Wednesday, 11 October 2017

కోపం - అవగాహన

వ్యక్తిగతమైన దుఃఖం తమో గుణమైతే..కోపం అనేది రజో గుణం!!

చాలా సందర్భాలలో మనం సరియైన విధంగా ఆలోచించక పోవడం - అవగాహన చేసుకోకపోవడమే కోపం రావడానికి కారణమౌతూ ఉంటుంది.

ఉదాహరణగా ఈ క్రింది కథ చదవండి!

                               ✡️✡️✡️✡️✡️

ఒక సాయంకాల సంధ్యా సమయంలో ఒక వ్యక్తి దేవాలయంలో దేవున్ని దర్శించుకుని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాడు.

అదే సమయంలో ఇద్దరు పిల్లలు అక్కడ విపరీతంగా అరుస్తూ అల్లరి చేస్తున్నారు.

ధ్యానం చేసే వ్యక్తి ఎంత సముదాయంచినా పిల్లలు అదే తంతును కొనసాగిస్తున్నారు.

ఆ వ్యక్తిలో అసహనం పెరిగిపోతూ ఉంది. ఆ పిల్లలు ఆడుతూ - తిరుగుతూ వుంటే వాళ్ల కాళ్లకు తగిలి అతని పూల బుట్టలో ఉన్న ప్రసాదం దూరంగా పడింది.

సరిగ్గా అప్పుడే ఆ పిల్లల తాలుకు వ్యక్తి పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చాడు.ఆ వ్యక్తి పిల్లల పై ఉన్న కోపాన్ని ఆ పిల్లల తాలుకు వ్యక్తిపై చూపిస్తూ చివాట్లు పెడుతూ అరవడం ప్రారంభించాడు.

అప్పుడు పిల్లల తాలుకు వ్యక్తి శాంతంగా ఇలా చెప్పడం ప్రారంభించాడు!!!

"అయ్యా! క్షమించండి!!
ఈ పిల్లలు తల్లి దండ్రి లేని అనాథ శరణాలయం పిల్లలు! నేను ఆ శరణాలయంలో ప్రతి సాయంత్రం ఉచితంగా సేవ చేస్తుంటాను.
ఈ పిల్లలిద్దరికి బ్రెయిన్ ట్యూమర్.
పిల్లలు ఆనందంగా ఉంటారనే ఉద్దేశ్యంతో ఇలా గుడికి తీసుకువచ్చాను.
జరిగిన పొరపాటుకు మన్నించండి " అన్నాడు.

అప్పుడు ఆ ధ్యానం చేసే వ్యక్తి కోపం అంతా ఒక్కసారిగా జాళి గా మారిపోయింది.

కాబట్టి రజో -తమో గుణ పరిధిలోని భావాలు ఎప్పుడూ శాశ్వతం కావు. అవి మన మనుసును బట్టి వెంటది వెంట మారుతూ వుంటాయి.

ఇదే ఉదాహరణలో  ఆ పిల్లల తాలుకు వ్యక్తి ఇప్పటికే పది మర్డర్లు చేసిన ఒక సైకో అన్న విషయం తెలిస్తే ఆ ధ్యానం చేసే వ్యక్తిలో కోపం - జాళి స్థానంలో "భయం "ప్రవేశించేది.

ఆ పిల్లల తాలుకు వ్యక్తి ఒక కర్ర తీసుకుని ఆవేశంతో చెడామడా వాయిస్తే "దు:ఖం " ప్రవేశించేది.

ఆ పిల్లలు యవ్వనం లో తాను చేసిన పొరపాటు వల్ల కలిగిన తన పిల్లలే అని తెలిస్తే " ప్రేమ "కలిగేది.

ఇలా అవగాహనను బట్టి ,మనుసును బట్టి కోపం రకరకాల భావాలుగా మారుతూ ఉంటుంది.

నిజానికి " ఉన్నది శుద్ధభావం ఒక్కటే! (అంటే కోపం,దుఃఖం,వ్యక్తిగత సంతోషం,జాలి,రాగం,ద్వేషం వంటి మంచిచెడులు అంటని ఒకానొక ప్యూర్ ఎమోషనల్ ఫీలింగ్)

అదే రకరకాల భావాలుగా మారుతుంది!!!"

పరమాత్మ కు మూడు లక్షణాలు.

