Saturday, 30 September 2017

ఆస్వాదనం




ఒక కథ ....


అనువాదం:- గురుమంచి రాజేంద్రశర్మ



సమీపంలో ఏదో భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి ...

నేను ప్రతిరోజూ సాయంత్రం వాకింగ్ చేస్తూ అక్కడ కాసేపు కూర్చుంటాను.

చాలామంది పేద కార్మికులు  అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని నివసిస్తూ పనిచేస్తుంటారు.  వారి  పిల్లలు ఒకరి చొక్కా మరొకరు  పట్టుకొని "రైలు బండి రైలు" అనే ఆట ఆడుతుంటారు.
ఎవరైనా ఒకరు ఇంజిన్ అవుతారు మిగిలినవారు  బోగీలు అవుతారు ..
ప్రతిరోజూ ఈ పిల్లలు మలుపులు తిరుగుతూ కేరింతలు కొడుతూ ఆడుతూవుండే ఈ ఆటను చూడడం నాకు ఇష్టమైన దినచర్యగా మారిపోయింది ...

చాలా రోజులుగా వాళ్ళ ఆటను గమనిస్తున్నాను.ఇంజన్ గా ఉన్న పిల్లవాడు మరోరోజు బోగీగా.. బోగీగా ఉన్న పిల్లలు ఇంజన్ గా ఇలా మారుతూనే ఉన్నారు.

కానీ, ఒక చిన్న బాలుడు,సగం నిక్కరు మాత్రమే ధరించి తన చేతిలో ఒక చిన్న ఆకుపచ్చ వస్త్రాన్ని పట్టుకుని రోజువారీ గార్డుగానే  ఉంటున్నాడు ...

 ఒకసారి నేను వెళ్ళి అడిగాడు ...

"బాబూ ! నువ్వు కూడా ఒక ఇంజిన్ లేదా బోగీగా మారి అడుకోవచ్చు కదా! ఎప్పుడూ గార్డ్ గానే ఎందుకుంటున్నావు?...

అతను మృదువుగా ప్రత్యుత్తరం ఇచ్చాడు ...

 "సర్, నాకు ధరించడానికి ఒక చొక్కా లేదు, కాబట్టి ఇతర పిల్లలు నన్ను పట్టుకుని రైలును ఎలా తయారుచేస్తారు?

ఆ మాటలు చెబుతున్నప్పుడు
నేను అతని కళ్ళలో కొంచెం తేమ గమనించాను..

నేను అతనితో మరి కాసేపు మాట్లాడిన తర్వాత జీవితానికి సంబంధించిన ఒక  గొప్ప పాఠం నేర్చుకున్నాను....!

అతను చొక్కా కోసం ఇంట్లో  అడిగాడు,అరిచాడు,అలిగాడు, ఎంతగా ప్రయత్నించాలో అంతగా ప్రయత్నించాడు.కానీ, ఇంట్లో ఆరోగ్య పరమైన మరో అత్యవసర ఖర్చులుండడం వల్ల అతని తల్లిదండ్రులు  అతనికి చొక్కాని కొనుగోలు చేయలేకపోయారు...

కానీ,ఆ పిల్లవాడు తన ప్రయత్నం విఫలమైనందుకు నిరాశ చెందలేదు.  బదులుగా  అతను తనను తాను ఆస్వాదించడానికి  ఆనందంగా ఉండడానికి మరొక మార్గం ఎంచుకున్నాడు ...!

జీవితంలో మనం  కోరుకున్న అన్ని విషయాలను పొందలేము...

నాకు బైక్ లేదు, నాకు కారు లేదు, నాకు ఇల్లు లేదు..ఇలా రకరకాలుగా  అసంతృప్తిని అనుభవిస్తుంటాము...లేనిదాని గురించి ఆలోచిస్తూ ఆస్వాదించడాన్నీ - ఆనందంగా ఉండడాన్ని మరిచిపోతుంటాము.

జీవితంలో జీవం లేకుండా బ్రుతుకుతుంటాము ....!

ఆ పిల్లవాడితో సంభాషించిన తర్వాత నేను నేర్చుకున్న పాఠం ఇది.

మన కోరికలు నెరవేరడం కోసం పూర్తి ప్రయత్నం చెయ్యాలి.మన కోరికలు నెరవేరవచ్చు! నెరవేరకపోవచ్చు! కానీ అంత వరకు ఉన్నవాటితోనే జీవితాన్ని ఆస్వాదించే మార్గాలను అన్వేషించాలి.

మన లక్ష్యం ఆస్వాదించడం - ఆనందంగా ఉండడమే.పనిముట్ల గూర్చి ఆలోచిస్తూ ఉన్న అసలు లక్ష్యాన్ని కోల్పోకూడదు..... !!


ఇంగ్లీష్ మెసేజ్ కు తెలుగు అనువాదం : -గురుమంచి రాజేంద్రశర్మ

No comments:

Post a Comment