Monday, 8 August 2016

తీర్థయాత్రల వల్లా , పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్లా ఫలితం ఏమిటి ?

దేవాలయాలు - తీర్థ స్థలాలు
---------------------------------------

రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


"తరంత్య నేనేతి తీర్థం "  అని వ్యుత్పత్తి:

అంటే "తరింపచేసేది తీర్థమని అర్థం. "

దేవాలయాలు - తీర్థ స్థలాలు మనుషులను పాపం నుండీ, అపవిత్రత నుండి తరింపజేస్తాయి.
తీర్థ స్థలాలను - దేవాలయాలను దర్శించడం వల్ల మానవులలో ఒకేసారి శారీరక - మానసిక -బౌద్ధిక - ఆథ్యాత్మిక - వికాసం జరిగి వేగంగా తేజస్సు పెరుగుతుంది.

ఇదంతా ఎలా జరుగుతుందో చూద్దాం!

వ్యక్తులైనా, ప్రదేశాలలైనా తేజస్సు పెరిగినా కొద్ది ఫలితమిచ్చే శక్తి పెరుగుతూ ఉంటుంది.

ఉదాహరణకు...

కేవలం శ్రమశక్తి మాత్రమే కలిగిన ఒక వ్యక్తి ఒక రోజంతా కష్టపడి రాళ్లు కొడితే వచ్చే ఫలితం కన్న జ్ఞాన శక్తి కూడా కలిగిన ఇంజనీయర్ లాంటి మరోవ్యక్తి ఒకరోజు కష్టపడితే వచ్చే ఫలితం ఎక్కువ...... ఇలా వ్యక్తులలో తేజస్సు పెరిగిన కొలది ఫలితం పెరుగుతూ ఉంటుంది.
అలాగే...
తేజస్సు తక్కువగా ఉన్న పేద దేశాలలో
ఒకరోజు కష్టపడితే వచ్చే ఫలితం కన్న తేజస్సు అధికంగా ఉన్న అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో ఒకరోజు కష్టపడితే వచ్చే ఫలితం ఎక్కువ.

.....ఇలా వ్యక్తులైనా, దేశాలైనా, ప్రదేశాలలైనా తేజస్సు పెరిగినా కొద్ది ఫలితమిచ్చే శక్తి పెరుగుతూ పోతుంది.

ఇదే సూత్రం ఆథ్యాత్మిక విషయాలకు కూడా వర్తిస్తుంది.

తీర్థ స్థలాలు అని పిలువబడే ప్రదేశాలన్నీ అత్యధిక ఆథ్యాత్మిక తేజో క్షేత్రాలు. అందుకే వాటిని పుణ్యక్షేత్రాలు లుగా పిలుస్తారు.వీటికి ఆ మాహత్త్యం ఆథ్యాత్మిక - చారిత్రక కారణాల వల్ల సిద్ధిస్తుంది.

ఉదాహరణకు .....

1. పుణ్యక్షేత్రాలలో ఉండే నదులు తాము జన్మించిన నుండి సముద్రంలో కలిసేటంత వరకు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి.అలా నిరంతర ప్రవాహం వల్ల ఏర్పడిన క్రియాశీలత వల్ల నదులు తాము ప్రవిత్రంగా ఉండడమే కాక, ఇతరులను కూడా పవిత్రపరిచే మాహత్త్యాన్ని సిద్ధింపజేసుకుంటాయి.అందువల్ల నదులలో స్నానం వల్ల మనుషుల్లో కూడా క్రియాశీలత పెరిగి పాప రూపమైన సోమరితనం తొలగి తేజోవంతులౌతారు.

2. చాలా పుణ్యక్షేత్రాలు మహాత్ములు తమ ఆథ్యాత్మిక సాధనల ద్వారా సంపూర్ణ తేజోవంతులై ఆత్మజ్ఞానాన్ని పొందిన ప్రదేశాలై ఉంటాయి. అలాంటి ప్రదేశాలకు కూడా మాహత్త్యం సిద్ధించి ఇతరులను పవిత్రపరిచే శక్తిని కలిగి ఉంటాయి.

