ఆనందం నుంచి ఎటువైపు ప్రయాణం
---------------------------------------------------
రచన :- గురుమంచి రాజేంద్రశర్మ
ఒక వ్యక్తి బాల్యంలో చాలా ఆనందంగా ఉండేవాడు.
మిత్రులతో దగ్గరే ఉన్న చిన్న అడివిలోకి "పరికి పండ్లు"తెంపుకోవడానికి వెళ్లేవాడు. ఆ చిన్న అడవిలోని చెట్టూ పుట్టలతో స్నేహం చేసేవాడు. గిల్లి-దండ, బొంగరం, కోతికొమ్మంచిలాటి ఆటలాడేవాడు. ఆ చిన్న అడవిలోని చెట్ల ఆకుల మాటున దాగి ఉండే బంగారు పురుగులను వెతికేవాడు. దొరికితే ఆనందంతో కేరింతలు వేసేవాడు. వాటిని ఒక దారానికి కట్టి ఆడించేవాడు.వాటికి ఆకలౌతుందని కొన్ని ఆకులను తినిపించేవాడు. అయ్యో పాపం! అని వదిలివేసేవాడు. ఆకలైనపుడు అడవిలోని సీతాఫలాలు - నేరడి పండ్లు - బల్చి పండ్లు తెంపుకు తినేవాడు లేదా తోటల్లో మిత్రులతో కలిసి మక్కెండ్లు (మొక్కజొన్న బుట్టలు ) కాల్చుకు తినేవాడు. అక్కడక్కడ గుడులు - దేవుల్లు కనిపిస్తే భక్తితో ఏ కోరిక లేకుండా ఒకే ఒక క్షణం నమస్కరించి పరిగెత్తే వాడు. చెరువుల్లో కుంట బావుల్లో మిత్రులతో కలిసి "బుర్రకాయలను " భుజాన వేసుకుని ఈదులాడడానికి వెళ్లేవాడు. ఊర్లోకి వస్తూ వస్తూ ఎవరో కొందరు పెద్దలు గొడవపడి పంచాయితీలు పెట్టుకుని అరుస్తూ ఉంటే అర్థం కాకపోయినా కాసేపు నిల్చుని వింతగా చూసేవాడు. ఇంటికి వచ్చి ఇంతవరకు తిరిగి వచ్చినందుకు తిట్లు తినేవాడు. తరవాత తినేసి ఓళ్లు తెలియకుండా నిద్ర పోయేవాడు.
అయినా అతను ప్రతి క్షణం ఆనందంగా ఉండేవాడు.
చూస్తుండగానే రోజులు క్షణాల్లా గడిచిపోయాయి.
అతడు పెద్ద క్లాసుల్లోకి వచ్చాడు.
అప్పుడు కూడా అతను ఆనందంగానే ఉండేవాడు.
క్రొత్త వాతావరణంలో కూడా తానే ముందుగా పలకరిస్తూ నవ్వుతూ క్రొత్త పరిచయాలు చేసుకునేవాడు. తోటిమిత్రులతో జోకులేసుకుంటూ నవ్వుతుండేవాడు. చదివే సమయాలలో చదివేవాడు. వాలీబాల్ - క్రికెట్టు -కబడ్డి - షటిల్ - బ్యాట్ మెంటెన్ వంటి ఆటలాడేవాడు. మిత్రుల చెల్లెలి పెండ్లైతే తన చెల్లెలి వివాహం అన్నంత కష్టపడి పనిచేసేవాడు. తన మిత్రుని అన్నకు ఏక్సిడెంట్ అయితే తన మిత్రులందరితో కలిసి ఆ కుటుంబానికి అండగా ఆ హాస్పిటల్ వద్దే పడిగాపులు కాసేవాడు. ఆకలైనపుడు మిత్రులతో కలిసి దొరికింది తినేవాడు. టూర్లకు వెళ్లేవాడు. బస్ స్టేషన్ - రైల్వే స్టేషన్లలో పడుకునేవాడు. ఇంట్లో ఉన్నప్పుడు తల్లికి పనుల్లో సహాయం చేసేవాడు. తల్లి ఒడిలో పడుకుని కాసేపు ముచ్చట్లాడే వాడు. తండ్రి చెబితే కరెంట్ బిల్లులు కట్టొచ్చేవాడు. తండ్రి చెప్పిన ఇతర పనులు చేసుకొచ్చేవాడు.
" రోజంతా ఈ తిరగడమేమిట్రా ! " అని తండ్రి చెడామడా మందలిస్తుంటే మౌనంగా ఉండేవాడు. తిట్టిన రోజు రాత్రి తాను పడుకున్నాననుకుని దగ్గరకు వచ్చి తన నుదిటిపై తండ్రి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ హాయిని కూడా మౌనంగా ఆస్వాదించేవాడు.
అయినా అతను ప్రతి క్షణం ఆనందంగానే ఉండేవాడు.
కాలం క్షణంలా గడిచింది.
అదృష్టం కలిసివచ్చి సర్పంచ్ అయ్యాడు. MPP అయ్యాడు. MLA అయ్యాడు. తరువాత మంత్రి కూడా అయ్యాడు.
చుట్టూ ఉన్న సమాజం తనను గౌరవించసాగింది. తాను కూడా గౌరవంగా మసలుకోసాగాడు. జోకులెయ్యడం మానేసాడు. కష్టపడే అవసరం తగ్గిపోయింది. తన చుట్టూ తిరిగే వారందరి పనులు చేసి పెడుతున్నాడు. పలుకుబడి గల వ్యక్తులతో విందులు - వినోదాలు - ఫైవ్ స్టార్ హోటల్ భోజనాలు. గుళ్లూ గోపురాలు కూడా ఎక్కువగా దర్శిస్తున్నాడు. తిరుపతి వెళ్లినా క్యూ కట్టే అవసరమే లేదు. స్వామి నాకు ఇంతకన్నా మంచి పోస్ట్ వస్తే నీ హుండీలో ఇంత డబ్బు వేస్తాను అంటూ మ్రొక్కుతున్నాడు.ఇంట్లో విషయాలు - పిల్లల విషయాలన్నీ భార్యే చూసుకుంటుంది. చాలా విషయాలు తన అసిస్టెంట్లే చూసుకుంటున్నారు. తన పలుకుబడి - మంత్రి స్టేటస్-బిజీ... పాత మిత్రులనందరిని దూరంగా ఉంచింది. తనపై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి కనిపించినా సంతోషాన్ని నటిస్తూ ఆలింగనం చేసుకుంటున్నాడు. మనసులో ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఉన్నట్లు నటించడం అభ్యాసం చేశాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చదివి భార్యకు రోజూ " ఐ లవ్ యూ " చెబుతున్నాడు. కానీ తాను ఫీలింగ్ తో చెప్పడం లేదని తనది తనకే అర్థమౌతుంది. తాను అలా చెప్పినపుడు తన భార్య కూడా "ఐ టూ " అంటుంది. అయినా అతని మనసు ఆ ఫీలింగ్ ను స్వీకరించడం లేదు.
పుట్టినరోజు వచ్చినపుడు కుప్పలు తెప్పలుగా గ్రీటింగ్ లు వస్తున్నాయి. ఎందుకో ఏ ఒక్కటి అతనికి నచ్చడం లేదు.
ఇప్పుడు ఆస్తులు - అంతస్తులు - పలుకుబడి - మంది మార్బలం ఉన్నా ఎందుకో అతను ఆనందంగా ఉండలేకపోతున్నాడు. ఎవరినీ హృదయపూర్వకంగా ప్రేమించలేకపోతున్నాడు. వారి ప్రేమను స్వీకరించలేకపోతున్నాడు. ఎందుకో భరించలేని ప్రేమ రాహిత్యంగా - ఒంటరితనంగా అనిపిస్తుంది.
చుట్టూ "సార్ ! సార్! సార్! " అనే పిలుపుల మధ్య " ఏం రా! " అనే పిలుపుల కోసం హృదయం ఉవ్వీళ్లూరుతుంది. తాను ఏ స్థాయిలో ఉన్నా తనను తిట్టి మందలించే తల్లిదండ్రులు చనిపోయారు.