1. సత్

అంటే ఈ విశ్వమంతా ఉన్న ఉనికి
దాని అంశ మనలో వ్యక్తిగతమైన కాన్సియస్ గా మారింది

2. చిత్

అంటే సర్వజ్ఞత్వం
దాని అంశ మనలో వ్యక్తిగతమైన "ఏకాగ్రతగా" మారింది.

3. ఆనందం

అంటే బ్రహ్మానందం (బ్రహ్మానందం అంటే ఏంటి?అనేది ఉపనిషత్తులు అద్భుతంగా వర్ణించాయి.ఇది పెద్ద టాపిక్ కాబట్టి ఇక్కడ వర్ణించడం లేదు.)

దాని అంశనే మనలో ఇంతకు ముందు చెప్పినట్లు "ప్యూర్ ఫీలింగ్ "గా మారింది.


పూర్ణంగా శుద్ధిగా ఉన్న ఆ లక్షణాలు మనలో అంశమాత్రంగా మాత్రమే ఇప్పుడు అనుభూతి చెందుతున్నాము!!

"తిరిగి పూర్ణత్వాన్ని చేరుకుని ఆ " సచ్చిదానంద స్థితిని పొందడమే జీవుని లక్ష్యం."

                               ✡️✡️✡️✡️✡️

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

భారమైన జీవితం

""హాస్యం , భావుకత,వివేకం  అంటే తెలియని వారితో

అది స్నేహమైనా....

దాంపత్యమైనా...

జీవితం చాలా భారమౌతూవుంటుంది!!!! క్షణమొక యుగంలా గడుస్తుంది.""

ఉదాహరణగా ఈ క్రింది కథ చదవండి.

అప్పుడే పెళ్ళైన ఒక భార్య  వారం రోజులకే వచ్చిన ఆషాడ మాసంలో ...
..తన పుట్టింట్లో ఉంటూ తన భర్తకు వాట్సాప్ లో తన మొదటి ప్రేమలేఖ ఇలా రాసింది!!!

నా ప్రియాతి ప్రియమైన శ్రీవారు!!

నీవు నిద్రించినప్పుడు నీకలలను కొన్ని నాకు పంపు!

నీవు నవ్వుతున్నప్పుడు నీ నవ్వుల్ని కొన్ని నాకు పంపు!!

నీవు తింటున్నప్పుడు నీ రుచుల్ని నాకు కొన్ని పంపు!!!

నీవు శ్రమిస్తూ ఉంటే నీ చెమటబిందువులను నాకు కొన్ని పంపు!!!!

నీవు స్నానం చేస్తున్నప్పుడు  నీ ప్రేమబిందువులను నాపై కాస్తా చిలకరించు!!!!!

ఒకవేళ ఏ కారణంగానైనా నీవు దుఃఖంగా ఉంటే నీ కన్నీళ్ళని నాకు కొన్ని పంపు!!!

నీ కష్టసుఖాలన్నింటిలో నేను భాగమయ్యానన్న సంగతి మరచిపోకు!!!

నీవు నాపై కురిపించిన తలంబ్రాల ప్రేమ స్పర్శ ఇంకా నన్ను పులకరింప చేస్తూనే ఉంది.

పూర్వం నలుడు దమయంతికి మేఘం ద్వారా సందేశం పంపేవాడట!!!

ఇప్పుడు ఈ వాట్సాప్ అనే మేఘం ద్వారా పంపే మీ సందేశం కోసం ఎదిరిచూస్తుండే ....

నీ
శ్రీ

""""""""""""""""""""""""""" I Love U """"''"'""""""'''''"''''"""""""

( Ps:- ముఖ్యమైన విషయాన్ని ఈ గుర్తులో సూచిస్తారట!! అందుకే అన్ని గుర్తులతో సూచించాను😊)

......ఇలా మొదటి ప్రేమలేఖ రాసింది.

భర్త దగ్గరి నుండి ఇలా సమాధానం వచ్చింది.

Dear Sri
( డియర్ శ్రీ )

Em rasinav
(ఎం రాసినవ్)
Oka mukka kooda artham kale
( ఒక ముక్క కూడా అర్థం కాలే!)
Nuv rasinavanni pampadam ekkada sadhyamaitadi.
( నువ్వు రాసినవన్నీ పంపడం ఎక్కడ సాధ్యమౌతుంది?)

Nuv btech chesinavante mastu knowledge untadanakunna
( నువ్వు బిటెక్ చేసినవంటే మస్తు నాలెడ్జ్ ఉంటదనుకున్నా!)

Sare parledule
( సరే! పర్లేదులే!!)
Adollaki mogolla lekka knowledge undadani ma tata chebtunde
(ఆడోళ్ళకి మొగోళ్ళ లెక్క నాలెడ్జ్ ఉండదని మా తాత చెబ్తుండే!!)

Gavi sadhyam gavugani oka cheera koni pampumante pamputa
( గవి సాధ్యంగావుగానీ ఒక చీర కొని పంపుమంటే పంపుతా!)

Talambrala vishayam manchiga yadijesinav
Talambralaku biyyam takkuva posindlu ani ma amma annadi.
( తలంబ్రాల విషయం మంచిగా యాదిజేసినవ్! తలంబ్రాలకు బియ్యం తక్కువ పోసిండ్లు! అని మా అమ్మ అన్నది)

Last ki emo rasinav
Em gurtulu
(లాస్ట్ కి ఏమో రాసినవ్? ఎం గుర్తులు?)

Sare nenu ellundi vasta
Tensan pettukoku
(సరే! నేను ఎల్లుండి వస్తా. టెన్షన్ పెట్టుకోకు!!!!)

I Too Love U

.
.
.
.
.
.
.
.
.
.
.
.

( ఈ ఉత్తరం చదివిన అతని భార్య కారణం లేకుండానే కొన్ని గంటల పాటు ఏడ్చింది.

ఆమే సనాతన ధర్మంలో పుట్టిన ఋషుల మాటలను తు. చ.తప్పకుండా ఆచరించాలనుకునే స్త్రీ.

జీవితకాలమంతా అతనితో గడపబోయే జీవితం ఎంత భారంగా మారబోతుందో ఆమెకు ఊహించుకుంటేనే భయం వేయసాగింది!!!!!)

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

                              ✡️✡️✡️✡️✡️

Monday, 9 October 2017

సామాన్యుని సలహా


రచన:- గురుమంచి రాజేంద్రశర్మ

ఒక కారు తయారీ కంపెనీ యజమాని తన కంపనిలోని ఒక ఇంజనీయర్ కు " ఒక మంచి కారును డిజైన్ చేసి తయారు చేయుమని" ఒక పని అప్ప చెప్పాడు.

ఆ ఇంజనీయర్ " ఒక అద్భుతమైన కారును "తయారుచేసి సిద్ధంగా ఉంచి యజమానికి కబురుపెట్టాడు.యజమాని వచ్చి ఆ కారును చూసి ఆశ్చర్యానందాలను వ్యక్తం చేయడంతోపాటు అతని పనితనాన్ని చాలా మెచ్చుకున్నాడు.

ఆ కారును కంపెనీ తయారు ప్రదేశం నుండి షోరూంకు తీసుకొద్దామని చూసేసరికి ప్రవేశ ద్వారం కన్నా కారు కొన్ని ఇంచులు ఎత్తుగా ఉంది.

కారును తయారు చేసేముందు ఈ విషయం గమనించలేక పోయినందుకు ఇంజనీయర్ లోలోపల చింతించసాగాడు.

తయారీ ప్రాంతం నుంచి వెలుపలకు కారును ఎలా తీసుకోవాలో ఆ యజమాని ఆలోచించసాగాడు.

అక్కడే ఉన్న "ఫేంటర్" కారును అలాగే బయటకు తీసుకు వద్దాం! కారు పైన కొన్ని గీతలు.. నొక్కులు పడితే తర్వాత సెట్ చేసుకోవచ్చు!! అని సలహా ఇచ్చాడు.

"ప్రవేశ ద్వారం పగులగొట్టి కారు బయటకు తీసుకువద్దాం! తర్వాత ద్వారాన్ని రిపేర్ చేయిద్దాము! " అని ఇంజనీయర్ సలహా ఇచ్చాడు.

ఈ రెండు సలహాలు విని యజమాని కన్వీనెన్స్ కాలేక పోయాడు.ఎందుకంటే అలా కారుకు నొక్కులూ,గీతలు పడడం కానీ, ద్వారాన్ని పగలగొట్టడం కానీ మంచి శకునంగా అతడు భావించలేకపోయాడు.

జరుగుతున్న విషయమంతా చూస్తున్న అక్కడే ఉన్న "వాచ్ మెన్ " భయం భయంగా సందేహిస్తూనే తన మనసులోని ఐడియా చెప్పాలని " ఒక చిన్న సలహా సార్! "అన్నాడు.

అక్కడున్నవాళ్ళు " నిపుణులే ఇవ్వలేని సలహాని వాచ్ మెన్ ఏమిస్తాడా? " అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా..

ఆ వాచ్ మెన్ ఇలా అన్నాడు.

"కారును బయటకు తీసుకురావడం చాలా ఈజీ సార్! కారు, ద్వారం కన్నా కొన్ని ఇంచులే ఎత్తుగా ఉందికదా సార్! కారు టైర్లలోని "గాలి" కొంత తీసేసి బయటకు తెచ్చి తిరిగి కారుటైర్లలో గాలినింపితే సరి!!" అన్నాడు.

వాచ్ మెన్ సలహా విని అతన్ని అభినందిస్తూ అక్కడున్న ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టసాగారు.

                          ✡️✡️✡️✡️✡️
కాబట్టి ,కేవలం నిపుణుల అభిప్రాయం  తీసుకుని మాత్రమే సమస్యలను విశ్లేషించవద్దు!!

ఒక్కోసారి చదువుకోని తాతనో, నానమ్మనో, అమ్మమ్మనో వంటి  తాము సామాన్యంగా భావించే వ్యక్తులు కూడా..

"ఎంతో కష్టం అని భావించిన సమస్యను అతి సులభంగా పరిష్కరించవచ్చు!! "

...ఈ కథలో నేర్చుకోవలసిన మరో నీతి కూడా ఉంది.
మిత్రులతోనో, బంధువులతోనో.. గొడవ వల్లనో మరే కారణం వల్లనో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఈ కథలోని కారులా మనం ఎత్తుగా (ఉన్నతంగా అనుకొని)  వారి ఇంటి ప్రవేశ ద్వారం చిన్నగా ప్రవేశించలేనిదానిలా కనిపిస్తుంది.

అప్పుడు ఈ కథలోని వాచ్ మెన్ సలహా పాటించాలి!!

కొంత గాలి (ఇగో) తీసివేసి...ఎత్తును (ప్రవర్తనను) అడ్జెస్ట్ చేసుకోవాలి.

నిజానికి మనమందరం ఆనంద స్వరూపమైన "ఆత్మ" కలవారం!!
కానీ,
""అనవసరమైనవి జమ చేస్తూ ఉంటే అశాంతితో బరువెక్కిపోతాము!!!!!
ఈ చెత్తానంతా తొలగించుకుంటున్నా కొద్దీ ఆనందంతో తేలికైపోతాము!!!!! ""
                           ✡️✡️✡️✡️✡️
ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

మన జీవితమే మనకు ముఖ్యం





ఒక వ్యక్తి బ్రహ్మచారిగా  ఉన్నప్పుడు .." ఊ! ఏమిటి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ?" అని అడుగుతుంటారు.

ఉద్యోగమో, వ్యాపారమో చేసి ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యాడనుకో! " ఎం సంగతి? పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావ్ ?(వివాహం ఎప్పుడు?) అని అడుగుతారు.

వివాహం చేసుకున్నాడనుకోండి!  "పిల్లలు ఎప్పుడు? (ఇంకా పిల్లలు కాలేదా?) అని అడుగుతారు.

ఒక సంతానం కలిగింది అనుకోండి! " రెండో సంతానం ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? "అని అడుగుతారు

విడాకులు తీసుకుంటే, "ఎందుకు?? "అని అడుగుతారు

మళ్ళీ  జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తే
"ఎందుకు చాలా త్వరగా?? "అడుగుతారు.

పోనీ చేసుకోకుంటే " మళ్ళీ పెళ్లి చేసుకోవా? "అని అడుగుతారు.

సైకిల్ ఉంటే " బండి ఎప్పుడు కొంటున్నావు ? " అని అడుగుతారు. బండి ఉంటే " కారు ఎప్పుడు " అంటారు. కారు ఉంటే "క్రొత్త కారు ఎప్పుడు ?" అంటారు.

లోకం తీరే అంత!! ప్రజలు  ఒక వ్యక్తిని ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడూ ఒప్పుకోరు!! ఇంకేదో కావాలంటారు !!

కానీ , ఒక వ్యక్తి తాను ఉన్న స్థితిని ఎక్సెప్ట్ చేసి ..తన పట్ల తాను సగర్వంగా ఉంటే, ప్రజలు ఏమనుకుంటున్నారో పట్టించుకోడు!!

అలా లేని వారే ఇతరుల గురించి ఆలోచిస్తూ మనసు అశాంతి పర్చుకుంటారు.

ఇది మన  జీవితం..

ఇతరుల మాటలు వినో..ఇతరులతో పోల్చుకునో..తాత్కాలిక సుఖాలకు ఆశపడో.. అనవసర చెత్త ఆకర్షణలకు లోనయ్యో ..జీవితాన్ని గడపడం వల్ల అశాంతి తప్పదు!!

ఇతరుల మాటలు మనకు అనవసరం.మన లోపలి మనసు ఏం చెబుతుందో అదే ముఖ్యం....అలా అది కోరుకున్న విధంగా మనం జీవిస్తూ ఉండాలి ...!
                          ✡️✡️✡️✡️✡️
ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

Saturday, 7 October 2017

ప్రేమ విలువ


   

అనగనగా ఒక ద్వీపం ఉండేది. 

ఆ ద్వీపంలో ఆనందం, దుఃఖం, జ్ఞానం, ప్రేమ, ఈర్శ్యా ...మొదలైన అన్ని భావాలు - గుణాలు - లక్షణాలు జీవించేవి.

అకస్మత్తుగా ఒకరోజు ఆ ద్వీపం శాశ్వతంగా మునిగిపోతుందనీ అందువల్ల సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లండని ప్రకటించబడింది.

ఆ ద్వీపంలోని భావాలు - గుణాలు - లక్షణాలు అన్నీ ద్వీపాన్ని విడిచి పోవడానికి పడవలను ఏర్పాటు చేసుకున్నాయి.

ప్రేమ మాత్రం చివరి క్షణం వరకు  ఆ  ద్వీపాన్ని విడువలేక ఉండిపోయింది. ఎటువంటి ఏర్పాట్లు చేసుకోలేకపోయింది.

ద్వీపం దాదాపు మునిగిపోతునప్పుడు ప్రేమ సహాయం కోరడం ప్రారంభించింది.

అదే సమయంలో "రిచ్ నెస్ (ధనవంతత్వం) " అద్భుతంగా ఏర్పాటు చేసుకున్న ఒక పెద్ద ఓడలో వెళుతూ ఉంటే...ప్రేమ సహాయం అడిగింది.

ప్రేమను చూసి రిచ్ నెస్ "ఓ ప్రేమా! నేను  ఇప్పుడు సహాయం చేయలేను! ఎందుకంటే ఈ ఓడ బంగారం, వెండి, విలువైన రత్నాల పెట్టెలతో పూర్తిగా నిండిపోయి ఉంది. ఒక్కరికి కూడా స్థలం లేదు!! ఇంకా చాలా మంది ఉన్నారుగా! వారిని అడుగు" అంటూ వెళ్లిపోయింది.

ప్రేమ  అందమైన పెద్ద ఓడలో అటుగా వెళుతున్న "గర్వాన్ని"సహాయం అడిగింది.

"ప్రేమా! నేను నీకు సహాయం చేయలేను! నువ్వు పూర్తిగా తడిసిపోయి ఉన్నావు! అదీగాక నీకు బురద అంటుకుని ఉంది. నిన్ను తీసికెళితే నా పడవ చెడిపోతుంది "అంటూ వెళ్లిపోయింది.

ప్రేమ దగ్గరగా వెళుతున్న "దుఃఖాన్ని" సహాయం అడిగింది.

"ప్రేమా! నేను నీకు సహాయం చేయలేక పోయినందుకు చాలా దుఃఖపడుతున్నాను!!! ఎందుకంటే ఈ పడవను నా ఒక్క దాని కోసమే తయారు చేసుకున్నాను.ఇందులో మరో వ్యక్తి పట్టలేరు!! " అంటూ వెళ్లిపోయింది.

ప్రేమ అటుగా వెళుతున్న "ఆనందాన్ని "సహాయం అడిగింది.

" క్రొత్త ప్రదేశాలనూ, క్రొత్త అనుభవాలను రుచి చూడ బోతున్నానన్న సంతోషంతో ఉన్న " ఆనందానికి" ప్రేమ మాటలు వినిపించనేలేవు.

