సహజ గుణంగా మారుతుంది.
జాతకం అనేది ఒక వ్యక్తి గత జన్మలలో చేసిన మంచి - చెడు అభ్యాసాలను విశ్లేషించి దాని వల్ల ఆ వ్యక్తి పొందబోయే ఫలితాలను తెలుపుతుంది.
ఇక్కడ ఒక వ్యక్తికి జాతకంలో చంద్రుడు వ్యతిరేక స్థానంలో ఉన్నాడంటే అతనికి దు:ఖం లేదా ద్వేషం సహజగుణంగా మారిందన్న మాట! ఈ కర్మ ఫలితాన్నంతా చంద్ర దశా అంతర్దశలలో అనుభవిస్తాడు.
ఉదాహరణకు
తండ్రి పట్ల ద్వేషంతో ఉన్నవాడైతే రవిదశ - చంద్ర అంతర్దశలో , భాగ్యాధిపతి మొక్క చంద్ర అంతర్దశలో , చంద్రదశ - రవి అంతర్దశలో ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు.
తల్లితో ద్వేష ప్రవర్తన ఉంటే - చంద్ర (చతుర్ధిపతి) సంబంధ దశా అంతర్దశలలో ...
మేనమామ తో ద్వేష ప్రవర్తన ఉంటే - బుధ సంబంధ దశా అంతర్దశలలో ...
సోదరులతో ద్వేష ప్రవర్తన ఉంటే - కుజ సంబంధ దశా అంతర్దశలలో ...
....ఇలా కారకత్వాలను బట్టి దశా అంతర్దశలలో కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది.
కాబట్టి ఇతరులకు మానసికంగా ప్రేమనూ, ఓదార్పునూ, ధైర్యాన్ని అందించడం వల్ల చంద్రుని అనుగ్రహాన్ని పొందుతాము .దీని వల్ల అవతలి వ్యక్తుల కన్న ఎక్కువ ప్రయోజనం మనకే సిద్ధిస్తుంది అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
కేవలం డబ్బు మాత్రమే కాదు సుగుణాలు కూడా సంపదనే!
ఇంతకు ముందు చెప్పనట్లు "ఎవరైన తమ దగ్గర ఏది ఉందో దాన్ని మాత్రమే ఇవ్వగలరు ".
మనం ఇతరులకు దు:ఖాన్ని కలిగిస్తున్నామంటే మన దగ్గర సమృద్ధిగా దు:ఖం ఉందన్న మాట!
మనం ఇతరులకు ద్వేషాన్ని కలిగిస్తున్నామంటే మన దగ్గర సమృద్ధిగా ద్వేషం ఉందన్న మాట!
మనం ఇతరులకు ప్రేమనూ - ధైర్యాన్ని అందిస్తున్నామంటే మన దగ్గర సమృద్ధిగా ఆ గుణాలు ఉన్నాయన్న మాట!
ఆలోచించేవారికి మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి మనలో ఉన్న గుణ సంపదలు - గత జన్మల నుండి అభ్యాసం చేస్తున్న మన సంస్కారాలు అర్థమౌతుంటాయి.
ఇతరులకు ప్రేమనూ - ధైర్యాన్ని అందించినపుడు ఒక్కొక్కసారి అది ఎంతటి ప్రభావం చూపిస్తుందో ఉదాహరణగా ఈ క్రింది కథను చదవండి.
ఇది పూర్తిగా చదివితే మీ గుండె లోతులలో ఉన్న తడి బయటకు వస్తుంది .
.
.
జీన్ థామ్సన్ ఒక ఉపాధ్యాయురాలు. ఆమె ఆ రోజు ఐదవ తరగతి క్లాసులోకి వెళ్ళింది .
పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది . " నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని .
అబద్ధం ఎందుకు అంటే ఎప్పుడూ మూడో వరసలో కూర్చునే "టెడ్డీ స్టాండర్డ్ " ఆమెకు నచ్చలేదు . క్రిందటి సంవత్సరం అతడిని చూసింది . అతడు మిగిలిన పిల్లల్లా ఆటల్లో ఉండకపోవడం , సరిగా డ్రెస్ చేసుకుని రాకపోవడం గమనించింది . అయితే అప్పుడు అతడు తన క్లాస్ కాదు . అయినా ఆమెకు అతడంటే సదభిప్రాయం లేదు .
.
నెలలు గడుస్తున్నాయి . అతడి పేపర్స్ లో ఆమె రెడ్ మార్కులూ , తక్కువ మార్కులూ వేస్తోంది . అతడు మిగిలిన పిల్లలతో కలవలేక పోవడమూ గమనించింది .
.
ఆమె పని చేసే స్కూల్ లో పిల్లలను గురించి టీచర్ రికార్డు రాయాలి . అందరి రికార్డులు రాసేసినా ఎందుకో ఆమెకు టెడ్డీ రికార్డు రాయాలనిపించక ఆలస్యం చేసింది . క్రిస్మస్ వచ్చేస్తోంది . రికార్డు రాసి అప్పగించాలి .
.
ఒక రోజు అతడి పాత రికార్డు తిరగేసింది .
.
అతడు ఒకటవ తరగతిలో టీచర్ ఇలా రాసింది .
" టెడ్డీ చాలా సరదా కుర్రాడు . అతడితో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు . హోం వర్క్ నీట్ గా చేస్తాడు . బ్రిలియంట్ బాయ్ "
.
రెండో తరగతి టీచర్ రిపోర్ట్
" టెడ్డీ ఎక్సలెంట్ కుర్రాడు . కానీ అతడి తల్లికి వచ్చిన జబ్బు వలన అతడు కొంత కుటుంబం లో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు "
.
మూడో తరగతి టీచర్ రిపోర్ట్
" టెడ్డీ చాలా కష్ట పడుతున్నాడు .. చదువులో బాగానే ఉన్నాడు కానీ అతడి తల్లి మరణం అతడిని కుంగ తీసింది . అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు . అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు "
.
నాల్గో తరగతి టీచర్ రిపోర్ట్
" టెడ్డీ చదువులో వెనుకబడి పోయాడు . అతడు ఫ్రెండ్స్ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటున్నాడు . క్లాస్ లో నిద్ర పోతున్నాడు . అతడు ఒక ప్రోబ్లం చైల్డ్ కాబోతున్నాడు "
.
.
థామ్సన్ కి ప్రాబ్లం అర్ధం అయ్యింది .
ఇన్నాళ్ళూ తను టెడ్డి గురించి తెలుసుకోనందుకు బాధ పడింది ఆమె .
అయితే ఆమె క్రిస్మస్ వేడుకలకు పిల్లలను తయారు చెయ్యడం లో తలమునకలు ఐపోయింది . టెడ్డీ ని సానుభూతితో చూడడం తప్ప ఏమి చెయ్యాలో ఆమెకు తోచలేదు .
.
.
క్రిస్మస్ కు అందరు పిల్లలూ టీచర్ కి కానుకలు ఇవ్వడం ఆచారం
.
పిల్లలు ఆమెకు విలువైన కానుకలు ఇస్తున్నారు అందమైన రేపర్లు చుట్టిన కాగితాలలో విలువైన గిఫ్ట్స్ .
.
ఇంటికి సరుకులు తెచ్చిన పేపర్ బాగ్ లో ఏదో పెట్టి తెచ్చి ఇచ్చాడు టెడ్డీ . ఆ బేగ్ సగం చిరిగి ఉంది . అందులో ఒక ఇమిటేషన్ రాళ్ళ నెక్లెస్ ఉంది అందులో సగం ఊడిపోయాయి . ఒక సెంటు బాటిల్ ఉంది .అందులో సగం సెంటు ఉంది .
.
అందరు పిల్లలూ అది చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు . థామ్సన్ వారిని గట్టిగా కసిరి ఆ నెక్లెస్ మెడలో వేసుకుంది . ఆ సెంటు రాసుకుంది .
.
" చాలా బావుంది " అని అంది .
.
ఆమె వెనుకగా నించున్న టెడ్డీ "నిజంగా ఈ రోజు మీరు మా అమ్మలా వాసన వేస్తున్నారు " అన్నాడు .
.
.
అందరు పిల్లలూ వెళ్లి పోయారు . అయినా క్లాసును వదల లేకపోయింది థామ్సన్ . క్లాసులో కూర్చుని గంట సేపు ఏడ్చింది .
ఆ రోజు నుండి ఆమె వాడి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టింది . టెడ్డీ లో మార్పు చాలా త్వరగా వచ్చింది . ఆమె ప్రోత్సహిస్తున్నకొద్దీ చురుకుగా తయారయ్యాడు . వాడు ఆ సంవత్సరం తరగతి ఫస్ట్ గా వచ్చాడు .
.
.
ఇక్కడితో అయిపోలేదు .
.
.
నెక్స్ట్ సంవత్సరం ఆమెకు టెడ్డి నుండి వచ్చిన ఉత్తరం లో " ప్రాధమిక విద్యాభ్యాసం లో నాకు నచ్చిన ఉపాధ్యాయిని మీరు " .అది ఆ ఉత్తరం సారాంశం .
.
6 సంవత్సరాల తర్వాత వచ్చిన ఇంకో ఉత్తరం " నేను సెకండరీ విద్య క్లాస్ లో థర్డ్ గా కంప్లీట్ చేశాను . అయినా మీరే నా ఫేవరెట్ టీచర్ "
.
నాలుగు సంవత్సరాల తర్వాత ఇంకో ఉత్తరం " నేను ఇపుడు చదువు విషయం లో కష్టపడుతున్నాను . ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను . ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ "
.
ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచాయి . ఇంకో ఉత్తరం " డిగ్రీ తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు చదవాలి అనుకున్నాను . చదివాను . సాధించాను . ఇదంతా మీ చలవే . మీరే నాకు ఫేవరెట్ టీచర్ " ఈసారి అతడి సంతకం లో Theodore F. Stoddard, M.D. అని సంతకం చేశాడు .
.
.
ఇంతటితో ఈ కధ అయిపోలేదు .
.
ఇంకో ఉత్తరం వచ్చింది .
" నేను ఒక అమ్మాయిని చూశాను చర్చిలో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను . మా నాన్న రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు . చర్చిలో పెళ్ళికొడుకు తల్లి కూర్చునే బెంచి మీద మీరు కూర్చోవాలని నా కోరిక "
.
.
.
.
థామ్సన్ పెళ్ళికి వెళ్ళేటపుడు టెడ్డీ ఇచ్చిన నెక్లెస్ పెట్టుకుంది . అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి . సెంట్ రాసుకుంది .
.
.
.
.
ఆ రోజు కూడా టెడ్డీ కి వాళ్ళ అమ్మ కనిపించి ఉంటుంది .
.
.
.
.
.
( మనం మన ప్రభావం ఎవరి మీద అయినా ఎలా పడుతుందో ఊహించలేము . అందుకని మిత్రులారా! ఎదుటి వ్యక్తి తో ప్రేమగా ఉందాము . ప్రేమను పంచే ప్రయత్నం చేద్దాము !)
సౌమనస్య మస్తు !
స్వస్తి
అసారే సంసారే విషయ విషపూరే పటుతరే
ప్రవాహే ఘోరే మాం మలినతర మోహేన పతితమ్ |
భ్రమన్తం ధావన్తం మనసి విలపన్తం కరుణయా
సముద్ధర్తుం కృష్ణోవసతు మమ హృద్ధామ్ని సతతమ్ ॥
(ఓపికగా చదివిన వారికి )
ధన్యవాదములతో
గురుమంచి రాజేంద్రశర్మ
No comments:
Post a Comment