నిజానికి అతనికి "తనను ఎప్పుడూ ఆకాశానికి ఎత్తి పొగుడుతుండే మంది - మార్బలం " అంటే చికాకు . కానీ ఒంటరిగా ఉండలేని పరిస్థితి. ఒకవేళ ఒంటరిగా వుంటే భరించలేని అశాంతి . అందుకే తప్పనిసరియై ఈ "మంది -మార్బలాన్ని " ఉంచుకుంటున్నాడు. ప్రతీ రాత్రి ఆ అశాంతిని మర్చిపోవడానికి తన పెద్ద ఇంట్లో ఒక చిన్న బార్ ను ఏర్పాటు చేసుకుని తాగి పడుకుంటున్నాడు. అయినా నిద్రరావడం కష్టంగా ఉంది.
కాలం చాలా భారంగా గడుస్తుంది.
పదవికాలం ముగిసింది. మళ్లి ఎలక్షన్లు వచ్చాయి. ఆ వ్యక్తి ఓడిపోయాడు. చుట్టూ ఎప్పుడూ ఉండే "మంది - మార్బలం " దాదాపుగా తగ్గిపోయింది. పాత మిత్రులు మొదటే దూరమయ్యారు. వ్యాపారాలు భార్య అసిస్టెంట్లే మొదటి నుండి చూసుకుంటారు. అప్పుడప్పుడు టివీ షోలలో మాట్లాడడం - లేదా టీవీలో ప్రస్తుత రాజకీయాలు చూడడం- ఫోన్.
అంతర్గతంగా భరించలేని ఒత్తిడి. బిపి - షుగర్ ముందే వచ్చాయి. ఇప్పుడు పెరాల్సిస్ (పక్షవాతం) ఎటాక్ అయ్యింది. ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు అతను మళ్లి మామూలు మనిషి కావడం కష్టం అన్నారు.
హాస్పిటల్లో ICU గదిలో షాక్ నుండి కోలుకున్న తరవాత అతను కళ్లు మూసుకుని ఆలోచించడం మొదలు పెట్టాడు.
" ఎందుకు తన పరిస్థితి ఇలా అయింది? ఎక్కడ పొరపాటు చేశాడు? "
ఆలోచించగా ఆలోచించగా అతనికి సమాధానం దొరికింది.
" తాను తనలాగా ఉండడం మానివేశాడు. నటించడం ప్రారంభించాడు. చివరకు భార్యా పిల్లల వద్ద కూడా!
ఈ సమాజం అంటే తన చుట్టూ ఉండే "మంది - మార్బలం " అనుకుని , వాళ్లు తనను ఊహించుకున్నట్లుగా తాను తయ్యారవ్వడానికి ప్రయత్నించాడు.
..... అలా నటిస్తూ నటిస్తూ ... ఆనందాన్ని కోల్పోతూ చివరకు " తనను తానే కోల్పోయాడు. "
"ఆ క్షణం అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఒకవేళ తనకు అవకాశం లభించి తన జీవిత కాలం పొడిగించబడితే "తాను తనలాగే జీవించాలని ".
కళ్లు తెరిచేసరికి భార్య ఏడుస్తూ ఎదురుగా కూర్చుని ఉంది. అతను తాను కదపగలిగే చేతితో తన భార్య చేతిని ప్రేమగా నొక్కాడు.
ఈ సారి అతనికి తన ప్రేమ ఫీలింగ్ తెలుస్తూ ఉంది. ఆమె ప్రేమకూడా అతనిలోకి ప్రవహించి ఒక రకమైన హాయిని ఇచ్చింది.
ఇప్పుడతడు ప్రేమించడం - ప్రేమను స్వీకరించడం రెండూ నేర్చుకున్నాడు.
స్వస్తి
అసారే సంసారే విషయ విషపూరే పటుతరే
ప్రవాహే ఘోరే మాం మలినతర మోహేన పతితమ్ |
భ్రమన్తం ధావన్తం మనసి విలపన్తం కరుణయా
సముద్ధర్తుం కృష్ణోవసతు మమ హృద్ధామ్ని సతతమ్ ॥
( ఓపికగా చదివిన వారికి)
ధన్యవాదములతో

Nice story, Dhanyavadamulu.
ReplyDeleteThank you venumadhav garu
Delete