ఆ వెనుకనే వచ్చిన "ఈర్ష్య"ను సహాయం అడిగింది.

" తనను అందరూ దాటి వెళుతున్నారు.వాళ్ళను ఎలాగైనా దాటి ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్న " ఈర్ష్య" ప్రేమ మాటలను విని కూడా విననట్టు వెళ్ళిపోయింది.

అకస్మాత్తుగా ప్రేమను ఎవరో పిలిచారు." ఓ ప్రేమా! ఇటు రా! నా పడవలో ఎక్కు! నేను నిన్ను తీసికెళతాను." అంటూ ఓడలోకి ఎక్కించుకుంది. ఆ పడవలో మరికొంత మంది కూడా కూర్చుని ఉన్నారు. వాళ్ళనూ,ఆ పడవలోని వ్యక్తులను చూస్తూ ప్రేమ మైమరచి పోయింది.

పడవ ఒడ్డుకు చేరుకున్న తర్వాత సహాయం చేసిన ఆ వ్యక్తి ఎలా అకస్మాత్తుగా సహాయం చేసిందో అంతే అకస్మాత్తుగా తన దారిన తాను వెళ్లి పోయింది.

ప్రేమ ప్రక్కనే ఉన్న "జ్ఞానాన్ని" ప్రశ్నించింది.

" నాకు సహాయం చేసింది ఎవరు????"

"అది' కాలం'!!" అంది జ్ఞానం.

"కానీ ఎందుకు' కాలం' నాకు సహాయం చేసింది?" అడిగింది ప్రేమ.

అప్పుడు మెరుస్తున్న కళ్ళతో జ్ఞానం ఇలా చెప్పింది.

"ప్రేమ ఎంత విలువైనదో అర్ధం చేసుకోగలది కాలం మాత్రమే!!!!"

                          ✡️✡️✡️✡️✡️

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.

ఉచిత సలహా గాళ్ళు...


         

రైలు కిటికీ నుండి చూసిన 24 సం. వయసున్న అబ్బాయి సంతోషంతో గట్టిగా అరిచాడు ...

"నానా! చెట్లు వెనక్కి వెళ్తున్నాయి!"

ఆ అబ్బాయి తండ్రి నవ్వి , ప్రేమగా తన కొడుకు తల నిమిరాడు.

  ప్రక్కనే కూర్చున్న ఒక యువ జంట చాలా జాలితో 24 ఏళ్ల అబ్బాయి పిల్లతనం ప్రవర్తన  చూస్తున్నారు.

 అకస్మాత్తుగా ఆ అబ్బాయి మళ్ళీ ఆశ్చర్యముతో ...

"నానా! మేఘాలు మనతో నడుస్తున్నాయి!చూశావా!"
.
ఇక ఆ యువజంట ఆగలేకపోయారు.

ఆ అబ్బాయి తండ్రితో ...

"మీ కొడుకును మంచి వైద్యుడికి చూపించలేక పోయారా?" అని జాలిగా ప్రశ్నించారు
.
.
ఆ అబ్బాయి తండ్రి  నవ్వి ఇలా చెప్పాడు ...
.
" అదే చేసాను!   మేము ఇప్పుడు ఆసుపత్రి నుండే వస్తున్నాం!! నా కొడుక్కి పుట్టినప్పటి నుండి కళ్ళు లేవు. నేటికి అదృష్టవశాత్తు వైద్య సహాయం దొరికి తనకు కళ్ళు  వచ్చాయి! అందుకే ఆ ఆనందం !!!!!
                                      ✡️✡️✡️

కాబట్టి అనవసరంగా ఉచిత సలహాలు ఇవ్వకూడదు.
ఎవరి కష్టాలు వారికే తెలుసు!!!.

ధన్యవాదములతో
గురుమంచి రాజేంద్రశర్మ.

Monday, 2 October 2017

ఊరుకుంటానా ???


   


ముఖం మీద వాలిందండి ఒక దోమ. 

అది చూసి అతని భార్య లాగి లెంపకాయ కొట్టింది. 

ఉలిక్కి పడి ..

” ఎందుక్కొట్టావు” అన్నాడు.. 

“దోమ” అంది భార్య ..

” అయినా అంత గట్టిగా కొట్టవెందుకు “అన్నాడు భర్త..

“నే త్రాగావలసిన నెత్తురు మరొకరు త్రాగితే ఊరుకుంటానా మరి ?”