3. మన ఇంట్లో ఒక గదిలోకి కోపం - దు:ఖం - ఈర్శ్య - అసూయ.... వంటి భావావేశాలు లేకుండా ప్రశాంత చిత్తంతో ప్రవేశించి ధ్యానం చేయడం ప్రారంభించామనుకోండీ!
ఈ నియమాన్ని కొన్ని సంవత్సరాల పాటుగా పాటిస్తే ఆ "గది " కొద్దిపాటి తీర్థ స్థలంగా మారి, తర్వాత.. తర్వాత కోపమూ లేదా దు:ఖంతో ఒక వ్యక్తి అందులోకి ప్రవేశించినా... వెంటనే ప్రశాంత చిత్తుడయ్యే మాహత్త్యాన్ని ఆ గది సిద్ధింపజేసుకుంటుంది.
అలాంటి గది నే "పూజా గది " అంటాము.
ఇలాంటి నియమాన్నే ఒక గ్రామంలోని ప్రజలు ఒక మందిరం విషయంలో పాటిస్తే... ఆ మందిరం మరింత శక్తి కలిగిన తీర్థ స్థలం అవుతుంది.దాన్నే మనం "దేవాలయం" అంటాము.

ఈ నియమాన్నే కొన్ని లక్షల, కోట్ల మంది ఒక ప్రదేశం విషయంలో వందల - వేల సంవత్సరాల పాటు పాటిస్తే అది అత్యంత శక్తివంతమైన తీర్థ స్థలం అవుతుంది. అలాంటి స్థలాలలో చేయబడిన కర్మలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి.
.... ఇలా రకరకాల ఆథ్యాత్మిక - చారిత్రక కారణాల రీత్యా పుణ్యక్షేత్రాలకు ఆ మాహత్త్యం సిద్ధిస్తుంది.

ఆథ్యాత్మిక దృష్టితో లోతుగా పరిశీలించినపుడు ఈ విషయాలు అర్ధం అవుతాయి.

ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది.

పుణ్యక్షేత్రాలు అత్యధిక ఫలితాన్ని ఇచ్చే ప్రదేశాలు. అక్కడ ఉన్న సందర్భంలో చాలా జాగరూకతతో వ్యవహారించవలసి ఉంటుంది.

'' పుణ్యక్షేత్రే కృతం పుణ్యం బహుధా బుుద్ధిమృచ్ఛతి| పుణ్యక్షేత్రే కృతం పాపం మహదణ్వపి జాయతే ॥ " అని శాస్త్రం.

అంటే పుణ్యక్షేత్రాలలో చేసిన పుణ్యం కొంచెమైనా, అనేక రెట్ల ఫలితాన్ని ఇచ్చినట్లుగానే అక్కడ చేసిన చిన్న పాపం కూడా అత్యధిక పాప ఫలంగా పరిణమిస్తుంది.

మరో విషయం.

మనం అనుభవించే ప్రతీ కష్టం వల్ల పాపం ఖర్చుచేయబడుతుంది.
అలాగే
మనం అనుభవించే ప్రతీ భౌతిక సుఖం వల్ల పుణ్యం ఖర్చు అవుతుంది.

అందుకే పుణ్యక్షేత్రాలన్ని బాగా కష్టపడి వెళ్లే విధంగానే ఉంటాయి. అక్కడ అనుభవించే కష్టం వల్ల మనలోని అనేక రెట్ల పాపం తొలగిపోతుంది. పుణ్యక్షేత్రాలలో వీలైనంత తక్కువ భౌతిక సుఖాలనే అనుభవించాలి.

అంతే కాక పుణ్యక్షేత్రాలలో మద్యం - మాంసం  - జూదం.. మొll విలాసాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.లేకపోతే ఉన్న పుణ్యఫలం కూడా ఖర్చు చేయబడి తేజో విహీనులై కష్టాల బారిన పడవలసి వస్తుంది.

"వినా పూజన దానాది పాతకం నచ దూరత: "
అని శాస్త్రం.

కాబట్టి పుణ్యక్షేత్రాలలో ఉన్నప్పడు వీలైనంత దానధర్మాలు - భగవంతుని నామాన్ని స్మరించడం (జపం) - స్తోత్ర పారాయణం... మొ|| సాధ్యమైనంత ఎక్కువగా చేయాలి.

కేవలం పుణ్యక్షేత్రానికి వెళ్లినంత మాత్రాన శుభం జరుగదు.అక్కడ మనం ఎలా వ్యవహరించామన్నదే ముఖ్యం. దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు అత్యధిక ఫలితమిచ్చే శక్తి క్షేత్రాలు మాత్రమే!

కాబట్టి సనాతన ధర్మ వైభవాన్ని అర్థం చేసుకుని వీలైనంత ఎక్కువగా
పుణ్యక్షేత్రాలనూ - దేవాలయాలను సేవిస్తూ పునీతులమై మరింత అభివృద్ధి చెందే ప్రయత్నం చేద్దాము !

          ( ఓపికగా చదివిన వారికి )
           ధన్యవాదములతో
       
          గురుమంచి రాజేంద్ర శర్మ



1 comment: